ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే?
ఎదురుగా ఉన్నది దెయ్యమో మనిషో తేల్చుకోవడానికి కాళ్లు వెనక్కు తిరిగి ఉండటాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు జానపదులు. ఇక్కడ ఉన్న కెల్సీ గ్రబ్ దెయ్యమేమో అని అనుమానం వస్తే తప్పులేదు. ఎందుకంటే ఏకంగా ఆమె తన పాదం మొత్తాన్ని వెనక్కు తిప్పి గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టింది. మే 2న ఈ రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఈమె కాళ్ల వైపే లోకం అబ్బురంగా చూస్తోంది
‘పిల్లలకు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే క్రేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాక్కూడా ఉండేది. కాని నేను కూడా ఆ రికార్డ్ సాధిస్తాననుకోలేదు’ అని సంబరపడుతోంది కెల్సీ గ్రబ్. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఆల్ బకాకీ అనే ఊరికి చెందిన 32 ఏళ్ల కెల్సీ తన కాలిని171.4 డిగ్రీలు వెనక్కు తిప్పడం ద్వారా గిన్నెస్ రికార్డు స్ధాపించింది. ‘గత సంవత్సరం ఏదో షాపులో గిన్నెస్ రికార్డ్–2021 పుస్తకం తిరగేశాను. అందులో కాలు వెనక్కు తిప్పే వ్యక్తి ఫొటో ఉంది. అతని కంటే ఎక్కువగా వెనక్కు ఎందుకు తిప్పకూడదు అనిపించింది’ అంది కెల్సీ.
చదవండి: రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్బర్గ్ ఫోటో వైరల్
ఐస్ స్కేటింగ్ను తరచూ సాధన చేసే కెల్సీ స్కేటింగ్లో పాదాలు చురుగ్గా ఉండాలి కనుక తను సాధన చేస్తే కాలిని వెనక్కు తిప్పగలదు అనుకుంది. ‘నేను పెద్దగా కష్టపడలేదు. అప్పుడప్పుడు పాదాన్ని వెనక్కు తిప్పుతూ ఉండేదాన్ని. కొన్నిసార్లు మోకాల్లో నొప్పి అనిపించేది. అప్పుడు మాత్రం కొంచెం మెల్లగా తిప్పేదాన్ని’ అని తెలిపింది కెల్సీ. ఆమె ఇప్పుడు ఎంత సాధన చేసిందంటే ‘జనం వెనక్కు తిరిగిన పాదాన్ని కాకుండా అంత సులభంగా పాదాన్ని తిప్పినందుకే ఎక్కువ ఆశ్చర్యపోతుంటారు’ అని నవ్వింది.
స్నేహితులు ఆమె విన్యాసాన్ని పూర్తిగా గమనించాక గిన్నెస్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టింది కెల్సీ. ‘ఇదేదో రికార్డు స్థాయి ఫీట్లాగానే ఉంది. వచ్చి పరీక్షించండి అని మెయిల్ పెట్టాను. చిన్నపిల్లల్లాగే ఉత్సాహంగా ఎదురు చూశాను. రికార్డు కన్ఫర్మ్ అయ్యాక చాలా సంబరపడ్డాను’ అందామె. సాధారణ జనంలో చాలా మంది కాలిని 90 డిగ్రీల వరకూ వెనక్కు తిప్పగలరు. కాని కెల్సీ దాదాపు 180 డిగ్రీలు వెనక్కు తిప్పడంతో ఈ వార్త వైరల్గా మారింది.