kaumudi
-
బీఎస్ఎఫ్ డీజీగా రాకేష్ ఆస్థాన నియామకం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్ధానా సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆస్ధానా ప్రస్తుతం ఢిల్లీలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆస్ధానా 2021 జులై 31 వరకూ బీఎస్ఎఫ్ డీజీగా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2002 గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం వంటి హైప్రొఫైల్ కేసులను ఆయన విచారించారు. ఇక 1997లో సీబీఐ ఎస్పీగా ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో పశుగ్రాస స్కాంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన అరెస్ట్ చేశారు. ఇక సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా రాకేష్ ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో ఆయనకు విభేదాలు తలెత్తాయి.ఓ మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి వీరి పరస్పర ఆరోపణలు కలకలం రేపాయి. కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదిర్శిగా కౌముది కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఏపీ క్యాడర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కౌముది నియమితులయ్యారు. కౌముది ప్రస్తుతం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక యూపీ క్యాడర్‌కు చెందిన ఆయన బ్యాచ్‌మేట్ మహ్మద్ జావేద్ అక్తర్ ఫైర్ సర్వీసులు, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : సీబీఐ కోర్టులో మాజీ డైరెక్టర్‌కు ఊరట -
పుత్తూరులో ఆపరేషన్ పూర్తి: కౌముది
చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆపరేషన్ పూర్తయింది. ఉగ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్ అలియాస్ మున్నాను ఆక్టోపస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అంబులెన్స్‌లో చెన్నైకు తరలించారు. ఓ మహిళ సహా ముగ్గురు పిల్లలు లొంగిపోగా, వారిని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు సంఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ లక్ష్మణ్‌కు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు అదనపు డీఐజీ వీఎస్కే కౌముది తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆక్టోపస్ ఆపరేషన్ పూర్తయిందని, బిలాల్ మాలిక్, ఇస్మాయిల్ అనే ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఒక మహిళ, ముగ్గురు పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. సీఐ లక్ష్మణ్‌ను గాయపరిచిన కేసులో వీరిపై కేసు నమోదు చేసినట్లు అదనపు డీఐజీ కౌముది వివరించారు. కాగా, ఉగ్రవాదులు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పేలుళ్లు జరపడానికి కుట్ర పన్నుతున్నట్లు వచ్చిన కథనాల గురించి మాత్రం తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కౌముది చెప్పారు. శుక్రవారం రాత్రినుంచి కొనసాగిన ఆపరేషన్.. శనివారం సాయంత్రానికి ముగిసింది. ఉగ్రవాదులున్న ఇంటి గోడలను డ్రిల్లింగ్ చేసి మరీ ఈ ఆపరేషన్‌ను ఆక్టోపస్ పోలీసులు దిగ్విజయంగా పూర్తిచేశారు.