ఎస్.ఐ పై టీడీపీ కార్యకర్తల దాడి
స్థానిక ఎన్నికల వేళ చిత్తురు జిల్లా పాల సముద్రం మండలం కావేరి రాజపురంలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెడుతు ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడున్న టీడీపీ కార్యకర్తలను స్థానిక ఎస్.ఐ అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని సదరు కార్యకర్తలను ఎస్.ఐ హెచ్చరించారు. అప్పటికి వారు వినకపోవడంతో వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ తీవ్ర స్థాయిలో ఎస్.ఐ హెచ్చరించారు.
అంతే మమ్మల్ని హెచ్చరించే స్థాయి నీదా అంటూ టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎస్.ఐపై దాడికి దిగారు. ఆ ఘటనలో ఎస్.ఐ గాయపడ్డారు. దాంతో పోలీసులు ఆగ్రహంతో టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు దెబ్బకు టీడీపీ కార్యకర్తలు కాళ్లకు పని చెప్పారు. స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలింగ్‌ను నిలిచిపోయింది. దాంతో పోలింగ్ బూత్‌లోని అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో జోనల్ ఉన్నతాధికారులు హుటాహుటిన కావేరి రాజపురం చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో దాదాపు గంట తర్వాత పోలింగ్ తిరిగి ప్రారంభమైంది.
అయితే కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేల్పుచర్లలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆదినారాయణపై ఆగంతకులు దాడి చేశారు. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆదినారాయణను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదినారాయణపై దాడిని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.