కాకులూ.. ఇటు రాకండి..!
మనుషులకు భాష ఉంది కాబట్టి పలానా పనిచేయకం డని నేరుగా మాట్లాడి చెప్పొ చ్చు.. మరి జంతువులకు, పక్షులకు ఎలా చెప్పాలి? ఏమీ లేదు.. పేపర్ మీద రాస్తే సరి.. అలా ఎలా సాధ్యం అనుకుంటే జపాన్‌లో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే మరి! జపాన్‌కు చెందిన కత్సుఫుమి శాటో ఒక ప్రొఫెసర్. ఆయన ఒట్సుషిచిలోని యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. వర్సిటీలోని రీసెర్చ్ సెంటర్ పైభాగంలో కొన్ని పైపులు ఉన్నాయి.
మూడేళ్ల క్రితం ఆ పైపులకు ఉన్న ఇన్సులేషన్ మెటీరియల్‌ను తరచుగా కాకులు పీక్కొని తమ గూడు నిర్మాణం నిమిత్తం తీసుకెళ్లేవి. దీంతో పైపులు పాడయిపోయేవి. ఎన్నిసార్లు కాకులను పారద్రోలినా మళ్లీ వచ్చేవి. దీంతో విసిగిపోయిన శాటో.. కాకుల నిపుణుడు అయిన సుటోము టకేడా అనే తన స్నేహితుడిని ఆశ్రయించాడు. శాటో బాధ విన్న సుటోము కాకులకు కనిపించేలా పేపర్‌పై కొన్ని గుర్తులు పెట్టమని, వాటిపై ‘కాకులు ఇక్కడికి రాకండి’ అని అర్థం వచ్చేలా రాయమని సూచించా డు.
సుటోము అలా చెప్పగానే శాటో పకపక నవ్వి ఆ విధంగా రాస్తే కాకులు రావా? అంటూ ఎగతాళి చేశాడు. ఏమో రాకపోవచ్చేమో! ఒకసారి ప్రయత్నించి చూడు అని సుటోము చెప్పాడు. సుటోము చెప్పినట్లే శాటో ఆ పేపర్లపై రాసి కాకులకు కనిపించేలా పెట్టాడు. వాటిని చూసిన కాకులు మెల్లిమెల్లిగా రావడం మానేశాయి. శాటో అదృష్టమో లేక టైమ్ బాగుండో కాకులు దగ్గరికి కూడా వచ్చేవి కావు. వర్సిటీ సిబ్బంది ఆ పేపర్లను చూపిస్తూ కాకులను హెచ్చరించడం వల్ల అవి భయపడి ఉంటాయని సుటోము తెలిపారు. అంతేకాకుండా కొన్ని గుర్తులతో ఉన్న ఆ పేపర్లను చూసి కాకులు భయపడి ఉంటాయని వివరించారు.