కేరళను ఫాలో అవుతున్న కర్ణాటక!
బెంగళూరు: మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో కేరళ రాష్ట్రాన్ని కర్ణాటక కూడా అనుసరిస్తోంది. కేరళతో సహా మొత్తం అయిదు రాష్ట్రాల్లో మ్యాగీపై నిషేధాన్ని విధించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సైతం మ్యాగీ అమ్మకాలను నిషేధించే దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ షాపింగ్ మాల్స్, దుకాణాల నుంచి మ్యాగీ శాంపిల్స్‌ను రాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధికారులు సేకరించి, పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల నివేదిక అందిన అనంతరం కర్ణాటకలో మ్యాగీ అమ్మకాలను కొనసాగించాలా లేక నిషేధించాలా అనే అంశంపై రాష్ట్రా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
కాగా కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే కొన్ని రసాయనాలు మోతాదుకు మించి అందులో ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.