ఐడియాలజీల మూస నుంచి విముక్తి
దిగంబర కవిత్వోద్యమానికి 50 ఏళ్లు
ఆధునిక తెలుగు సాహిత్యంలోని వ్యాక్యూమ్‌ని మొట్టమొదటిసారిగా గుర్తించినది దిగంబర కవిత్వం. ఒక విస్ఫోటాన్ని సృష్టించడం ద్వారా మనం శూన్యంలో ఉన్నామన్న సంగతిని అది చాటిచెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే వ్యవస్థలలో, నిర్మాణాలలో కుదురుకొని కులాసాగా కాలక్షేపం చేస్తున్నవారికి అది విశ్రాంతి భంగంగా పరిణమించి అమితమైన చికాకు కలిగించింది. 'దిగంబర కవిత్వం' అన్న పేరే, వ్యవస్థను కప్పిన పాత కొత్త ఆచ్ఛాదనలన్నింటినీ ఉత్తరించి కొత్తగా దర్శించవలసిన అవసరాన్ని సూచిస్తుంది. అందుకు తగ్గట్టే అందులోని వస్తువు, డిక్షన్ల వెనుక పైకి అనేకత్వంగా కనిపించే అంతర్లీన వస్వైక్యత, నిర్మాణంగా కనిపించని ఒక నిర్మాణం కనిపిస్తాయి. అప్పటికి ఇరవై ఏళ్ళకే పాతముఖాలను కొత్తగా చూపించడానికి వేసిన మేకప్ చెరిగిపోయి పాలకుల అసలు ముఖాలు బయటపడిపోయాయి. నూతన రాజ్యంగా చెబుతున్నది పీడన, దోపిడి, అజ్ఞానం, అహంకారం మూర్తీభవించిన పాత రాజ్యానికి కొనసాగింపేనన్న సంగతి స్పష్టమైపోయింది.
ఆ విధంగా ఒక స్వప్నభంగం నుంచి పుట్టిన ఆక్రోశం దిగంబర కవిత్వం. ఆ ఆక్రోశం ఉద్దేశపూర్వకంగా తనకు అనుగుణమైన వస్తురూపాలను ఎంచుకొంది. అది మనకు అరాచకత్వంగా కనిపించింది. అంతకుముందు సాయుధోద్యమం సాగించి ప్రత్యామ్నాయ వ్యవస్థపై ఆశలు పెంచిన వామపక్ష భావాలను కూడా పార్లమెంటరీ ఆభాస ప్రజాస్వామ్యంలో చోటుచేసుకోవడం ఐడియాలజీల చివరి ఆశను కూడా శవపేటికలోకి చేర్చింది. ఐడియాలజీల నిరర్థకతను తేటతెల్లం చేసిన ఆ పరిణామం దిగంబర కవిత్వాన్ని సైద్ధాంతిక ప్రాతిపదికను తృణీకరించే ఒక ధిక్కార స్వరంగా మలచింది. ఆ విధంగా ఐడియాలజీల భ్రమల నుంచి బయటపడి ప్రజాస్వామ్యతాత్వికత అనే గీటురాయి మీద వ్యవస్థను నిలబెట్టే వెసులుబాటును దిగంబర కవిత్వం మొదటిసారిగా సాహిత్యంలో ప్రతిష్టించింది. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలకు చోటులేని నూతన ప్రజాస్వామ్యం అవతరించిన సంగతిని గుర్తించే దిగంబర కవిత ప్రజాస్వామికంగా విస్మృత (మార్జినలైజ్డ్) అయిన వర్గాలను వస్తువు చేసుకొంది. పాతనీ, కొత్తనీ కూడా సమానంగా కబళించి వ్యవస్థ కదలని కొండచిలువలా, బండరాయిలా పడి ఉండడాన్ని పోల్చుకొన్నది కనుకనే కసినీ, క్రోధాన్ని, ౠతును, మొరటుదనాన్ని దట్టించిన డిక్షన్‌ను ఆశ్రయించింది. దిగంబర కవిత్వం అవ్యవస్థీకృతంగా, విఘటిత నిర్మాణంగా ముందుకు రావడంలో, వ్యవస్థీకృతమైనదేదైనా కాలంలో ఘనీభవించిపోయి కొయ్యబొమ్మగా మారిపోతుందన్న సూచన ఉంది.
దిగంబర కవిత్వ నిర్మాణంలో ప్రధానంగా గుర్తించవలసిన మరొక అంశం, దాని opin-ended స్వభావం. అది ఏ నిర్దిష్టమైన ఫలశ్రుతినీ ప్రతిపాదించదు. అలా ప్రతిపాదించకపోవడమే ప్రజాస్వామ్య తాత్వికతకు దగ్గరగా ఉన్న లక్షణం. ప్రజలందరినీ ఆర్థికంగా, తద్వారా రాజకీయంగా, సాంఘికంగా సాధికారుల్ని, స్వతంత్రుల్ని చేసేవరకు అంతిమ ఫలశ్రుతిని, చివరి వాక్యాన్ని నిర్దేశించడానికి ప్రజాస్వామ్య తాత్వికత అవకాశం ఇవ్వదు. ఇందుకు భిన్నంగా ఇంతవరకు రాజ్యమూ, మతమూ, సాహిత్యమూ, సిద్ధాంతాలూ చేసింది అదే. అవి అస్వతంత్ర, క్రియాశీల చలనరహితులుగా ఉన్న ప్రజలకు అంతిమ ఫలశ్రుతులను, చివరి వాక్యాలను బోధించే ప్రయత్నం చేశాయి. అందులో భాగంగా వారిని రకరకాల వ్యవస్థలలో బంధించాయి. ఈ ప్రక్రియ దారుణ వైఫల్యమే ఇన్నేళ్ల చరిత్ర! క్లాడ్ లెఫార్ట్ తదితర కల్చరల్ థియరిస్టులు ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తూ అది ఒక ఖాళీ సెట్టు లాంటిదంటారు. ఏదో ఒక్క వర్గంతోనో, జాతితోనో, జెండర్తోనో, మతంతోనో, సిద్ధాంతంతోనో భర్తీ చేయడానికి ఆ ఖాళీ సెట్టు అనుమతించదు. ఈ ఖాళీ సెట్టు నిండేవరకు ప్రజాస్వామిక గమనం అసంపూర్ణ ప్రక్రియగానే మిగిలిపోతుంది. శాసించే అధికారం వ్యక్తుల నుంచి సమూహానికి సంక్రమించడమే ఈ ప్రక్రియకు చివరి మొట్టు. ఆ తర్వాత ప్రజలే అంతిమ ఫలశ్రుతినీ, చివరి వాక్యాన్నీ నిర్దేశిస్తారు.
అసంఖ్యాక ప్రజానీకాన్ని మార్జినలైజ్ చేసి ప్రజాస్వామ్యం పేరుతో కొందరే జాగాను ఆక్రమించుకొని ప్రజాస్వామ్యాన్ని వక్రీకరిస్తున్న స్థితిని దిగంబర కవిత్వం ప్రళయసదృశంగా ప్రదర్శించింది. ప్రజాస్వామిక రాజ్యాంగం సాయంతో పాతరోతనంతటినీ కడిగి శుభ్రం చేసి కొత్త వ్యవస్థా నిర్మాణం దిశగా దేశాన్ని చారిత్రకమైన మరో మలుపు తిప్పవలసిన స్వాతంత్య్రమనే నూతన సందర్భం ఒక నాన్- ఈవెంట్‌గా పరిణమించడంపట్ల తీవ్ర నైరాశ్య ఆక్రోశాలే దిగంబర కవిత్వమై ముంచెత్తాయి. ఇప్పుడు వెనుదిరిగి చూసుకొంటే ప్రజస్వామ్యాన్ని, రాజ్యాంగం ఉనికిని తెలుగు సాహిత్యంలో ప్రప్రథమంగా చర్చలోకి తీసుకువచ్చినది దిగంబర కవిత్వమేనన్న సంగతి స్పష్టమవుతుంది.
ఇందుకు భిన్నంగా, శ్రీశ్రీతో మొదలైన అభ్యుదయ, విప్లవ సాహిత్య ధోరణులు స్వాతంత్య్రం ఉనికినీ, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్నీ గుర్తించని 1920ల నాటి ఐడియాలజీల ఎజెండాలనుంచి స్ఫూర్తిని పొందినవి. నిర్దిష్ట ఫలశ్రుతిని బోధించినవి. ప్రత్యామ్నాయ రాజ్య వ్యవస్థను మాత్రమే లక్ష్యం చేసుకొన్నవి. మరోవైపు, దేశం ఆధునికతకు మళ్ళే క్రమంలో కొత్తగా అవతరించిన మధ్యతరగతి అస్తిత్వ పోరాటాన్ని అక్షరబద్ధం చేసిన సాహిత్యం వామపక్ష భావజాలంలో భాగంగానూ, విడిగానూ కూడా ఈ నూరేళ్లలోనూ కొనసాగుతూ వచ్చింది. కనుక నూరేళ్లకు పైబడిన ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను నిర్మించుకొనే సందర్భంలో, దానిని స్వాతంత్య్ర పూర్వ సాహిత్యంగా, స్వాతంత్య్రోత్తర సాహిత్యంగా విభజించుకోవలసిన అవసరాన్ని దిగంబర కవిత్వం స్థాపిస్తోంది. శ్రీశ్రీ ఆద్యుడుగా కొనసాగిన స్వాతంత్య్ర పూర్వ సాహిత్య దశను దిగంబర కవిత ఇర్రెలెవెంట్ చేసివేసి స్వాతంత్య్రోత్తర సాహిత్య దశను ప్రతిష్టించింది. ఆ విధంగా సాహిత్యాన్ని ఐడియాలజీల మూస నుంచి విడిపించి, స్వాతంత్య్రానంతర ప్రజాస్వామిక వాస్తవికతలోకి తీసుకువచ్చి సమకాలీనం చేయడంలో దిగంబర కవిత్వం వేగుచుక్క అయింది.
అయితే, వ్యవస్థీకృత రూపాలమీద, ఐడియాలజీల మీద పనిచేసే శక్తులు అప్పటికింకా బలవత్తరంగా ఉండడంతో దిగంబర కవిత్వం ఒక నిర్దిష్ట రూపంగా అనతికాలంలోనే అదృశ్యం కావలసి వచ్చింది. తాత్విక భావ సారూప్యత తగినంతగా కుదరని ఫలితంగా దిగంబర కవులు తలోవైపుకూ చెదిరిపోయారు. వాళ్ళలో కొందరు ఐడియాలజీల చట్రంలోనే భద్రతను, లేదా ఫలసిద్ధిని వెతుక్కొంటే కొందరు పూర్తిగా అజ్ఞాతంలోకి జారిపోయారు. వారిలో ఒకరిద్దరు కవిత్వంపై పశ్చాత్తాపాన్ని ప్రకటించినప్పటికీ అది అప్పటికే సమాజపరమైపోయి చారిత్రక పరిణామంగా మారిపోయింది.
వ్యవస్థ ఎంత జుగుప్సాకరంగా ఘనీభవించినప్పటికీ దానిని అభిశంసించడంలో దిగంబర కవిత్వం మరింత జుగుప్సను ఆశ్రయించి తిట్టును, ౠతును కవిత్వంగా చలామణి చేసే స్థాయికి వికటించడమూ కనిపిస్తుంది. ఫ్యూడల్ భావజాల ప్రభావంతో స్త్రీని కించపరిచే పదజాలం దిగంబర కవుల ప్రజాస్వామిక అవగాహనా పరిమితిని, లోపాన్ని సూచిస్తాయి. దిగంబర కవులు అనుసరించిన కవిత్వ నిర్మాణ పద్ధతీ, పదజాలమూ నాగరిక, సభ్య ప్రపంచాన్ని ఇక ఏ మాత్రమూ మెప్పించి ఒప్పించలేని స్థితికి చేరడం అనతికాలంలోనే దాని అదృశ్యాన్ని అనివార్యం చేసింది.
కల్లూరి భాస్కరం
9703445985
('గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం' నుండి...)