సాహాహ్హహ్హహ్హ...
తొలి రోజు సీరియస్‌గా సాగుతున్న రాంచీ టెస్టులో భారత కీపర్ వృద్ధిమాన్ సాహా కాస్త వినోదం పంచాడు! స్మిత్‌ను ఎలాగైనా అవుట్ చేసేందుకు అతను పడిన కష్టం మైదానంలో నవ్వులు పూయించింది. ఇన్నింగ్స్ 80వ ఓవర్లో జడేజా వేసిన బంతిని స్మిత్ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్‌కు తగలకుండా స్మిత్ కాళ్ల మధ్యలోకి చేరింది. అప్పటికే బంతి ‘డెడ్‌బాల్’గా మారిపోయినా సాహా మాత్రం పట్టు వదల్లేదు. స్మిత్ కాళ్ల మధ్య నుంచి బంతిని లాగి మరీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు! ఈ క్రమంలో అతను స్మిత్ వైపు వెళ్ళగా, సాహా ఏం చేస్తున్నాడో అర్థం కాక స్మిత్ కూడా వెనక్కి జరిగిపోయే ప్రయత్నం చేశాడు.
చివరకు నియంత్రించుకోలేక స్మిత్ కిందపడిపోయాడు కూడా. అయినా సరే, అతని మీద పడి బంతిని చేజిక్కించుకున్న తర్వాత సాహా క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. ఇదంతా చూసిన అంపైర్ ఇయాన్ గౌల్డ్కు నవ్వు ఆగలేదు. భారత జట్టు సభ్యులందరూ కూడా బిగ్గరగా నవ్వేశారు. ఇంత జరిగినా సాహా మాత్రం ఇంకా సీరియస్‌గానే అంపైర్ నిర్ణయం కోసం వేచి చూడటం మరింత హాస్యాన్ని పండించింది. మరోవైపు 97 పరుగుల వద్ద ఉన్న స్మిత్ మాత్రం ఈ మొత్తం ప్రహసనంలో గంభీరంగానే ఉండి ఎక్కడా తన ఏకాగ్రతను కోల్పోలేదు.