KAVETI SAMMAIAH
-
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత
కాగజ్‌నగర్: కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు కావేటి సమ్మయ్య (63) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య కావేటి సాయిలీల, ముగ్గురు కుమారులు ఉన్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమ్మయ్య 2007లో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాగజ్‌నగర్ పట్టణంలో సాగిన 300 రోజుల రిలే దీక్ష శిబిరాన్ని ముందుండి నడిపించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై 7 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర సాధనలో భాగంగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2012లో అసెంబ్లీ భవనంపై ఎక్కి నల్ల జెండాతో నిరసన తెలిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావేటి సమ్మయ్య బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. కొన్ని కారణాల వల్ల 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమ్మయ్య మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కావేటి మృతిపై కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావేటి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమంలో కావేటి పాత్ర మరువలేనిది: కేటీఆర్ కావేటి సమ్మయ్య మరణం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌సహా పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో సమ్మయ్య చురుగ్గా పనిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కావేటి పాత్ర మరువలేనిదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు సమ్మయ్య మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మండలి చైర్మన్, స్పీకర్ సంతాపం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కావేటి సమ్మయ్య మరణం పట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. సమ్మయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. కేసీఆర్ సంతాపం
సాక్షి, ఆసిఫాబాద్ : సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమనాయకుడైన కావేటి సమ్మయ్య 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్సీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల ఆయన కుటుంబీకులు, నియోజకవర్గ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. సీఎం కేసీఆర్ సంతాపం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపుతూ ఈ విషాద సమయంలో గుండెనిబ్బరంతో ఉండాలన్నారు. కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, పార్టీ నేతలు సంతాపం తెలిపారు. -
టీఆర్ఎస్కు ‘కావేటి’ రాజీనామా
సాక్షి, ఆసిఫాబాద్ : టీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గురువారం రాజీనామా చేశారు. కాగ జ్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తమ గురించి ఏమి మాట్లాడక పోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. సిర్పూర్లో గెలిచే అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కేసీఆర్ సభ రోజే కావేటి దంపతుల రాజీనామా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
న్యాయం చేయకుంటే రెబల్‌గా పోటీ
కాగజ్‌నగర్(కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా): సిర్పూర్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఉద్యమ సమయంలో పార్టీలో పనిచేసి రెండుసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలి పొందానని, తెలంగాణ కోసం సైతం ఒకసారి రాజీనామా చేశానని అలాంటి తనకు టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ హైకమాండ్ అన్యాయం చేసిందని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో టీఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకొని అధికా రం చేపట్టినా ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారని వేరే పార్టీతో గెలిచిన ఆంధ్ర వ్యక్తిని తీసుకున్నారని, అప్పుడు పార్టీకి అవసరమేనని తానుకూడా ఓడిపోయానని ఊరుకున్నానన్నా రు. ఐదేళ్లుగా పార్టీ హైకమాండ్‌ను కలిసిన ప్రతిసారి తనకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చానని, తప్పకుండ న్యా యం చేస్తామని హైకమాండ్ హామీ ఇచ్చి ఇప్పుడు తనను కాదని టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడం బాధాకరమన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోపజకవర్గంలో బీసీని కాదని బీసీలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే నాపై అధి ష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని నేనేప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. హైకమాండ్ పునరాలో చించి బీసీలకు, తెలంగాణ కోసం పోరాడిన వారికి న్యా యం చేయాలన్నారు. ఒక్కరోజు కూడా తెలంగాణ జెండా పట్టని, తెలంగాణ కోసం వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు పార్టీలో ఉన్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను, కేసీఆర్‌ను విమర్శించిన వ్యక్తికి టికె ట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆంధ్ర, తెలంగాణ వేరైనా సిర్పూర్‌కు తెలంగాణ రాలేదని, కోట్లు సంపాదించి దౌర్జన్యాలు, అట్రాసిసీ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకమాండ్ పునారాలోచించి నిర్ణయం తీసుకోకుంటే రెబల్‌గా బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంటెంకి శ్రీహరి మాట్లాడుతూ దళితుల ఓట్లతో గెలిచి దళితులను అనణదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. మాజీ మున్సి పల్ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య సతీమ ణి కావేటి సాయిలీల మాట్లాడుతూ ఉద్యమకారులను విస్మరించడం సరైంది కాదన్నారు. అధిష్టానం మరోసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ తమకు న్యాయం చేయకుంటే బరిలో ఉండి ప్రత్యర్థిని ఓడించి తీరుతామని హెచ్చరించారు. -
గులాబీ దండుకు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు శుక్రవారం మంచిర్యాలలో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన వారు.. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు చేరారు. వారి రాకతో తూర్పు జిల్లా నేతలంతా స్టేషన్‌కు వచ్చారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఖాళీ చేతులతో వెళ్తున్న తామంతా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తిరిగి వస్తామని ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు, హరీశ్వర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, భిక్షపతి, డాక్టర్ రాజయ్య, మహమూద్‌అలీ, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి రైలు నుంచి ప్లాట్‌ఫాం వద్ద దిగగా.. వారిని తెలంగాణవాదులు పూలమాలలతో ముంచెత్తారు. జై తెలంగాణ.. అమరవీరులకు జోహార్ అంటూ నినదించారు. నుదుటిన తిలకం దిద్ది తదుపరి వీడ్కోలు పలికారు. ఇందులో టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, నాయకులు చిట్ల సత్యనారాయణ, తోకల రాయమల్లు, సిరిపురం రాజేశ్, సుదమల్ల హరికృష్ణ, సురేశ్‌బల్దవా, ముక్త శ్రీనివాస్, కర్రె లచ్చన్న, అత్తి సరోజ, బండి పద్మ, తిరుమలయాదవ్, జోగుల శ్రీదేవి, విద్యార్థి నాయకులు సోహైల్‌ఖాన్, సుదమల్ల కృష్ణతోపాటు కోల్‌బెల్ట్, తూర్పు జిల్లా పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, మంచిర్యాలటౌన్