కళాజగతిలో... చెరగని ముద్ర
తొంభై ఐదో ఏట, సుదీర్ఘ అనారోగ్యం తరువాత మరణం ఒక ఉపశమనం కావచ్చు. కానీ, ఆమె మరణం కళాభిమానులకు మాత్రం తీరని దుఃఖమే. అటు సంప్రదాయ కథక్ నృత్యంలో, ఇటు సినీ రంగంలో సితారాదేవి వేసిన చెరగని ముద్ర అలాంటిది. మంగళవారం నాడు కన్నుమూసిన ఆమె మిగిల్చిపోయిన తీపి గుర్తులు అనేకం.
జీవితమే ఒక నర్తన
దీపావళి సమయంలో ‘ధన్తేరస్’ నాడు పుట్టి, ధనలక్ష్మిగా పెరిగారామె. ఉత్తరాదిలో పురాణ కాలక్షేప తరహా ‘కథాకారుల’ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి సుఖ్‌దేవ్ మహరాజ్ నుంచి కృష్ణాలీలా ‘కథాకార్’గా ఆ కౌశలాన్ని పుణికిపుచ్చుకున్నారు. గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన వారు నృత్యానికి దూరంగా ఉండే రోజుల్లోనే రంగం మీదికి వచ్చారు. కథక్ నృత్యకారిణిగా ఎదిగారు. ఆ అభినయ ప్రతిభ చూసే తండ్రి ఆమె పేరును ‘సితారాదేవి’గా మార్చారు. కథక్ నృత్య సమ్రాట్ బిర్జూ మహరాజ్ తండ్రి అచ్చన్ మహరాజ్‌తో సహా పలువురు అత్యుత్తమ గురువుల వద్ద కథక్‌లో ఆమె శిక్షణపొందారు. పిన్న వయసులోనే మూడు గంటల తన నృత్య ప్రదర్శనతో సాక్షాత్తూ ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగూర్‌ను మైమరచేలా చేశారు సితారాదేవి. ఆమె నృత్యానికి ముగ్ధులైన టాగూర్ ఆమెను ‘నృత్య సామ్రాజ్ఞి’గా అభివర్ణించారంటే, ఆ వయసులోనే ఆమె చూపిన నర్తన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.
ఎంచుకున్న నాట్యరంగంలో ఎంతో పేరొచ్చినా, లేశమంతైనా అలక్ష్యం చేయకుండా... కృషి ఆపకుండా ఆమె నిరంతరం సాధన చేసేవారంటే ఆశ్చర్యం కలుగుతుంది. నృత్యంలో దిట్ట అంటే చాలు చిన్నవారి దగ్గరకు వెళ్ళి సూచనలు, సలహాలు తీసుకోవడానికి కూడా ఆమె వెనకాడేవారు కాదు. తనను ‘దీదీ’ (అక్కయ్య) అని పిలిచే ఇరవై ఏళ్ళు చిన్నవాడైన బిర్జూ మహరాజ్‌ను సైతం నృత్యంలో ‘గురువు’గా భావిస్తూ, ‘గురుభక్తి’ని చూపేవారు. ‘‘ఒక రోజు సితార ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. కానీ, ఆమె నృత్యం చేయడానికే సిద్ధమైంది. నృత్యం చేయాల్సి వస్తే, ఆరోగ్యం గురించి పట్టించుకోని అంకితభావం ఆమెది’’ అని బిర్జూ మహరాజ్ వ్యాఖ్యానించారు.
అభినయ సితార
హిందీ చిత్రసీమలో కథక్కు ఒక ప్రత్యేక స్థానం తేవడంలో బెనారస్ ఘరానా (శైలి, సంప్రదాయం) కి చెందిన సితార పాత్రను విస్మరించలేం. నృత్యపాటవమే ఆమెను ‘ఉషా హరణ్’ ద్వారా సినిమాల్లోకి తెచ్చింది. ఆ సినిమా విడుదల ఆలస్యమైనా, ఈ లోగానే 1930ల చివర్లో సినీవినీలాకాశంలో ఆమె అక్షరాలా ‘సితార’ అయ్యారు. 1940లలో నాయికగా వెలిగారు. 1950ల తరువాత వెండితెర నటనకు స్వస్తి చెప్పి, వేదికపై కథక్ నర్తకిగా సేవ కొనసాగించారు.
విరామం లేకుండా నర్తించడంలో ఆమెకున్న సత్తా, అలాగే అభినయ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరిచేవి. చివరకు, 90వ పడిలో పడ్డాక కూడా కథక్ అంటే ఆమె చూపిన ఉత్సాహం, అంకితభావం నవతరానికి నిరంతరం స్ఫూర్తినిచ్చేవి. నృత్యకళాకారులు శారీరకంగా దృఢంగా ఉండాలని ఆమె భావించేవారు. అప్పుడే అనాయాసంగా ప్రదర్శనను రక్తికట్టించగలమని శిష్యులకు నూరిపోసేవారు. అందుకే, వ్యాయామం మీద దృష్టి పెట్టమనేవారు. ఆమె దీర్ఘకాలం పాటు నర్తనను కొనసాగించగలగడానికి అది కూడా తోడ్పడిందని చెప్పాలి. గమ్మత్తేమిటంటే, సితారాదేవి అక్కలైన అలకనంద, తారాదేవి కూడా నర్తకీమణులే. సినిమాల్లో నర్తించినవారే! ఇక, కథక్ కళాకారుడిగా ఖ్యాతి గడించిన గోపీకృష్ణ ఆమె సోదరి తారాదేవి కుమారుడే!
స్వతంత్ర వ్యక్తిత్వం
విమర్శలకు వెరవకుండా ప్రాచీన కథక్ రూపానికి ఆధునికత రంగరించిన సితారాదేవి కళారంగంలోనే కాక... జీవితంలోనూ స్వతంత్రతను ప్రదర్శించారు. నచ్చిన రీతిలోనే జీవించారు. నజీర్ అహ్మద్‌ఖాన్‌తో జీవితం పంచుకున్న సితార, ఆ బంధం తెగిపోయాక, ప్రసిద్ధ ‘మొఘల్- ఏ- ఆజవ్ు’ చిత్ర దర్శక-నిర్మాత కె. ఆసిఫ్‌ను పెళ్ళాడారు. విభేదాలతో విడిపోయాక తూర్పు ఆఫ్రికాలో పర్యటన సందర్భంగా గుజరాతీ కుటుంబాలతో ఏర్పడిన స్నేహం ఫలితంగా, ఆ కుటుంబానికి చెందిన ప్రముఖుడు ప్రతాప్ బారోట్‌తో కలసి ఏడడుగులు నడిచారు. అయితే, ఆసిఫ్ మరణించినప్పుడు ఆయనకు చట్టబద్ధమైన భార్యగా హిందూ సంప్రదాయ విధానంలో తన ఇంట్లోనే అపర కర్మలూ చేశానని ఆమే ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. నిర్ణయాల్లోనే కాదు... అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పడంలోనూ ఆమెది వెనుకంజ వేయని తత్త్వమే. నిజజీవితంలోనూ ఆమె నిర్మొహమాటంగానే వ్యవహరించేవారు. ఫలితంగా, ఆమె నోటికి దడిచి, దూరం పెట్టిన వారూ లేకపోలేదు. అయినా ఆమె తన తత్త్వాన్ని మార్చుకోలేదని తెలిసినవారంటారు. నటుడు దిలీప్ కుమార్‌ను సోదరుడిగా భావించే సితార కొన్ని దశాబ్దాలుగా ఏటా ఆయనకు రాఖీ కట్టేవారు. ఒక సందర్భంలో ఏకంగా తొమ్మిది గంటల పాటు కథక్ నృత్యం చేసి, అందరినీ అబ్బురపరచిన సితారాదేవి లాంటివారు అక్షరాలా కళ కోసమే జీవించిన నటరాజ పాదసుమాలే! ఇప్పుడీ సుమం సాక్షాత్తూ ఆ నటరాజు పాద సన్నిధికే చేరిందేమో!
- రెంటాల
కూచిపూడికి వెంపటి... కథక్కు సితార
సినిమాల్లో సితారాదేవి నటనతోనూ, రంగస్థలంపై ఆమె కథక్ నృత్యాలతోనూ, ఎవరి పాటలు వారే పాడుకొనే టాకీల తొలి దశకంలో నటిగా ఆమె పాటలతోనూ నాది చిరకాల పరిచయం. 1940లలో మెహబూబ్ వారి సినిమాల్లో ఆమె నటిస్తూ, పాడిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తు. దిలీప్ కుమార్, నర్గీస్, బల్రాజ్ సాహ్నీ నటించగా, కె. ఆసిఫ్ నిర్మించిన ‘హల్చల్’లో మునివేళ్ళ మీద నిల్చొని ఆమె చేసిన బ్యాలే డ్యాన్స ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతోంది. అలాగే, ‘అంజలి’లో బౌద్ధ భిక్షువైన చేతన్ ఆనంద్‌ను తన కుమార్తె నిమ్మీకి వశపడేలా చేసేందుకు వాద్యసంగీతానికి నర్తించే దృశ్యంలో భిల్లస్త్రీగా సితారాదేవి నటన ఇవాళ్టికీ గుర్తుంటుంది. ఆమెది అద్భుతమైన నృత్యం కానీ, గాత్రం కొద్దిగా కటువు. ‘రోటీ’ చిత్రంలో భిల్ల యువతిగా ఆమె నటన, పాడిన పాటలు నాకు గుర్తే. అశోక్‌కుమార్‌తో నటించిన ‘నజ్మా’లోనూ ఆమె పాడారు. ఆమె పాడిన పాటల గ్రావ్‌ుఫోన్ రికార్డులు డజను దాకా నా దగ్గరున్నాయి. మద్రాస్ కృష్ణగానసభలో ‘నాట్యకళాసదస్సు’కు ఏళ్ళక్రితమొచ్చినప్పుడు ఆమెతో మాటామంతీ జరిపి, ఆటోగ్రాఫ్ తీసుకొన్నా.
కథక్‌తో పాటు ‘జాగ్తే రహో’ చిత్రం ద్వారా పేరొచ్చిన మనోహర్ దీపక్‌తో కలసి మగవేషం వేసుకొని మరీ ఆమె ఎన్నో ఏళ్ళు వేదికపై పంజాబీ ‘భాంగ్రా’ నృత్యం ప్రదర్శించేవారు. వారిద్దరూ వేదికపైన, బయట జంటగా వెలిగారు. గోపికలు రోదిస్తుండగా, కృష్ణుడు మధురకు వెళ్ళడం (‘కృష్ణా మధురా గమన్’) అంశానికి తానొక్కతే కృష్ణ, రాధ, గోపికలుగా ఆమె చేసే అభినయం అపూర్వం. తక్కిన కథక్ కళాకారులకు భిన్నంగా ‘చక్కర్లు’ కొడుతూ ఒక ముద్రలో సరిగ్గా ఆగడం, ప్రతిసారీ ఒక్కో విధమైన భావం, భంగిమ చూపడం ఆమెలోని విశేషం. ఒక్కమాటలో చెప్పాలంటే, పాతకాలపు కూచిపూడి నృత్యానికి మన వెంపటి చినసత్యం ఆధునిక సొబగులు ఎలా అద్దారో, అలాగే పాతపద్ధతిలోని కథక్‌ను ఆధునికంగా తీర్చిదిద్దిన ఘనత సితారది. విచిత్రం ఏమిటంటే, ఆ రోజుల్లో ఆమెలోని ఈ ప్రయోగశీలతను విమర్శించిన కథక్ నర్తకులు సైతం ఆ తరువాత కాలంలో ఆమె నవీన ఆవిష్కరణలన్నిటినీ తమ నృత్యంలో భాగం చేసుకున్నారు. జీవితంలోనూ, కళా జీవితంలోనూ తనకు నచ్చినట్లే బతికిన కళాకారిణికి జీవించి ఉండగానే దక్కిన అపూర్వ గౌరవమది!
- వి.ఎ.కె. రంగారావు, ప్రసిద్ధ సంగీత - నృత్య- సినీ విమర్శకులు
ఆ సేవను గుర్తించామంటారా?
బ్రిటన్, అమెరికాలతో సహా దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలిచ్చిన చరిత్ర సితారాదేవిది. కథక్ కొరియోగ్రాఫర్‌గా వెండితెరపై మధుబాల, రేఖ, మాలాసిన్హా, కాజోల్‌లతో అడుగులు వేయించారు. సంగీత, నాటక అకాడెమీ అవార్డు (1969), పద్మశ్రీ (’73), కాళిదాస్ సమ్మాన్ (’95) సహా అనేక గౌరవాలు దక్కాయి. 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారం ప్రకటిస్తే, సితారాదేవి తిరస్కరించారు. ‘‘ఇన్నాళ్ళకు ఈ పురస్కారం నాకు ఇవ్వాలనుకోవడం గౌరవం కాదు, అవమానం. ఇన్ని దశాబ్దాలుగా కథక్కు నేనందించిన సేవలు ప్రభుత్వానికి తెలియవా? ‘భారతరత్న’కు తక్కువ మరే పురస్కారం అంగీకరించను’’ అని ప్రకటించిన నిర్మొహమాటి ఆమె.