kavi
-
కవి సామ్రాట్ మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
-
యుగకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
‘కవనార్థంబుదయించితిన్, సుకవితా కార్యంబు నా వృత్తి’ అని చెప్పుకున్నాడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణం చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న మహాకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి. ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి ఆస్థానకవి. 1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది. అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది. తిరుపతి వేంకటకవులుగా జగత్ ప్రసిద్ధులైన ఈ జంటలో అగ్రజుడు చెళ్లపిళ్ల. ఈ మహాకవి పుట్టి నేటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి. 1870, ఆగస్టు 8వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించాడు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్య. అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి, తన గళానికి, కలానికి ఎదురులేదని నిరూపించుకున్నాడు. చిన్ననాడు చూసిన తాళపత్ర గ్రంథాలు చెళ్లపిళ్లపై అపురూపమైన ముద్ర వేశాయి. వీరి విద్యాభ్యాసం చాలా గ్రామాల్లో సాగింది. కాశీ కూడా వెళ్ళాడు. పాండిత్యంతో పాటు వివిధ సారస్వత అంశాలు గ్రహించి వచ్చాడు. కవితా జీవితంలో అవధానకవిగా నానా రాజ సందర్శనం చేసి అఖండ యశస్సు పొందాడు. ఎంతమంది దగ్గర విద్యాభ్యాసం చేసినా, చర్ల బ్రహ్మయ్యశాస్త్రినే ప్రధాన గురువుగా భావించాడు. వేంకటశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఇతని అసలు పేరు వేంకటాచలం. జంటకవిత్వానికి, అవధాన విద్యకు, పద్యనాటకాలకు వీరు తెచ్చిన మోజు అంతా ఇంతా కాదు. తదనంతర జీవితంలో లబ్ధ ప్రతిష్టులైన ఎందరో కవి, పండితులు చెళ్లపిళ్ల శిష్యులే కావడం విశేషం. బందరు హైస్కూల్లో అధ్యాపకుడుగా పనిచేయడం చెళ్లపిళ్లకు బాగా కలిసొచ్చిన అంశం. విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళికాటూరి, వేలూరి శివరామశాస్త్రి వంటివారెందరో బందరులో స్కూల్లో ఈయన దగ్గర చదువుకున్నారు. వీరికి శిష్యగణం, శత్రుగణం, భక్తగణం అన్నీ ఎక్కువే. ఎవరినైనా సరే ఎదిరించాలి, గెలవాలి, గుర్తింపు తెచ్చుకోవాలి, అనే పట్టుదల చెళ్లపిళ్లకు మొదటి నుండీ ఉంది. గురువు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, శిష్యులు వేంకటరామకృష్ణకవులతోనూ విభేదాలు వచ్చాయి. సాటి కవులు, సంస్థాన పండితులు, దివాన్లతోనూ వివాదాలు వచ్చాయి. సంచలనాత్మకమైన యుద్ధం కొప్పరపు సోదరకవులతో జరిగింది. ఈ వివాదాలు ఆధునిక సాహిత్య చరిత్రలో సుప్రసిద్ధం. చెళ్లపిళ్ల గుంటూరుసీమ అనే గ్రంథమే రాయాల్సి వచ్చింది. లక్కవరం జమిందార్ రాజా మంత్రిప్రగడ భుజంగారావు బహద్దూర్ కలుగజేసుకొని, ఈ వివాదాలకు ముగింపు పలికారు. వివాదాలు ఎలా ఉన్నా, అద్భుతమైన పద్యాలు తెలుగునాట సందడి చేశాయి. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి. అద్భుతమైన ధారణ ఈయన సొత్తు. పద్య పఠనం పరమాద్భుతం. సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది. పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు, పిట్టకథలు, సామెతలతో చెళ్లపిళ్ల ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవశించేవారు. ‘మంచి కవిత్వం అంటే ఏమిటి’ అనే అంశంపై విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో, చెళ్లపిళ్ల 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు. ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్లపిళ్ల మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు. వేంకటశాస్త్రికి ధిషణ, ధిషణాహంకారం, లౌక్యం అన్నీ ఎక్కువే. అదే సమయంలో మెత్తని మనస్సు కూడా. తన ఎద ఎల్ల మెత్తన, శిష్యులన్న ఎడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన అని అందుకే విశ్వనాథ అన్నాడు. చెళ్లపిళ్ల జంటకు కొప్పరపు సోదరకవులతో కొంత కాలం వివాదాలు నడిచినా, తదనంతరం, చెళ్లపిళ్ల దగ్గరుండి కొప్పరపుకవుల కుమారులతో అవధానాలు చేయించాడు. వానలో తడవని వారు, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి కవితాధారలో మునగనివారు తెలుగు జగాన లేరు. అంతటి ఆకర్షణ, చమత్కారభరితమైన శైలి చెళ్లపిళ్ల సొత్తు. తొలి రోజుల్లో, సంస్కృత సమాస చాలనా జ్వలితమైన కవిత్వం వ్రాసినా, తర్వాత కాలంలో తెలుగుకవిత్వం వైపు మళ్లారు. ఎన్నో కావ్యాలు, శతకాలు, అనువాదాలు, నాటకాలు రాశారు. పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై కూర్చోపెట్టిన ఘనత వీరిదే. తద్వారా, వాడుకభాషకు వీరు చేసిన సేవ అనుపమానం. అతి సామాన్యులకూ తెలిసే స్థితిలో నా కవిత్వం ఉంటుందని చెప్పుకున్న చెళ్లపిళ్ల, ఆ మాట అక్షరాలా నిలబెట్టుకున్నాడు. ఇదొక భాషాపరమైన విప్లవం. చెళ్లపిళ్లది ఎంతటి ధారాశుద్ధి బంధురమైన పద్య కవిత్వమో, అంతటి చక్కని వచన రచనం కూడా. చెళ్లపిళ్లవారి రచనలు చదవడం ప్రారంభిస్తే, చివరి అక్షరం వరకూ ఆగకుండా చదివిస్తాయి. అంతటి ఆకర్షణా శిల్పం ఆ రచనలో ఉంటుంది. కథలు– గాథలు, దీనికి చక్కని ఉదాహరణ. తిరుపతి కవిజంటలో మీసాలు పెంచింది కూడా ఈయనే. తెలుగు పద్యాన్ని ఏనుగుపై ఊరేగించాడు. పద్యాలను ప్రబంధాల కౌగిళ్ళ నుండి బయటకు తెచ్చి, ప్రజల నాలుకలపై నర్తనం చేయించాడు. ‘ఏనుగునెక్కినాము, ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము’ అంటూ పద్యపౌరుషంతో జీవించిన యుగపురుషుడు చెళ్లపిళ్ల. తెలుగుపద్య జెండాపై నిలిచిన కవిరాజు, యుగకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కొప్పరపు కవుల మనుమడు మాశర్మ -
సామాన్య మానవుడే దిగంబర కవిత్వానికి కేంద్రం
అదే మా బృందం ధ్యేయం అన్ని భావజాలాలూ అవసరమే కవిత్వానికి సామాన్యుడు కేంద్ర బిందువు కావాలి ‘సాక్షి’తో ప్రముఖ కవి నగ్నముని రాజమహేంద్రవరం కల్చరల్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వ్యవస్థలో అవినీతి, వివక్ష పెరిగిపోయాయని ప్రముఖ కవి, దిగంబర కవిత్వానికి ఆద్యుడు నగ్నముని తెలిపారు. ఒకప్పుడు ఫలానా వ్యక్తి లంచం తీసుకుంటాడని చెప్పుకునేవాళ్లం.. ఈ రోజుల్లో ఎవరైనా లంచం తీసుకోకుంటే అతడి పేరు చెప్పుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రముఖ కవి స్మైల్ (ఇస్మాయిల్) జయంతి ఉత్సవంలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన దిగంబర కవిత్వం పుట్టు పూర్వోత్తరాలు, లక్ష్యాలు, సమకాలీన సాహిత్య ధోరణులపై ‘సాక్షి’తో శుక్రవారం ప్రత్యేకం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... అవినీతి, వివక్షలను ఎత్తి చూపడానికే... శ్రీశ్రీ అభ్యుదయ కవి. మహాప్రస్థానం స్వాతంత్య్రం రాకముందే ఆయన రచించారు. ముద్రణ మాత్రం తరువాత కాలంలో జరిగింది. స్వాతంత్య్రం వచ్చాక, వ్యవస్థలోని అవినీతి, వివక్షలను సమాజానికి ఎలుగెత్తి చెప్పడానికి తొలిసారి దిగంబర కవుల కవిత్వం సంపుటి– 1 ముద్రించాం. నాతోపాటు నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండ రాజు, భైరవయ్య తదితర కవుల రచనలు ఇందులో చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో 1965లో అర్ధరాత్రి 12 గంటలకు రిక్షా కార్మికునిచే ఈ పుస్తకావిష్కరణ చేశాం. రెండో సంపుటి ఆవిష్కరణ 1966లో విజయవాడ గవర్నరుపేట సెంటర్లో ఒక హోటల్ కార్మికుని చేతుల మీదుగా జరిగింది. మూడో సంపుటి ఆవిష్కరణ కూడా 1968లో అర్ధరాత్రి సమయంలో ఒక బిచ్చగత్తె చేతుల మీదుగా విశాఖలో జరిగింది. కవిత్వానికి సామాన్యుడు కేంద్రబిందువు కావాలన్నదే మా లక్ష్యం. అన్ని సాహిత్యాలూ అవసరమే అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, మహిళా సాహిత్యం, దళిత సాహిత్యం ఇలా ఎన్నో భావజాలాలు. ఒక్కో ప్రక్రియ ఒక్కో అంశంపై ఫోకస్ చేశాయి. సంప్రదాయ సాహిత్యాన్ని మేము తిరస్కరించడం లేదు. నన్నయకు నమస్కరించాక, నేటి వరకూ కొనసాగుతున్న సాహిత్య ధోరణులను కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. నా సాహితీసేద్యం ఉన్నవ లక్షీ్మనారాయణ 1970లో రాసిన మాలపల్లి నవలను నాటకీకరించాను. రెండున్నర గంటల ప్రదర్శనకు అనుకూలంగా రాశాను. ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో నేటి వరకూ సుమారు 110 ప్రదర్శనలు ఇచ్చాం. దివిసీమ ఉప్పెన నేపథ్యంలో రాసిన కొయ్యగుర్రం కావ్యం ఇంగ్లిష్తో సహా 9 భాషల్లోకి అనువదించారు. ఈ అంశంపై వెలువడిన తొలి రచన ఇది. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని దృష్టిలో పెట్టుకుని ‘విలోమ కథలు’ రాశాను. ఆకాశ దేవత, అౖద్వైతరాజ్యం నా ఇతర రచనలు. ‘స్వ’గతం నగ్నముని నా కలం పేరు. నిజ నామధేయం మానేపల్లి హృషీకేశవరావు. 1940లో తెనాలిలో జన్మించాను. శాసనసభలో 40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను. ఎమర్జెన్సీ సమయంలో నన్ను డిస్మిస్ చేశారు. 18 నెలలు ఉద్యోగానికి దూరమయ్యాను. జనతా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాను. -
కావ్య ప్రపంచ సృష్టికర్త ‘కవి’
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘అపారమైన కావ్యప్రపంచానికి సృష్టి కర్త కవి. ఒక కవిని సత్కరించుకోవడమంటే భగవంతుని సత్కరించుకోవడమే’ అని బొమ్మూరు తెలుగు సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం తెలుగుభాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమఘాట్‌లోని శ్రీవిశ్వవిజ్ఞానవిద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు గేయకవి మహమ్మద్ ఖాదర్‌ఖాన్‌ను స్కరించారు. ఈ సందర్భంగా సభాసంచాలకత్వం వహించిన ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ రాజులు ప్రపంచాన్ని శాసించగలరేమో గానీ అక్షరసృష్టితో కావ్యజగత్తుని శాసించగల సత్తా ఒక కవికి మాత్రమే ఉందన్నారు. రాజకీయాలు పెరిగాక కవులకు, కళాకారులకు, ఆధ్యాత్మిక వేత్తలకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని, ప్రేమతత్వాన్ని రంగరించి కవితలు అల్లుతున్న ఖాదర్‌ఖాన్‌ను సత్కరించుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. అధ్యక్షత వహించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పీఠంలో కుల, మత వివక్ష లేదన్నారు. స్వాగతవచనాలు పలికిన రాష్ట్రపతి సమ్మానిత చింతలపాటి శర్మ మాట్లాడుతూ భాష ప్రవాహం వంటిదని, పాత పదాలు పోయి, కొత్తపదాలు వస్తూనే ఉంటాయని అన్నారు. తెలుగు భాషలో అరబ్బీ, ఉర్దూ, పారశీపదాలు కలిసిపోయినట్టే, తెలుగు పదాలు అరబ్బీలో కలిసిపోయాయన్నారు. ఇతర భాషాపదాల వినిమయం ఏ భాషకైనా తప్పదన్నారు. వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తికి నివాళులర్పించారు. విశ్రాంత ప్రిన్సిపాల్ పసల భీమన్న, ప్రజాపత్రిక గౌరవసంపాదకుడు సుదర్శన శాసి్త్ర,నాట్యాచార్యుడు సప్పా దుర్గా ప్రసాద్ ప్రసంగించారు. ఉమర్ ఆలీషాచేతుల మీదుగా ఖాదర్‌ఖాన్‌ను సత్కరించారు. పలువురు సాహిత్యాభిమానులు హాజరయ్యారు. -
ఇచ్ఛాపురపు ఇక లేరు
సాక్షి, విశాఖపట్నం/ఎంవీపీకాలనీ : ప్రముఖ రచయిత, సావిత్రి బాయిపూలే ట్రస్ట్ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ అవయవ దాతల సంఘం ముఖ్య కార్యకర్త ఇచ్ఛాపురపు రామచంద్రం (72) ఆకస్మికంగా మతి చెందారు. ఆయన గుండె సంబంధిత ఇబ్బందితో ఈ నెల 5న నగరంలోని ఇండస్ ఆస్పత్రిలో చేరడంతో ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ఆయన పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 11 గంటలకు మరణించారు. రామచంద్రం మరణంతో రచయితలు, కవులు, అవయవ దాతల సంఘం ప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రామచంద్రం భార్య ఇదివరకే కన్నుమూశారు. ఆయనకు కుమార్తె కవిత, కుమారుడు రాజేంద్ర ఉన్నారు. అనకాపల్లిలో జీవిత బీమా సంస్థలో పనిచేసిన ఆయన పదవీ విరమణ అనంతరం నగరంలోని ఎంవీపీకాలనీలో ఉంటున్నారు. ఇలావుండగా ఇచ్ఛాపురపు కోరిక మేరకు ఆయన కళ్లను మోహిసిన్ ఐ బ్యాంకుకు, పార్ధివదేహాన్ని ఆంధ్ర మెడికల్ కళాశాలకు గురువారం సాయంత్రం అందజేశారు. రామచంద్రం పార్ధివదేహానికి ఆలిండియా ఆర్గాన్, బాడీ డోనార్స్ అసోసియేషన్ చైర్పర్సన్ గూడూరు సీతామహలక్ష్మి, సి.ఎస్.రావు, ఆనంద్, కన్యాకుమారి, ఎస్.సుమతి, అట్లూరి జ్యోతి, కె.బాలభాను, తదితరులు నివాళులు అర్పించారు. పలు రచనలు ఇచ్ఛాపురపు రామచంద్రం 500లకు పైగా కథలు, కథానికలు, రేడియో నాటికలు రాసి ప్రజాదరణ పొందారు. కాశీమజిలీ కథలను అనువాదం చేశారు. అంతేగాక అవయవ దాన ఆవశ్యకతపై సాగిస్తున్న ఉద్యమాన్ని వెన్నుదన్నుగా నిలిచారు. ఈ నెల 6న ప్రపంచ అవయవదాన దినోత్సవానికి ప్రెస్‌నోట్ స్వయంగా ఆయనే తయారు చేశారు. తీరని లోటు రామచంద్రం మంచి రచయిత. ఆయన అకాల మరణం అవయవ దాన ఉద్యమానికి తీరని లోటు. అవయవదాన ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ముందుకు నడిపించారు. అవయవ దానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు, వినతిపత్రాలు వంటివెన్నో ఆయనే రాసేవారు. ఈ నెల 6న జరిగిన ప్రపంచ అవయవదాన దినోత్సవానికి పత్రికా ప్రకటన కూడా ఆయనే తయారు చేశారు. –గూడూరు సీతామహలక్ష్మి, ఆలిండియా అవయవదాతల సంఘం చైర్పర్సన్