కవివంశం చరిత్ర
పుస్తక పరిచయం
తాళ్లపాక కుటుంబంలో తాత నుండి మనుమడి తరందాకా అందరూ కవులే! అట్లాగే, కూచిమంచి తిమ్మకవి నుంచి ఆయన మునిమనుమడి దాకా అందరూ కవులే! అయితే, ఒక వంశం వంశమంతా ‘కవివంశం’ అయిన చరిత్ర ‘మరింగంటి’ వారిది! సుమారు ఐదువందల ఏళ్లుగా వీళ్ల కుటుంబాలు సాహిత్యానికి అంకితమైనాయి. వీరిలో తొలికవుల్లో ఒకరైన సింగరాచార్యులు ఇబ్రహీం కుతుబ్షాహీల నాటివాడు; పొన్నికంటి తెలగన సమకాలికుడు. ద్విపదలు, యక్షగానాలు, నాటకాలు, శతకాలు, హరికథలు, తిరునామాలు, మంగళహారతులు, చాటువులు... ఇట్లా ఎన్నో ప్రక్రియల్లో మరింగంటి వారు రచనలు చేశారు.
అందులో, శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకళ్యాణం (ప్రబంధం-సింగరాచార్యులు), విష్వక్సేన ప్రభాకరము (ప్రబంధం-వేంకట నరసింహాచార్యులు- రెండవ), యాదగిరి నరసింహ శతకము (అప్పలాచార్యులు), కన్నీటిధార (లఘుకృతి- రామాచార్యులు), సుందరీ విలాసము (నాటకం-వేంకట నరసింహాచార్యులు- ఐదవ), శఠవైరి వైభవ దివాకరమ్ (అలంకారశాస్త్రం- నరసింహాచార్యులు) లాంటివి మచ్చుకు కొన్ని. ప్రధానంగా నల్లగొండకు చెందిన వారైనప్పటికీ వీరు కాలక్రమంలో కరీంనగర్, కృష్ణా, ఖమ్మం, తూర్పు గోదావరి, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, విశాఖపట్టణం, శ్రీకాకుళం, హైదరాబాద్ జిల్లాలకు విస్తరించారు.
మల్లంపల్లి మరింగంటి, బొబ్బిలి మరింగంటి, వేములవాడ మరింగంటి లాంటి భిన్న శాఖలుగా విడివడ్డారు. తిరిగి వీరందరినీ, ‘మరింగంటి కవుల సాహిత్య సేవ’ పేరిట ఒక దగ్గరకు చేర్చారు డాక్టర్ శ్రీరంగాచార్య. సాహిత్యకృషి చేసిన మరింగంటి వారి జీవనరేఖలు, వారి రచనలను పరిచయం చేశారు. వాళ్ల వివరాల సేకరణకు ఆయా ప్రాంతాలన్నింటా తిరగడం ఒక ఎత్తయితే, సుమారు 200 ముద్రిత, ఆముద్రిత రచనల్ని పరిచయం కోసం చదవడం మరొక ఎత్తు. 1989లో కాకతీయ విశ్వవిద్యాలయంలో సమర్పించిన ఈ సిద్ధాంత గ్రంథం, పాతికేళ్ల తర్వాత అదనపు సమాచారంతో తిరిగి వెలువడింది.
- శేషసాయి