ఫారినర్కు చేతిలో డబ్బు లేకున్నా..
భారతదేశం అంటేనే మంచి మర్యాదలకు పుట్టినిల్లు. అవతలి వాళ్ల జేబులో డబ్బును బట్టి కాక, మనసును చూసి మాట్లాడతారు. కేరళలో కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు. కేరళలో అందాలను చూసేందుకు మున్నార్ వచ్చిన ఓ విదేశీయుడు.. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నా, నయాపైసా డబ్బు తీసుకోకుండా రెస్టారెంటు వాళ్లు అతడికి భోజనం పెట్టారు.
తాను 1989 నుంచి ఈ హోటల్ నడిపిస్తున్నానని యజమాని ఖాదర్ కుంజు చెప్పారు. తన దగ్గర చేతిలో డబ్బులు లేవని, క్రెడిట్ కార్డులు ఆమోదిస్తారా అని ముందే ఆ విదేశీయుడు అడిగాడని, అయితే తన వద్ద ఆ సౌకర్యం లేదని చెప్పానని అన్నారు. అయినా అతడు భోజనం చేసి, చేతులు కడుక్కున్నాక అక్కడినుంచి పారిపోయాడని.. తమ సిబ్బంది అతడిని పట్టుకుంటే డబ్బు లేకపోవడం వల్లే అతడలా చేశాడని తెలిసి వదిలేశానని కుంజు తెలిపారు. ఏటీఎంల వద్ద డ్రా చేసేందుకు ప్రయత్నించినా వాటిలో డబ్బు లేకపోవడం, మరోవైపు ఆకలిగా ఉండటం వల్లే అతడలా చేశాడన్నారు. చాలామంది విదేశీ పర్యాటకులు ఇలాగే చేస్తుంటారని కూడా కుంజు చెప్పారు.
ఇంతకుముందు ఫ్రాన్సు నుంచి నలుగురు పురుషులు, నలుగురు మహిళలు కలిసి వచ్చారని, వాళ్లు కూడా బాగా ఆకలిగా ఉండి తినాలనుకున్నారు గానీ డబ్బులు లేవని, వాళ్ల వద్ద క్రెడిట్ కార్డులున్నా, తన వద్ద స్వైపింగ్ మిషన్ లేకపోవడంతో ముందు తినేసి.. తర్వాత ఉన్నప్పుడు ఇవ్వమని చెప్పానన్నారు. కొన్ని రోజుల తర్వాత మహిళలు వచ్చి వాళ్లు తిన్నదానికి డబ్బులు చెల్లించారు గానీ, మగవాళ్లు మాత్రం రాలేదని వివరించారు.