నాలుగోసారి.. ఆయనకు సారీ!
సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్‌కు మరోసారి చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సోమవారం అంగమలై మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానాలు తిరస్కరించడం ఇది నాలుగోసారి. ఇప్పటికే ఆయన 71 రోజులు కస్టడీలో గడిపారు. గతంలో మూడుసార్లు ఆయన చేసుకున్న బెయిల్ అభ్యర్థనలను కోర్టులు తిరస్కరించాయి.
దిలీప్ తాజా సినిమా 'రామాలీల' సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన దిలీప్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. నటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు బలంగా ఉన్నాయని హైకోర్టు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు తుదిదశలో ఉందని, చార్జ్‌షిట్ కూడా సిద్ధమవుతోందని, ఈ దశలో దిలీప్‌కు బెయిల్ ఇస్తే.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
గత ఫిబ్రవరి 17న మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన దిలీప్ జూలై 24న బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కేసులో కీలక మొబైల్‌ఫోన్ లభ్యం కాకపోవడంతో హైకోర్టు అప్పట్లో బెయిల్ నిరాకరించింది.