Kenneth Juster
-
మన చెలిమికి ఆకాశమే హద్దు
భారతదేశంతో అమెరికా ఏర్పర్చుకున్న బలమైన రక్షణ బాంధవ్యం ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్యా లేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. గత రెండు దశాబ్దాలుగా మన వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది. భారతీయులకు ఉద్యోగాల కల్పన, వినియోగదారీ వస్తువులు, సాంకేతిక నైపుణ్యం, ఆర్థికపరమైన మెరుగుదల వంటివాటిని కల్పించడంలో అమెరికా లాగా ప్రపంచంలో మరే దేశమూ ముందుకు రాలేదు. సరిహద్దుల్లో చైనా దూకుడు కార్యకలాపాలను భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సన్నిహిత సమన్వయం చాలా ముఖ్యమైనది. నాలుగేళ్లుగా మన రెండు దేశాలూ సాధించిన విజయాలు గర్వకారణం. అమెరికా నూతన ప్రభుత్వం కూడా ఈ సంబంధాలను కొనసాగించగలదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం మధ్య నెలకొన్న విశాలమైన, కీలకమైన, సుసంపన్నమైన ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్య తరచి చూసినా లేవు. రక్షణ రంగం, ఉగ్రవాద నిరోధం, సైబర్ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనరంగం, పర్యావ రణం, ఆరోగ్యం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, వ్యవసాయం, అంతరిక్షం ఇలా ఎన్నో రంగాల్లో మన రెండు దేశాలూ ప్రస్తుతం సహ కరించుకుంటున్నాయి. గత రెండు దశాబ్దాలుగా మన వ్యూహాత్మక భాగస్వామ్యం వాస్తవానికి కొత్త పుంతలు తొక్కింది. ప్రత్యేకించి గత నాలుగేళ్ల సమయం మన రెండు దేశాలు తమ ఆకాంక్షలు, విజ యాలను నెరవేర్చుకున్న కాలంగా నిలిచిపోయింది. భారత్ వికాసం పట్ల అమెరికా నిబద్ధత, స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో పసిఫిక్ ప్రాంతంపై పరస్పర దార్శనికతల నుంచి మన రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సమన్వయం సాధ్యపడింది. ఇండో–పసిఫిక్ సహకార భావన రూపొందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టినప్పటికీ గత నాలుగేళ్లుగా ఆ భావన వాస్తవ రూపం దాల్చడానికి మన రెండు దేశాలూ గొప్ప ఆకాంక్షనూ, పరిణ తినీ ప్రదర్శించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించి నంత వరకు ఇండో–పసిఫిక్ అంటే అర్థం ఏమిటంటే.. ప్రపంచం ముందు గొప్ప మార్పు, సవాళ్లు ఎదురవుతున్న సమయంలో, ఈ గతిశీలమైన ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలను పరిరక్షించడంలో, విస్తరింపజేయడంలో భారత్ ఒక కీలక భాగస్వామి అని మేము పరిగణిస్తుండటమే. ఆసియన్ దేశాల కీలకస్థానాన్ని మేం బలపరుస్తూనే ఈ ప్రాంతం రూపురేఖలను స్పష్టంగా నిర్మించడానికి భావ సారూప్యత కలిగిన దేశాలతో సమన్వయాన్ని ప్రారంభించాము. మనం ఇటీవలికాలంలో నిర్వహించుకున్న త్రైపాక్షిక సదస్సులు (2018, 2019 సంవత్సరాల్లో జపాన్‌తో), మన నాలుగు దేశాల మంత్రులతో సదస్సులు (2019, 2020 సంవత్సరాల్లో జపాన్, ఆస్ట్రేలియాతో) అనేవి సముద్ర భద్రత, మహమ్మారి నిర్వహణ, ప్రాంతీయ అనుసంధానం, మానవతా సహాయం, విపత్తు ఉపశమనం, సైబర్ భద్రత వంటి వాటితోపాటు మన దేశాల మధ్య గొప్ప సహకారానికి దారితీశాయి. సార్వభౌమా ధికారం, చట్టప్రాతిపదికన పనిచేసే వ్యవస్థను ఎంతగానో గౌరవించే ప్రాంతం నుండి అన్ని దేశాలు సౌభాగ్యం పొందేలా తదుపరి నాలుగు సంవత్సరాలు, ఆ పై సంవత్సరాల్లో కూడా తగిన అవకాశాన్ని కల్పిం చడమే మన లక్ష్యంగా ఉంటుంది. బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం శాంతి, దౌత్యపరమైన పరిష్కారాలకు కట్టుబడి ఉంటు న్నాయి. గత నాలుగేళ్లుగా మన దేశాలు సురక్షితంగా ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవడమే కాకుండా మన సరిహద్దుల అవతల కూడా భద్ర తను కల్పించడానికి మన రక్షణ, భద్రతా సహకారాన్ని మరింతగా పెంచుకున్నాము. ఇకపోతే 2018 సెప్టెంబర్ నాటికి మన ద్వైపాక్షిక రక్షణ, భద్రతాపరమైన భాగస్వామ్యం కొత్త దశకు చేరుకుంది. ఆ సంవత్సరం అమెరికా, భారత రక్షణ, విదేశీ విధాన నిర్ణేతల మధ్య 2+2 మంత్రిత్వ శాఖల సంభాషణను ప్రారంభించాం. అలాంటి మూడు మంత్రిత్వ శాఖల చర్చలను మనం నిర్వహించుకున్నాం. ఆ క్రమంలో మన బలగాలు, రక్షణ రంగ పరిశ్రమలు కలిసి పనిచేసేలా కీలకమైన రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నాం. 2019లో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాతో కలిసి మన మూడు దేశాల సైనిక విన్యాసాలను నిర్వహించడం, అలాగే మలబార్ తీరంలో జపాన్‌తో సైనిక విన్యాసాలు నిర్వహించడం ద్వారా మన మధ్య అనేక సైనిక విన్యాసాలను విస్తరింపజేసుకున్నాం. ఇలాంటి ఎన్నో ఇతర విజయా లను గుర్తు చేసుకుంటూ, భారతదేశంతో అమెరికా ఏర్పర్చుకున్న బలమైన రక్షణ బాంధవ్యం ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్య కూడా లేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే భారతీయుల భద్రతకు కూడా ఇతోధికంగా తోడ్పడగలిగాం. సరిహద్దుల్లో చైనా దూకుడు కార్యకలాపాలను భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నేప థ్యంలో మన సన్నిహిత సమన్వయం చాలా ముఖ్యమైనదని నేను దృఢంగా భావిస్తున్నాను. ఆర్థిక రంగంలోనూ ఈ స్థాయితో కూడిన ఆకాంక్షలను కలిగి ఉండాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మన రెండుదేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించిన పొత్తు పెరుగుతూనే వస్తోంది కానీ అవి తమ పూర్తి సామర్థ్యానికి ఇంకా చేరుకోలేదు. 2019లో అమెరికా, భారతదేశం మధ్య ద్వైపాక్షిక వ్యాపారం వస్తు సేవల రంగంలో 146.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2001 సంవత్సరంలో ఇది కేవలం 20.7 బిలియన్ డాలర్ల వద్దే పరిమితమై ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 16 శాతం వరకు అమెరికాకు చేరుకుంటున్నాయి. అమెరికా ఇప్పుడు భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మొత్తం మీద అమెరికా వాణిజ్యరంగంలో భారత్ 12వ అతిపెద్ద భాగస్వామిగా ఉంటోంది. అన్నిటికీ మించి భారతీయులకు ఉద్యోగాల కల్పన, విని యోగదారీ వస్తువులు, సాంకేతిక నైపుణ్యం, ఆర్థికపరమైన మెరుగు దల వంటివాటిని కల్పించడంలో అమెరికా లాగా ప్రపంచంలో మరే దేశమూ ముందుకు రాలేదని గర్వంగా చెబుతాను. మన రెండు దేశాల మధ్య మరో కీలక భాగస్వామ్యం ఇంధన రంగంలో ఉంది. గత నాలుగేళ్లలో మనం ఈ విషయంలోనూ గణ నీయ ఫలితాలను సాధించామని చెప్పాలి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యాన్ని మనం 2018లో ప్రారంభించాం. రెండుదేశాల ప్రభుత్వాల మద్దతు కారణంగా ఇప్పుడు భారత ఇంధన రంగానికి అమెరికా అతి ముఖ్యమైన వనరుగా ఉంటోంది. 2019 నాటికి బొగ్గు రంగంలో అమెరికాకు అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ ఆవిర్భవించింది. ముడి చమురును అమెరికా నుంచి దిగుమతి చేసు కుంటున్న నాలుగో అతిపెద్ద దేశంగా భారత్ స్థానం సంపాదించింది. కాగా అమెరికా సహజవాయువుకు ఏడవ అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ నిలిచింది. ఇవన్నీ కలిసి భారతదేశ వైవిధ్యపూరిత ఇంధన వనరులకు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పాలి. ఈరోజు భారత దేశంలో ఇంధన రంగంలో దాదాపు 100 అమెరికా కంపెనీలు పనిచేస్తు న్నాయి. ఈ రంగంలోని అన్ని విభాగాల్లోనూ అమెరికన్ కంపెనీలు ప్రవేశించాయని గర్వంగా చెబుతున్నాను. ఇకపోతే ఆరోగ్య, బయో మెడికల్ ఆవిష్కరణల రంగం కూడా మన రెండు దేశాలకు కీలక ప్రాధాన్య రంగంగా ఉంటోంది. విజయ వంతమైన మన సహకార చరిత్ర కోవిడ్–19 మహమ్మారిపై కలిసి సహకరించుకునేందుకు వీలు కల్పించింది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ (సీడీసీ) నిపుణులు కరోనా వైరస్ జాడ పసిగట్టడంలో, పరీక్షించడంలో, ఇన్ఫెక్షన్ నిరోధించడంలో, ఆరోగ్య సంస్థల నియంత్రణలో భారత్ ప్రయత్నాలకు సాంకేతిక మార్గదర్శ కత్వం, శిక్షణను అందించారు. అమెరికాకు చెందిన సీడీసీలో వంద లాది పట్టభద్రులు శిక్షణ పొంది ఉండటంతో వైరస్‌ను దీటుగా ఎదుర్కొవడంలో భారత్ ముందంజ వేసింది. పైగా, అమెరికా, భారత శాస్త్రవేత్తలు కోవిడ్–19 వ్యాక్సిన్, చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడంలో పరస్పరం సహకరించుకున్నారు. ఇది మరింత సురక్షిత వైద్య సప్లయ్ చైన్లను వృద్ధి చేయడంతోపాటు మన రెండు దేశాల ఆరోగ్యరంగాల మధ్య మరింత బలమైన కృషి జరగడానికి వీలు కల్పించనుంది. ఆరోగ్య రంగంలో మన సహకారం రెండు దేశాలను మరింతగా మెరుగుపర్చడమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ ప్రయో జనం కలిగించింది. ఘనమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను కలిగి ఉన్న మన రెండు దేశాలూ, ప్రభుత్వాలూ ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా ఆలకిస్తాయి. మన ప్రజల మధ్య సంబంధాలు బలమైన పునాదిని ఏర్పర్చడమే కాకుండా మన సంబంధాల విషయంలో చోదకశక్తిగా కూడా పని చేస్తున్నాయి. ఈ సంబంధాలను సరైన మార్గంలోకి తీసుకుపోవడం, స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని రూపొందించడం రెండు దేశాలకు ఎంతో ముఖ్యమని, అమెరికా– భారత్ నాయకులు గుర్తించారు. చివరగా, గత నాలుగేళ్లుగా మనం సాధించిన విజయాల పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను. రాబోయే అమెరికా నూతన ప్రభుత్వ యంత్రాంగం కూడా భారతీయ భాగస్వా ములతో ఈ సంబంధాలను కొనసాగించగలదని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం కూడా తనకు మునుపటి ప్రభుత్వం భారత్‌తో విస్తరించిన సంబంధాలను విజయవంతంగా ముందుకు తీసుకు పోతూ వచ్చింది మరి. -కెన్నెత్ ఐ. జస్టర్ వ్యాసకర్త భారత్‌లో అమెరికా రాయబారి -
సూపర్‌బగ్‌ల పని పట్టాల్సిందే!
సాంక్రమిక వ్యాధులపై మనిషి విజయం సాధించేశాడని, ఆరోగ్య రంగంలో సరికొత్త యుగం మొదలైనట్లేనని చాలామంది అంచనాలు కట్టారు. పెన్సిలిన్ బలం తగ్గిపోయిందన్న సూచనలు కనిపించినప్పుడు కొత్త కొత్త యాంటీబయాటిక్‌ల ఆవిష్కరణతో ఆ సమస్యను ఎదుర్కోగలిగాం. ఏఎంఆర్ (సూక్ష్మజీవులు పెన్సిలిన్ వంటి మందులను తట్టుకోగలగడం) అనేది ఆరోగ్య పరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పది అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏఎంఆర్ సమస్యల అటు భారత్‌తోపాటు ఇటు అమెరికాలోనూ తీవ్రంగానే ఉంది. అమెరికాలో ఏటా సుమారు 28 లక్షల కేసులు నమోదవుతూండగా యాంటీబయాటిక్‌ల వాడకంలోనూ ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. భారత్‌లోనూ పరిస్థితి దాదాపుగా ఇంతే. బూజుపట్టిన ఓ పుచ్చకాయ లక్షల మంది ప్రాణాలు నిలబెడుతుందని ఎవరనుకున్నారు! కానీ ప్రపంచంలోనే తొలి యాంటీబయాటిక్ పెన్సిలిన్ చేసిన పని అచ్చంగా ఇదే. బ్రిటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను 1928లోనే కనుక్కున్నప్పటికీ.. 1942లో ఓ పుచ్చకాయకు పట్టిన బూజులోంచి దీన్ని వేరు చేసి ఇబ్బడిముబ్బడిగా తయారు చేయడంతో రెండో ప్రపంచ యుద్ధంలో వేలాదిమంది సైనికుల ప్రాణాలు దక్కాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో మాదిరిగా గాయాల కంటే సాంక్రమిక వ్యాధుల కారణంగా ఎక్కువ మరణాలు జరక్కుండా అడ్డుకోగలిగింది ఈ అద్భుత ఔషధం. అంతేకాదు... న్యూమోనియా, చర్మవ్యాధుల సమస్య గణనీయంగా తగ్గిపోయాయి. సాంక్రమిక వ్యాధులపై మనిషి విజయం సాధించేశాడని ఆరోగ్య రంగంలో సరికొత్త యుగం మొదలైనట్లేనని చాలామంది అంచనాలు కట్టారు కూడా. పెన్సిలిన్ బలం తగ్గిపోయిందన్న సూచనలు కనిపించినప్పుడు కొత్త కొత్త యాంటీబయాటిక్‌ల ఆవిష్కరణతో ఆ సమస్యను ఎదుర్కోగలిగాం. ఆ ధైర్యంతోనే కాబోలు... 1985లో అమెరికా సాంక్రమిక వ్యాధుల సొసైటీ వార్షిక సదస్సులోనూ ఈ అంటువ్యాధులకు సంబంధించిన నిపుణుల అవసరమేమిటన్న ప్రశ్న కూడా చర్చకు వచ్చింది. ప్రాణాలు నిలబెట్టిన మందులు పనిచేయవు అయితే... 35 ఏళ్లలోనే పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ప్రాణాలు నిలబెట్టిన మందులు అసలు పనిచేయవన్న కొత్త వాస్తవం కళ్లముందు నిలిచింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్... క్లుప్తంగా ఏఎంఆర్ (సూక్ష్మజీవులు పెన్సిలిన్ వంటి మందులను తట్టుకోగల గడం) అనేది ఆరోగ్య పరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పది అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం పరి స్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సూపర్‌బగ్‌లు ఇప్పటికే ఏఎంఆర్ ఏటా 2,14,000 మంది శిశువులను బలిగొంటూండగా.. ఇతరులను కబళించవన్న గ్యారెంటీ ఏమీ లేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాల్లేకుండా అందరూ ఈ సూపర్‌బగ్ మహమ్మారి బారిన పడే అవకాశం ఉంది. తగిన చర్యలు తీసుకోకపోతే చిన్నపాటి ఇన్ఫెక్షన్లకే ప్రాణాలు కోల్పోయిన పాతకాలంలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే... మనం యాంటీబయాటిక్‌లనే అతి విలువైన వనరును చాలా అజాగ్రత్తగా వాడుతున్నామని చెప్పాలి. అవసరమున్నా లేకపోయినా ఎడా పెడా వాడేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విచ్చలవిడి వాడకానికి కూడా కొన్ని అపోహలే కారణం. వైరస్‌లపై యాంటీబయాటిక్‌ల ప్రభావం ఉండదన్నది వాస్తవం కాగా.. వాటితో వచ్చే జలుబుకు మందులు వాడటం ఇలాంటిదే. ఇలాంటి అపోహల కారణంగానే... యాంటీబయాటిక్‌లను అనుచితంగా వాడటం, ఎక్కువగా వాడటం జరగుతోంది. ప్రస్తుతం మనం వాడుతున్న యాంటీబయాటిక్‌లలో సగం అనవసరమని అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు చెబుతున్నాయి. జంతువులకూ ఈ మందులు ఎక్కించడం చాలా ఎక్కువగా జరుగుతోంది. యాంటీబయాటిక్ మందుల ప్రభావాన్ని కాపాడుకుంటే లక్షలమంది ప్రాణాలు కాపాడుకోవచ్చుగానీ.. వీటిని చాలా వరకూ ఆహారంగా ఉపయోగపడే జంతువుల్లో వాడటం ఆందోళన కలిగించే అంశం. పైగా ఇన్ఫెక్షన్లకు చికిత్సగా వాడకుండా.. జంతువులు వేగంగా ఎదగాలన్న ఆలోచనలతో ఈ మందులు వాడటం ప్రమాదకరం కూడా. నలభై ఏళ్లుగా కొత్త యాంటీబయాటిక్ మందులేవీ అందుబాటులోకి రాని నేపథ్యం ఈ అంశానికి ప్రాధాన్యత పెంచుతోంది. చేయి కలపాల్సిన తరుణమిదే... ఏఎంఆర్ సమస్యలు అటు భారత్‌తోపాటు ఇటు అమెరికాలోనూ తీవ్రంగానే ఉంది. అమెరికాలో ఏటా సుమారు 28 లక్షల కేసులు నమోదవుతూండగా యాంటీబయాటిక్‌ల వాడకంలోనూ ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. భారత్‌లోనూ పరిస్థితి దాదాపుగా ఇంతే. ఇక్కడ కూడా ఇతర దేశాలన్నింటితో పోల్చినా సగటు యాంటీబయాటిక్‌ల వాడకం ఎక్కువే. అందుకే ఈ పరిస్థితి ఇరు దేశాలకూ ఓ జటిలమైన సవాలే. ఇరు దేశాలూ తమ తమ శక్తి సామర్థ్యాలను కలిపి వాడితేనే ఈ సమస్య పరిష్కారానికి ఓ మార్గం లభించే అవకాశముంది. సాంక్రమిక వ్యాధుల పర్యవేక్షణ, కొత్త కొత్త మందులను ఆవిష్కరించడంలో అమెరికా ముందువరసలో ఉంటే.. భారత్‌కు తన ఫార్మా రంగం, పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ బలాలు. వీటి సాయంతో ఏఎంఆర్ సమస్యను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికాలు ఇప్పటికే వేర్వేరు మార్గాల్లో కృషి చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్లను నియంత్రించడం, ఏఎంఆర్ ఇన్ఫెక్షన్ల కోసం భవనాలను నిత్యం పరిశీలిస్తూండే వ్యవస్థల ఏర్పాటు, ఈ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలకు ప్రోత్సాహకాలు, కొత్త యాంటీమైక్రోబియల్స్ అభివృద్ధికి ఆర్థిక సాయం వీటిల్లో మచ్చుకు కొన్నే. ఏఎంఆర్ సమస్యపై పరిశోధన చేసేందుకు విధాన రూపకల్పనకు ఇటీవలే కోల్‌కతాలో ఓ కొత్త కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా ఏఎంఆర్‌పై పోరులో అమెరికా ఎల్లప్పుడూ భారత్‌కు సహకరిస్తుందని స్పష్టం చేశాను. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతోపాటు, భారత వైద్య పరిశోధనల సమాఖ్య, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని కూడా చెప్పాను. మీరు చేయాల్సిందీ ఉంది... యాంటీబయాటిక్ మందులను తట్టుకోగల సూక్ష్మజీవులను ఎదు ర్కొనేందుకు ప్రభుత్వాలు మాత్రమే పనిచేస్తే సరిపోదు. ప్రభుత్వాలు వ్యవస్థల స్థాయిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తూంటాయి. ప్రజలందరూ వ్యక్తిగత స్థాయిలోనూ తమదైన రీతిలో సహకరిస్తేనే సమస్య సమసే అవకాశం ఉంటుంది. యాంటీబయాటిక్‌లు తీసుకునేముందు వైద్యులను సంప్రదించడం వ్యక్తులుగా మనం చేయగల అతిచిన్న పని. అంతేకాదు.. ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడమూ ముఖ్యమే. అవసరమైనప్పుడల్లా చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గు వస్తే... చేతులు అడ్డుపెట్టుకోవడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తే చాలు. సమస్య మరింత ముదరకుండా చూసుకోవచ్చు. మరోవైపు వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు కూడా తమదైన రీతిలో ఏఎంఆర్ నిరోధానికి సాయపడవచ్చు. ఇన్ఫెక్షన్లను నియంత్రించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వీటిల్లో ఒకటైతే... సాంక్రమిక వ్యాధులకు సంబంధించి గుర్తింపు పొందిన చికిత్స మార్గదర్శకాలను మాత్రమే అనుసరించడం మరోటి. అవసరం లేకపోయినా యాంటీబయాటిక్‌లు తీసుకోవాల్సిందిగా రాసివ్వడాన్ని వీలైనంత మేరకు తగ్గించాల్సి ఉంది. కొన్ని రకాల సాంక్రమిక వ్యాధులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే కొన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందరూ ఉపయోగించేలా చేయడం ద్వారా యాంటీబయాటిక్ మందుల వాడకాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించవచ్చు. పశువుల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు పశువుల్లో ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు మాత్రమే యాంటీబయాటిక్‌లను వాడాలి. ఇది కూడా పశువైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. అంతేగానీ... అవి వేగంగా కండపడతాయనో, దిగుబడి ఎక్కువ అవుతుం దనో వాడరాదు. ఇలాంటి చర్యల వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువని గుర్తించాలి. ఫార్మా రంగం పరిశోధనలను ముమ్మరం చేసి కొత్త యాంటీబయాటిక్‌లు ఆవిష్కరించగలిగితే సమస్యను మరింత వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. సమయం మించిపోయిన యాంటీబయాటిక్ మందులను తగిన రీతిలో వదిలించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏఎంఆర్ సమస్యను వ్యక్తులుగానే కాదు.. అందరం సమష్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అంశంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఇరుదేశాల సంబంధాలకు ప్రతీకగా ఉండాలి. చేయి చేయి కలిపితే ఏం చేయగలమో నిరూపించే అవకాశమిది. ఇది మన రెండు దేశాల కోసం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచానికి కూడా! కెన్నెత్ ఐ జస్టర్ వ్యాసకర్త భారత్‌లో అమెరికా రాయబారి -
'రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం'
సాక్షి, విశాఖపట్నం : భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అమెరికా రాయభారి కెన్నత్ జస్టర్ పేర్కొన్నారు.ఇండియా - అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెన్నత్ జస్టర్‌కు భారత్ తరఫున నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గోర్మడే స్వాగతం పలికారు. కెన్నత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 18,19 తేదిలలో హైదరాబాద్ లో, ఫిబ్రవరిలో లక్నోలో రెండు దేశాల మధ్య వాణిజ్య సదస్సులు ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇండియా-అమెరికా భాగస్వామ్యంతో హైదరాబాద్ లో అపాచి హెలికాఫ్టర్లు, ఎఫ్ 16 యుద్ధ విమానాల విడిభాగాలు, సి1 30 విమానాల విడిభాగాల తయారీలు పురోగతిలో ఉన్నాయన్నారు. కాగా, భారత - అమెరికా సంయుక్త విన్యాసాలు టైగర్ ట్రంప్ 2019 ఉభయచర విన్యాసాలలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వపై ఉభయ దళాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఈనెల 21 వరకు విశాఖ, కాకినాడలలో ఇండో-అమెరికన్ త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విశాఖ తీరానికి అమెరికా యుద్ద నౌక జర్మన్ టౌన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఇండియా, అమెరికా నేవీ అధికారులు యుద్ద విమానాలు, మిస్సైల్ ను ప్రదర్సించారు. భారత - అమెరికా మిలటరీ సహకారానికి ఈ విన్యాసాలు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాయని ఇండియా, అమెరికా నేవీ అధికారులు పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య త్రివిధ దళాల మధ్య మెరుగైన సంబంధాలు, మానవీయ సాయం, విపత్తుల వంటి అంశాలలో నైపుణ్యాల అభివృద్ది , పరస్పర సహకారాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సంయుక్త విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల త్రివిధ దళాల సైనికులు పరస్పర సందర్శనలు, సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే లైవ్ ఫైర్ డ్రిల్లులు, భారత హెలీకాప్టర్లు అమెరికా నౌక జర్మన్ టౌన్ పై లాండింగ్ వంటివి రాబోయే తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. -
వాణిజ్య బంధంతో ముందడుగు!
ఆవిష్కరణలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే కీలకమైన, సానుకూల ప్రభావం ఎలాంటిదో హైదరాబాద్‌లో ఈ మధ్యే జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మనం చూశాం. భారత్ మార్కెట్‌ను అమెరికా వ్యాపార, వాణిజ్యం కోసం విస్తరించడం వల్ల మన రెండు ఆర్థిక వ్యవస్థలను కాపాడగలిగే అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవచ్చు. అమెరికన్ సంస్థల వద్ద ఉన్న వినూత్న సాంకేతికతలు భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 స్మార్ట్ నగరాల ప్రాజెక్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అమెరికా– భారత్ మధ్య భాగస్వామ్యం అన్ని అంతర్జాతీయ వ్యవహారాల మాదిరిగానే పరిణామాత్మకమైంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మన దేశాలను పటిష్టం చేయడంతో పాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంపై ప్రయోజనకరమైన ప్రభావం చూపుతుంది. గత పదిహేడు సంవత్సరాల కాలంలో మన దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది వేశాం. ఇది ఈ 21వ శతాబ్దంలో మాత్రమే కాదు, తదనంతర కాలంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ బలమైన పునాదిపై మరింత నిర్మాణం చేయాల్సి ఉంది. మనకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి ఈ ప్రాంత సుస్థిర నిర్మాణం కోసం కృషి చేయాలి. అమెరికా – భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టంగా మలచాల్సిన అవసరం ఉంది. మనందరి ప్రయోజనం కోసం స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన ప్రాంతంగా ఇండో–పసిఫిక్ ప్రాంతం ఉండాలనే అమెరికా దీర్ఘకాలిక నిబద్ధత వలన ఈ ప్రాంతంలో సుస్థిరత ఏర్పడి, గణనీయ స్థాయిలో వాణిజ్య ఎదుగుదలకు దోహదపడుతుంది. మనందరి భవిష్యత్తు ఇండో–పసిఫిక్ ప్రాంత అభివృద్ధితో విడదీయలేని విధంగా ముడిపడి ఉన్నందువల్ల ఈ ప్రాంత స్థిరత్వానికి అమెరికా కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా అందరికీ వర్తించే నియమాలకు మనందరం కట్టుబడుతున్నాము. ఒక దృఢమైన నమ్మకంతో భాగస్వాములుగా ఎదుగుతున్నాం. అమెరికా విదేశాంగమంత్రి టిల్లెర్ సన్ మాటల్లో చెప్పాలంటే, అవ్యవస్థత, సంఘర్షణ, దోపిడీ ఆర్థిక విధానాల స్థానంలో ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని ఒక శాంతియుతమైన, సుస్థిరమైన, సంపద్వంతమైన ప్రాంతంగా ఎదిగించేందుకు, ఒక ప్రాంతీయ నిర్మాణ చట్రంపై భావసారూప్యం కలిగిన దేశాలన్నీ కృషి చేయడంలో భాగంగా ఈ ప్రాంత వాణిజ్యంలో భారత్ నాయకత్వాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రక్షణ రంగంలో పూర్తి సహకారం రక్షణ, ఉగ్రవాద నిరోధంపై మన దేశాల మధ్య సహకారం అతి ముఖ్యమైనది. అమెరికా రక్షణ సంస్థలు ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టి అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థల కోసం విడిభాగాలు తయారు చేస్తున్నాయి. దేశీయంగా రక్షణ సామర్థ్యాలు పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మేము మద్దతునిస్తాం. ప్రధాన రక్షణ భాగస్వాములుగా, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మన రెండు దేశాల సేనల సామర్థ్యాన్ని పరస్పర సహకారంతో వినియోగించుకోవడాన్ని మరిం తగా విస్తరింపచేసేందుకు కృషి చేస్తాం. మన రక్షణ రంగ భాగస్వామ్యం లాగానే మన దేశాల మధ్య ఉన్న వాణిజ్య భాగస్వామ్యంపై కూడా దృష్టి పెట్టాలి. చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారం చేసేందుకు ఉన్న అడ్డంకుల గురించి అనేక అమెరికన్ సంస్థలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలు తగ్గించుకుంటే, మరికొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాయి. ఇండియా ఈ వ్యూహాత్మక అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ సంస్థల పెట్టుబడులు, వాణిజ్యానికి ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదగాలి. స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యం అనేవి ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న భారత్ దీర్ఘకాలిక వృద్ధికి ఉపయోగపడుతాయి. మోదీ ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి పాదించిన ‘అమెరికా ఫస్ట్’ అనేవి పరస్పరం విరుద్ధమైనవి కావు. పైగా, రెండు దేశాలు ఇతర మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన మన వ్యాపార సంబంధాలు పెరగడంతో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో సహకారం, ఉద్యోగాల కల్పనలో పరస్పరం సహకరించుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణ ప్రక్రియల వలన భారత్ ఒక సమర్థవంతమైన, పారదర్శక మార్కెట్‌గా అవతరిస్తోంది. ఈ సంస్కరణలు, వాణిజ్య సరళీకరణ వల్ల భారతీయ వస్తువులు ప్రపంచ విపణిలో మరింత విస్తృతంగా దొరుకుతాయి. ఇది మరిన్ని ఉద్యోగాల కల్ప నకు దారి తీస్తుంది. స్మార్ట్ నగరాలకు సాంకేతిక సొబగులు మన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం వల్ల, భారత్ ఒక ప్రాంతీయ కేంద్రంగా అవతరించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆవిష్కరణలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే కీలకమైన, సానుకూల ప్రభావం ఎలాం టిదో హైదరాబాద్‌లో ఈ మధ్యే జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మనం చూశాం. వ్యవస్థాపకత, ఆవిష్కరణ రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉంటోంది. టెక్నాలజీ రంగంలో అమెరికా ఇప్పటికే భారత్‌తో విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకుంది. భారత్ మార్కెట్‌ను అమెరికా వ్యాపార, వాణిజ్యం కోసం విస్తరించడం వల్ల మన రెండు ఆర్థిక వ్యవస్థలను కాపాడగలిగే అధునాతన సాంకేతికతలను– ప్రత్యేకించి ఆధునిక తయారీ, సైబర్ భద్రతా రంగాల్లో అందిపుచ్చుకోవచ్చు. పెరిగిన అమెరికా వాణిజ్యం, పెట్టుబడుల వల్ల మరిన్ని పెట్టుబడులు, మేధో జ్ఞాన రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతుంది. సాంకేతికతలో వస్తున్న వేగవంతమైన మార్పులను అందిపుచ్చుకోవడానికి దేశాల మధ్య ప్రతిబంధకాలు లేని వ్యాపార, డేటా ప్రవాహం ఉండాలి. అమెరికాలో తయారయ్యే వస్తువులను భారత్‌లో మరింతగా అందుబాటులోకి తీసుకురావడం, అమెరికన్ సంస్థల ఉనికి దేశంలో మరింత విస్తరించడం వల్ల ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి. వీటి వల్ల మౌలిక వసతులు, కనెక్టివిటీ కూడా మెరుగవుతాయి. ఉదాహరణకి అమెరికన్ సంస్థల వద్ద ఉన్న వినూత్న సాంకేతికతలు భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 స్మార్ట్ నగరాల ప్రాజెక్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముడి చమురు నుంచి ఇంధన భద్రతదాకా.. ఇంధన రంగంలో కూడా మన దేశాలు సహకరించుకోవచ్చు. భారత్–అమెరికా ఒక సమగ్రమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోగలవు. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, అణు విద్యుత్ వంటి అన్ని రకాల ఇంధన సంబంధిత రంగాల్లో సహకరించుకోవచ్చు. అంతేకాకుండా శిలాజ ఇంధనాలు, స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వలు, పునరుత్పాదక వనరులు వంటి వాటికి సంబంధించి టెక్నాలజీ విషయంలో కూడా సహకరించుకోవచ్చు. గత సంవత్సరం అమెరికా తొలి ముడి చమురును భారత్‌కి ఎగుమతి చేసింది. దేశీయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకుని, ఇంధన భద్రతను పెంపొందించుకోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అవసరమైన మద్దతు సేవలు, మౌలిక వసతులు, సాంకేతిక జ్ఞానాన్ని అందించడంలో కూడా అమెరికా తన సహాయం తప్పకుండా అందించగలదు. భారత్– అమెరికా వ్యాపార సంబంధాలు మరింత బలపడడం వల్ల ఇండియా పట్ల, ఇండో–పసిఫిక్ ప్రాంతం పట్ల అమెరికా మరింత దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉంటుంది. దీని వల్ల మన రక్షణ, ఉగ్రవాద నిరోధక భాగస్వామ్యం మరింత బలపడుతుంది. మన విధానాల్లో ఏమైనా తేడాలుంటే చక్కదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. నిరంతరం మారుతూ ఉండే ఈ కల్లోల ప్రపంచంలో భారత్–అమెరికా దేశాల భాగస్వామ్యం స్థిరమైనది. స్వాతంత్య్రం, సార్వభౌమత్వం మన రెండు దేశాలకు ఎంతో విలువైనవి. పరస్పర భాగస్వామ్యంతో మనం ముందుకెళితే అది ప్రపంచంపై అనుకూల ప్రభావం కూడా చూపుతుంది. మన ప్రజానీకం భద్రత, శ్రేయస్సు గురించిన ఆకాంక్షలు కూడా నెరవేరతాయి. - కెన్నెత్ ఐ. జస్టర్ వ్యాసకర్త భారత్‌లో అమెరికా రాయబారి -
సీమాంతర ఉగ్రవాదాన్ని సహించం
న్యూఢిల్లీ: భారత్‌ను హిందూ–పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ‘ప్రధాన శక్తి’గా అమెరికా పరిగణిస్తోందని భారత్‌లో ఆ దేశ రాయబారి కెన్నెత్ జస్టర్ పేర్కొన్నారు. అమెరికా వ్యాపార రంగానికి భారత్ ఓ కీలకమైన వాణిజ్య శక్తి అని అభివర్ణించారు. నవంబర్‌లో భారత రాయబారిగా జస్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటికీ గురువారం తొలిసారిగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారత్‌పై అమెరికా విధానం గురించి కెన్నెత్ వివరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అమెరికా ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన ప్రసంగంలో ఎక్కడా పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు. ఇటీవల పాకిస్తాన్‌కు అమెరికా ఇచ్చే సాయాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే. అమెరికాకు సంబంధించి సున్నితమైన సాంకేతికత బదిలీ విషయంలో మొదట్లో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్న సంగతి నిజమేనని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రధానమైన 4 ఎగుమతుల నియంత్రణ గ్రూపుల్లో భారత్ ఇప్పటికే రెండింటిలో (వాసెనార్, క్షిపణి సాంకేతికత నియంత్రణ గ్రూప్స్) సభ్యత్వం పొందిందని గుర్తు చేశారు. అలాగే ఆస్ట్రేలియా గ్రూప్ ఆన్ కెమికల్, బయలాజికల్ వెపన్స్ గ్రూపులో త్వరలోనే భారత్ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అణు సరఫరాదారుల గ్రూపులో భారత్ సభ్యత్వం విషయంలో కూడా అమెరికా చాలా కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ► ఇంటెలిజెన్స్, నిఘా, యుద్ధ విమానాల తయారీలో ఇరుదేశాలకు భారీ ఒప్పందాలు జరగనున్నాయి. ► భారత్‌తో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌తో వాణిజ్యలోటు ఆందోళనకరమే. ► చైనాలో వ్యాపార నిర్వహణకు చాలా అమెరికన్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సంస్థలన్నీ ఆశగా ప్రత్యామ్నాయ వేదికలకోసం వెతుకుతున్నాయి. ► అమెరికా వ్యాపారాల నిర్వహణకు అసలైన ప్రాంతీయ కేంద్రం భారత్. ► రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక రంగాల్లో దీర్ఘకాల సుస్థిర బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ► వలసవాదుల దేశంగానే అమెరికా ఉండబోతోంది. ► భారత్, అమెరికా దేశాలు ఉగ్రబాధితులు. అందుకే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయి. -
పెట్టుబడుల కోసం కాదు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇది పెట్టుబడిదారుల సమావేశం కాదు. మేం పెట్టుబడులను ఆశించడం లేదు. కొత్త పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు అత్యుత్తమైన వాతావరణం సృష్టించేందుకు, వేర్వేరు దేశాల ప్రతినిధులు పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. అమెరికా నుంచి 400 మంది, మనదేశం నుంచి 500 మంది, మిగతా దేశాల నుంచి మరో 400 మంది ప్రతిభావంతులైన యువ పారిశ్రామికవేత్తలు రానున్నారు. ప్రతిభను ప్రదర్శించి తమకు కావాల్సిన పెట్టుబడులను రాబట్టుకోవడానికి ఈ సదస్సు యువ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడనుంది..’’అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై అమెరికా దౌత్యవేత్త కెన్నెత్ జస్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో కలసి సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఈఎస్ నిర్వహణ అవకాశాన్ని రాష్ట్రం పూర్తిగా ప్రతిభ ఆధారంగా దక్కించుకుందని చెప్పారు. సదస్సు నిర్వహణ అవకాశం దక్కించుకోవడానికి 5 రాష్ట్రాలు పోటీపడగా, రెండు రాష్ట్రాలతో ఏర్పాటు చేసిన షార్ట్‌లిస్ట్‌లో తెలంగాణ స్థానం సంపాదించిందన్నారు. చివరకు ప్రతిభ ఆధారంగా సదస్సు నిర్వహణ అవకాశాన్ని దక్కించుకుందని వివరించారు. దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నిధుల కొరత లేదని అమితాబ్ పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కింద స్టార్టప్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి రూ.10 వేల కోట్ల నిధి ఏర్పాటు చేశామన్నారు. సరళీకృత వ్యాపారం (ఈవోడీబీ) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానాన్ని నిలుపుకుంటోందని కొనియాడారు. హైదరాబాద్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఆయన వెల్లడించిన ఇతర అంశాలివీ.. తొలిరోజు ముగ్గురి ప్రసంగం మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే జీఈఎస్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, ఇవాంక ప్రసంగిస్తారు. దీంతోపాటు ఇవాంక మరో రెండు చర్చాగోష్ఠుల్లో మాట్లాడతారు. తర్వాత ‘మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు’అంశంపై చర్చాగోష్ఠి ఉంటుంది. ఇందులో ఇవాంక, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్ఆర్ఎస్ ఏవియేషన్స్ అండ్ పెట్రోలియం ఎండీ సిబోంగైల్ సింబో, ఎస్ఈబీ చైర్మన్ మార్కస్ వాలెన్‌బర్గ్ మాట్లాడతారు. సిస్కో చైర్మన్ జాన్ చాంబర్ దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. రెండోరోజు షెడ్యూల్ ఇదీ.. ‘మానవ వనరుల వృద్ధిలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం’అంశంపై 29న ఉదయం 9 గంటలకు ప్లీనరీ సెషన్ ఉంటుంది. మంత్రి కె.తారకరామారావు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇందులో ఇవాంకతోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య, సామాజిక కార్యకర్త చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్, డెల్ ఈఎంసీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కరేన్ క్వింటోస్‌లు మాట్లాడతారు. మూడోరోజు ఇలా.. ‘మహిళలు విజయం సాధిస్తే అందరూ విజయం సాధించినట్లే..’అంశంపై 30న సాయంత్రం 4 గంటలకు నిర్వహించే చర్చాగోష్ఠికి కేంద్రమంత్రి సురేశ్ ప్రభు సమన్వయకర్తగా వ్యహరిస్తారు. ఇందులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొంటారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఓ మోడల్: కెన్నెత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నూతన ఆవిష్కరణలకు, ఉపాధి కల్పనకు జీఈఎస్ ఊతమిస్తుందని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ చెప్పారు. అమెరికాలోని సుమారు 38 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారని, ఇంత భారీ స్థాయిలో తమ దేశ బృందం భారత్‌కు రావటం ఇదే ప్రథమం అని వివరించారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్న తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. హెచ్1బీ వీసాల వివాదంపై మాట్లాడుతూ... ఇవి నిపుణులను, నవకల్పనలను ఆకర్షించేందుకు ఉద్దేశించినవి మాత్రమే తప్ప ప్రత్యేకంగా ఏ ఒక్క దేశాన్నో దృష్టిలో పెట్టుకుని విధానాలు ఉండవన్నారు. సమగ్రమైన వీసా విధానంపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. -
భారత్‌లో అమెరికా రాయబారిగా కెనెత్
వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా కెనెత్ జెస్టర్(62)ను నామినేట్ చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రకటించారు. ట్రంప్‌నకు గట్టి మద్దతుదారైన జెస్టర్.. భారత్, అమెరికా చారిత్రక అణు ఒప్పందం ఖరారులో కీలక పాత్ర పోషించారు. బుష్ హయాంలో ఇండో-యూఎస్ సంబంధాల మెరుగుదలకు ఆయన తీవ్ర కృషి చేశారు. జెస్టర్ నామినేషన్ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ సెనేట్‌కు తెలిపారు. సెనేట్ త్వరలోనే జెస్టర్ నియామకాన్ని ఆమోదిస్తుందని భావిస్తున్నారు. సెనేట్ ఆమోదం తర్వాత ప్రస్తుత రాయబారి రిచర్డ్ వర్మ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. హార్వర్డ్ లాస్కూల్ నుంచి కెనెత్ లా డిగ్రీ చేశారు. అనంతరం పబ్లిక్ పాలసీపై మాస్టర్స్ డిగ్రీ పొందారు. -
అమెరికా రాయబారిగా కెన్నెత్ జష్టర్
సాక్షి, వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్నెత్ జష్టర్(62)ను నియమించినట్లు అమెరికా ప్రకటించింది. ఈసందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో మాట్లాడుతూ భారత్‌లో అమెరికా రాయబారిగా ఆర్థికవేత్త, నిపుణుడైన కెన్నెత్ జష్టర్‌ను నియమించినట్లు ఆయన ప్రకటించారు. గత జూన్‌లోనే భారత్‌కు నూతన రాయబారిని నియమించే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కెన్నెత్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారల్లో అమెరికా తరపున అధ్యక్షుడిగా, జాతీయ ఆర్థిక మండలికి డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సెనేట్ అమోదం పొందిన వెంటనే జష్టర్ గతంలో భారత్‌లో అమెరికా రాయబారిగా కొనసాగిన రిచర్డ్ వర్మ ఆయన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భారత్‌లో అమెరికా రాయబారి స్థానం ఖాళీగా ఉంది.