సదస్సు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న కెన్నెత్, అమితాబ్ కాంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇది పెట్టుబడిదారుల సమావేశం కాదు. మేం పెట్టుబడులను ఆశించడం లేదు. కొత్త పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు అత్యుత్తమైన వాతావరణం సృష్టించేందుకు, వేర్వేరు దేశాల ప్రతినిధులు పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. అమెరికా నుంచి 400 మంది, మనదేశం నుంచి 500 మంది, మిగతా దేశాల నుంచి మరో 400 మంది ప్రతిభావంతులైన యువ పారిశ్రామికవేత్తలు రానున్నారు. ప్రతిభను ప్రదర్శించి తమకు కావాల్సిన పెట్టుబడులను రాబట్టుకోవడానికి ఈ సదస్సు యువ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడనుంది..’’అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై అమెరికా దౌత్యవేత్త కెన్నెత్ జస్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో కలసి సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఈఎస్ నిర్వహణ అవకాశాన్ని రాష్ట్రం పూర్తిగా ప్రతిభ ఆధారంగా దక్కించుకుందని చెప్పారు. సదస్సు నిర్వహణ అవకాశం దక్కించుకోవడానికి 5 రాష్ట్రాలు పోటీపడగా, రెండు రాష్ట్రాలతో ఏర్పాటు చేసిన షార్ట్‌లిస్ట్‌లో తెలంగాణ స్థానం సంపాదించిందన్నారు. చివరకు ప్రతిభ ఆధారంగా సదస్సు నిర్వహణ అవకాశాన్ని దక్కించుకుందని వివరించారు. దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నిధుల కొరత లేదని అమితాబ్ పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కింద స్టార్టప్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి రూ.10 వేల కోట్ల నిధి ఏర్పాటు చేశామన్నారు. సరళీకృత వ్యాపారం (ఈవోడీబీ) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానాన్ని నిలుపుకుంటోందని కొనియాడారు. హైదరాబాద్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఆయన వెల్లడించిన ఇతర అంశాలివీ..
తొలిరోజు ముగ్గురి ప్రసంగం
మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే జీఈఎస్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, ఇవాంక ప్రసంగిస్తారు. దీంతోపాటు ఇవాంక మరో రెండు చర్చాగోష్ఠుల్లో మాట్లాడతారు. తర్వాత ‘మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు’అంశంపై చర్చాగోష్ఠి ఉంటుంది. ఇందులో ఇవాంక, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్‌ఆర్‌ఎస్ ఏవియేషన్స్ అండ్ పెట్రోలియం ఎండీ సిబోంగైల్ సింబో, ఎస్‌ఈబీ చైర్మన్ మార్కస్ వాలెన్‌బర్గ్ మాట్లాడతారు. సిస్కో చైర్మన్ జాన్ చాంబర్ దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
రెండోరోజు షెడ్యూల్ ఇదీ..
‘మానవ వనరుల వృద్ధిలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం’అంశంపై 29న ఉదయం 9 గంటలకు ప్లీనరీ సెషన్ ఉంటుంది. మంత్రి కె.తారకరామారావు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇందులో ఇవాంకతోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య, సామాజిక కార్యకర్త చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్, డెల్ ఈఎంసీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కరేన్ క్వింటోస్‌లు మాట్లాడతారు.
మూడోరోజు ఇలా..
‘మహిళలు విజయం సాధిస్తే అందరూ విజయం సాధించినట్లే..’అంశంపై 30న సాయంత్రం 4 గంటలకు నిర్వహించే చర్చాగోష్ఠికి కేంద్రమంత్రి సురేశ్ ప్రభు సమన్వయకర్తగా వ్యహరిస్తారు. ఇందులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొంటారు.
ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఓ మోడల్: కెన్నెత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నూతన ఆవిష్కరణలకు, ఉపాధి కల్పనకు జీఈఎస్ ఊతమిస్తుందని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ చెప్పారు. అమెరికాలోని సుమారు 38 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారని, ఇంత భారీ స్థాయిలో తమ దేశ బృందం భారత్‌కు రావటం ఇదే ప్రథమం అని వివరించారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్న తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. హెచ్1బీ వీసాల వివాదంపై మాట్లాడుతూ... ఇవి నిపుణులను, నవకల్పనలను ఆకర్షించేందుకు ఉద్దేశించినవి మాత్రమే తప్ప ప్రత్యేకంగా ఏ ఒక్క దేశాన్నో దృష్టిలో పెట్టుకుని విధానాలు ఉండవన్నారు. సమగ్రమైన వీసా విధానంపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment