ఈవెనింగ్ సినిమా
స్త్రీని, పురుషుడిని ప్రకృతి వేర్వేరుగా సృష్టించింది తప్ప, స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఏమీ సృష్టించలేదు. వెలుగునీడలు, ఎండావానలు ఇద్దరికీ ఒకటే. అంటే ప్రకృతికి స్త్రీ పురుషులిద్దరూ సమానం. పురుషుడే.. స్త్రీ తనకు సమానం కాదనుకుంటాడు! అందుకే స్త్రీలకు ఏ కాలానికి ఆ కాలం ధర్మయుద్ధాలు, న్యాయ పోరాటాలు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. మహిళల తాజా పోరాటం, తాజా విజయం.. ఈవెనింగ్ సినిమా.
మాధవ్ శింగరాజు
స్త్రీ తనంత బలమైనది కాదని, తనంత తెలివైనది కాదని, తనంత చురుకైనది కాదని భావించి గొప్ప పెయిన్‌ని ఓర్చుకునే ఔదార్యంతో ఆమెను తనతో సమానంగా పైకి తెచ్చేందుకు అప్పుడప్పుడు చట్టాలు తెస్తుంటాడు పురుషుడు. స్త్రీకన్నా తను బెటర్ హ్యూమన్ బీయింగ్ అనుకోవడం వల్ల తనపై తనకే కలిగే ఆత్మవిశ్వాసంతో ఆమెనూ తనలా బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా మలిచేందుకు తను తగ్గి, తనలోని అధికుడినన్న భావనను తనకు తానుగా దహింపజేసుకుని తిరిగి తనే మరింతగా ఉన్నతీకరణ చెందుతాడు! అందుకే.. స్త్రీకి స్వేచ్ఛనివ్వడం పురుషుడి దృష్టిలో ఈనాటికీ గొప్ప సంస్కరణగా మన్నన పొందుతోంది. చితిపై నుంచి సతిని పైకి లేపాడు. చిన్నప్పుడే పెళ్లేమిటని పీటల పైనుంచీ లేపేశాడు. చదువుకోనిచ్చాడు. సినిమా చూడనిచ్చాడు. తను చేసే ప్రతి పనినీ చెయ్యనిచ్చాడు. ఈమధ్యే శబరిమలకు కూడా వెళ్లనిచ్చాడు.
ఇప్పుడు హాస్టల్ అమ్మాయిల్ని ఫస్ట్షోకి, సెకండ్‌షోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. ఇవ్వడం, చెయ్యనివ్వడం రెండూ గొప్ప ఉదారతలే. అయితే తీసుకున్నది తిరిగి ఇచ్చేయడం, కట్టడి చేసి పట్టు విడవడం ఔదార్యం ఎలా అవుతుంది.. చేసిన తప్పును, ఇచ్చిన తీర్పును దిద్దుకోవడం అవుతుంది గానీ! ఏదో ఒకటి ప్రసాదిస్తున్నారు కదా, పోనివ్వండి. మనది మనకు ఇవ్వడం కూడా పురుషధర్మం అనుకుంటున్నారు కనుక మనమూ అలాగే మహాప్రసాదం అనుకుంటే వచ్చే నష్టం ఏమిటి? నష్టం ఏంటంటే.. తిరిగి ఇచ్చేసిన దానిని తిరిగి లాగేసుకుని మళ్లీ ఆంక్షలు విధించి, సంకెళ్లు వేసి.. సంస్కరణలు అవసరమైన పూర్వపు కాలాల్లోకి స్త్రీలను పురుషులు లాక్కెళ్లరనే నమ్మకం లేదు. అందుకే స్త్రీ ఎప్పుడూ తన కోసం జరిగిన ఏ మెరుగైన మార్పునూ కళ్లు విప్పార్చి చూడలేదు. మహిళల జీవితాలు మెరుగుపడేందుకు జరుగుతున్న పురుష ప్రయత్నాల వల్ల పైకి మీగడ తేలుతున్నది పురుష స్వామిత్వం తప్ప స్త్రీ పురుష సమానత్వం కాదు.
మెరుగుపడటం అంటే స్త్రీ పురుషులకు ప్రకృతి ఇచ్చిన సమానత్వానికి పురుషుడు తలవొగ్గడం. సమానత్వాన్ని తీసేసుకుని తిరిగి ఇచ్చేయడం ‘మెరుగు’ ఎలా అవుతుంది? ఐదు రోజుల క్రితం కేరళ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది. అయితే అది మగవాళ్లకే సంచలనాత్మకం కానీ, ఆడవాళ్లకు కాదు. అందుకే స్త్రీలు గానీ, స్త్రీవాదులుగానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ‘కోర్టిచ్చిన తీర్పు ఈ పురుషస్వామ్య సమాజానికి పెద్ద కనువిప్పు’ అనే స్టేట్మెంట్లూ వినిపించలేదు. ఆ తీర్పుకంత ప్రాచుర్యం లభించకపోవడానికి ఇంకోకారణం.. దేశం ఇప్పుడు ఎలక్షన్ మూడ్‌లో ఉండడం. త్రిశ్సూర్‌లోని ‘శ్రీ కేరళ వర్మ కాలేజ్’ హాస్టల్ విద్యార్థినులు.. తమను హాస్టల్ యాజమాన్యం ఫస్ట్షోలకు, సెకండ్‌షోలకు వెళ్లనివ్వడం లేదని కేసు వేశారు.
‘బాయ్స్ హాస్టల్లో లేని ఈ ఆంక్ష, వివక్ష గర్ల్స్ హాస్టల్‌కు ఎందుకు?’ అన్నది వారి వాదన. నిజమే అనిపించింది న్యాయస్థానానికి. ‘‘ఈవెనింగ్ మూవీలకు వెళ్లే స్వేచ్ఛ అబ్బాయిలకు మాత్రమే ఎందుకు ఉండాలి? అమ్మాయిలకూ కల్పించండి’’ అని కోర్టు ఆ హాస్టల్ వారిని ఆదేశించింది. రాజ్యాంగంలోనే స్త్రీ పురుష సమానత్వం ఉన్నప్పుడు ఆ సమానత్వ హక్కును నిరాకరించడం నేరం అవుతుందని కూడా హాస్టల్ యాజమాన్యాన్ని మేల్కొలిపింది. దీనికి ఆ అమ్మాయిలు సంతోషించారు. నిజంగానే వాళ్లు ఫస్ట్ షోలకు, సెకండ్ షోలకు వెళ్తారా అన్నది తర్వాతి మాట. వెళ్లడానికైతే అనుమతి సాధించారు. అనుమతి సాధించడం కాదది.
ఉన్న అనుమతిని సాధించుకోవడం!ప్రకృతి ఇచ్చిన సమానత్వ హక్కుల్ని పొందడం కోసం స్త్రీ పురుషుడి నుంచి అనుమతి తీసుకోవలసిన పరిస్థితిని పురుషుడు కల్పించిన నాటి నుంచీ ఈ పోరాటం సాగుతూనే ఉంది. అంటే.. స్త్రీలెవరూ హక్కుల సాధనకోసం పోరాటం చేయడం లేదు. హక్కుల్ని కాపాడుకోవడం చేస్తున్నారు. కొత్తగా వాళ్లేదైనా చెయ్యాలంటే.. చేయవలసింది ఒక్కటే. మగవాడిని సంస్కరించడం. అంటే ఏంటి? స్త్రీలను ఉద్ధరించే పని నుంచి అతడికి విముక్తి కల్పించడానికి ఆధిక్య భావనల నుంచి అతడిని కిందికి తోసేయడం.
సాయి పల్లవి (ప్రతీకాత్మక చిత్రం)
హాస్టల్ విద్యార్థినులను ఈవెనింగ్ షోలకు వెళ్లనివ్వకుండా నిరోధించడం.. స్త్రీ, పురుష సమానత్వ హక్కులకు భంగం కలిగించడమేనని కేరళ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.