ఆఫ్రికా గర్వించదగ్గ దిగ్గజం కౌండా
జూన్ 17 నాడు మరణించిన జాంబియా మాజీ అధ్యక్షుడు కెనెత్ కౌండా ఇరవయ్యో శతాబ్దపు ఆఫ్రికా జాతీయవాద గొప్ప నాయకుల్లో చివరివాడు. మూడు దశాబ్దాల పాటు ఆఫ్రికాలోనూ, ప్రపంచ పటంలోనూ జాంబియాకు విశిష్ట స్థానం సంపా దించిపెట్టిన కౌండా 97 ఏళ్ల వయ సులో మరణించారు. 27 ఏళ్లపాటు జాంబియాను పాలిం చిన కౌండా కీర్తికి రెండు పార్శా్వలున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత శాంతియుతంగా పదవి నుంచి తప్పుకున్న కాండా దేశంలో ఏక పార్టీ విధానానికి ఆద్యుడు. ఆఫ్రికా సామ్యవా దానికి మార్గదర్శిగా నిలిచిన వాడే నిరసనను అణచివేశాడు.అయితే ‘కెకె’గా ప్రసిద్ధుడైన కౌండా దయాళువైన రాజు అనిపించుకున్నారు. సఫారీ సూట్లు ధరించడం, తెల్ల కర్చీఫు లను ఊపడం, బాల్రూమ్ డ్యాన్సులు చేయడం, సైకిల్ తొక్కుతూ తనే రాసిన పాటలు పాడటం, బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకోవడం లాంటి చేష్టలతో ప్రజల మధ్య ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించారు.
కెన్నెత్ డేవిడ్ కౌండా అక్టోబర్ 14, 1924న ఉత్తర జాంబియాలో జన్మించారు. ఎనిమిది మంది సంతానంలో ఒకడు. నాన్న మిషనరీ టీచర్. తల్లి దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయ అర్హత పొందిన మహిళ. తల్లిదండ్రుల బాట లోనే మొదట కాండా కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. టాంజానియాలోనూ కొంతకాలం అదే వృత్తిలో కొన సాగారు. అప్పుడే టాంజానియాకు మున్ముందు అధ్యక్షుడు కానున్న జూలియస్ నైరీరి పట్ల ఆరాధన పెంచుకున్నారు. ఆయన ప్రవచించిన ‘ఉజ్మా’ తరహా సామ్యవాదాన్ని (సహ కార ఆర్థికవ్యవస్థ) అనుసరించడానికి ప్రయత్నించారు.
టాంజానియా నుంచి తిరిగివచ్చాక, శ్వేతజాతి సెటి లర్స్‌కు మరింత ప్రాబల్యం పెరిగేలా దక్షిణ రొడీషియా, ఉత్తర రొడీషియా, న్యాసాలాండ్‌తో కలిపి సమాఖ్య ఏర్పాటు తలపెట్టిన బ్రిటిష్‌వారి పథకానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే కారణంగా తొమ్మిది నెలలపాటు జైలుకు వెళ్లారు. తిరిగి వచ్చాక పూర్తిస్థాయి రాజకీయాల్లో నిమగ్నమై ఉత్తర రొడీషియా ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. అయితే, బ్రిటిష్ వారితో మితవాద వైఖరితో ఉన్న ఆ పార్టీ నాయకుడు హారీ కుంబులాతో విభేదించి, జాంబియన్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో చీలిపోయారు. సహ జంగానే ఇది నిషేధానికి గురైంది. కౌండా మరో తొమ్మిది నెలలు జైలుకు వెళ్లారు. ఇది మరింతగా ఆయనకు ప్రజా దరణ పెంచింది.
కొత్త ఉద్యమంగా పెల్లుబికిన యునైటెడ్ నేషనల్ ఇండిపెండెన్స్ పార్టీ తమ నాయకుడిగా కౌండాను ఎన్ను కుంది. అనంతరం కౌండా అమెరికా వెళ్లి మార్టిన్ లూథర్ కింగ్‌ను కలిశారు. మహాత్మా గాంధీ, లూథర్ కింగ్ భావాల స్ఫూర్తితో ‘చా–చా–చా’ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. 1964లో స్వాతంత్య్రం పొందిన తర్వాత జాంబియాకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, స్వతంత్ర దేశంలో తొలి సవాల్ విద్యరూపంలో ఎదురొ చ్చింది. దేశంలో ఒక్క విశ్వవిద్యాలయం లేదు, ప్రాథమిక స్థాయి విద్యను పూర్తిచేసినవాళ్లు సగం శాతం లేరు. దాంతో ఉచిత పుస్తకాల పంపిణీ, అత్యల్ప ఫీజు విధానాన్ని ప్రవేశ పెట్టారు.
ఆఫ్రికా మానవవాదం పేరుతో తన ఆర్థిక విధానాలను రూపొందించారు. విదేశీయులు యజమానులుగా ఉన్న కంపెనీల్లో 51 శాతం వాటా దేశానికే ఉండేట్టు చేశారు. అయితే ఈ విధానానికి 1973లో గట్టిదెబ్బ తగిలింది. అనూ హ్యంగా పెరిగన చమురు ధర, దేశ ఎగు మతుల్లో 95 శాతం వాటా ఆక్రమించిన రాగి ధరలో తగ్గుదల దేశాన్ని కుదిపే సింది. స్థూల జాతీయోత్పత్తితో పోల్చితే ప్రపంచంలోనే అత్యధిక అప్పుల ఊబిలో కూరుకు పోయిన రెండో దేశంగా మిగిలింది. అనంతర కాలంలో ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రవేశానికి దారితీసింది. వారి షరతులకు తలొగ్గేట్టు చేసింది. దాంతో ప్రైవేటీకరణ పెరిగింది, ఆహార సబ్సిడీ నిలిచిపోయింది, ధరలు పెరిగాయి. క్రమంగా కౌండా ప్రజాదరణ తగ్గుముఖం పట్టడం మొదలైంది.
అయితే చాలామంది వలసవాద వ్యతిరేక నాయకుల్లాగే కౌండా కూడా బహు పార్టీ విధానాన్ని పాశ్చాత్య భావనగా చూశారు. అదే ఘర్షణలకు, గ్రూపులకు దారితీస్తుందని తలచారు. 1968లో యూఎన్ఐపీ మినహా అన్ని పార్టీలను నిషేధించారు. ఆయన ప్రభుత్వం క్రమంగా నిరంకుశంగా, నిరసన పట్ల అసహనంగా, తన వ్యక్తిత్వమే అన్నింటికీ కేంద్రంగా తయారైంది. అయితే చాలామంది నిరంకుశ, ఏక పార్టీ నేతలతో పోల్చితే అణచివేత, అవినీతి విషయాల్లో కౌండా మెరుగైన నాయకుడు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, రష్యా రెండింటిలో దేనితోనూ చేరక అలీన విధా నాన్ని పాటించారు.
1985లో పదవీ విరమణ చేసిన జూలియస్ నైరీరి తన స్నేహితుడిని కూడా రాజకీయాల్లో నుంచి తప్పుకొమ్మని కోరారు. కానీ కౌండా భీష్మించారు. అప్పటికే ధరలు ఆకాశా న్నంటాయి. 1990లో రేగిన తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కొన్నాక, ఆహార అల్లర్లు చెలరేగాక బహు పార్టీ ఎన్ని కల విధానానికి అయిష్టంగానే ఒప్పుకున్నారు. భూమ్మీదే స్వర్గాన్ని సృష్టిస్తానన్న మహర్షి మహేశ్ యోగికి దేశంలో దాదాపు పావు వంతు భూభాగాన్ని కేటాయించనున్నట్టు వెల్లడించిన ఆయన ప్రణాళిక కూడా ప్రజాదరణ పెంచలేక పోయింది. దాంతో 1991లో జరిగిన ఎన్నికల్లో ట్రేడ్ యూని యన్ నాయకుడు ఫ్రెడెరిక్ చిలూబా భారీ విజయం సాధించారు.
ఎన్నికల్లో అపజయాన్ని కాండా హుందాగానే స్వీక రించినప్పటికీ కొత్త ప్రభుత్వం ఆయన పట్ల ఉదారత ఏమీ చూపలేదు. తిరుగుబాటు ఆరోపణ మీద ఆయనను గృహ నిర్బంధంలో ఉంచింది. 1996లో ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయనను దేశంలేని వాడిగా ప్రకటించింది(వాళ్ల నాన్న మలావీలో పుట్టాడన్న కారణం చూపి). అయితే ఆయన కోర్టుకు వెళ్లి నెగ్గారు.
1997లో జరిగిన హత్యాయత్నంలో బుల్లెట్ తగిలినా క్షేమంగా బయటపడ్డారు కౌండా. వాళ్ల కుమారుడిని మాత్రం 1999లో ఇంటి బయట కాల్చి చంపారు. 1986లో ఎయి డ్స్‌తో మరణించిన మరో కుమారుడి కారణంగా హెచ్ఐవీ సమస్యలకు స్పందించి, దానికి తొలినాళ్లలోనే ప్రచారం చేయడం ఆరంభించిన ఆఫ్రికా నేత అయ్యారు. గొప్ప ఆఫ్రికా జాతీయవాదిగా, విప్లవాలకు ఆశ్రయం ఇచ్చిన విప్లవకారునిగానే కాక అసమ్మతితోనే అయినా జాంబియాకు ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసిన నేతగా కౌండా గుర్తుండి పోతారు.
వ్యాసకర్త లెక్చరర్
లండన్ విశ్వవిద్యాలయం