నెలాఖరున త్రివిధ దళాధిపతుల సమావేశం
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి ఆంటోనీ ఈ నెల చివర్లో త్రివిధ దళాలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ కేరన్ సెక్టార్లో ఆర్మీ 15 రోజులపాటు సాగించిన ఆపరేషన్‌పై ఎన్నో సందేహాలు నెలకొన్నందున ఈ అంశం ప్రధానంగా సమీక్షకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాక్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాటును తాము భగ్నం చేశామని ఆర్మీ 15 రోజుల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్‌లో ఒక్క ఉగ్రవాది కూడా దొరకకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగబోయే సమావేశంలో కేరన్ అంశం చర్చకు రావచ్చని తెలుస్తోంది.
త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే మాథుర్ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కూడా పాల్గొనవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21 నుంచి ఆర్మీ కమాండర్ల నాలుగు రోజుల సదస్సు జరగనుంది. ఇందులో కేరన్ ఆపరేషన్‌కు సంబంధించి ఎన్నో అంశాలు చర్చించి.. అలాంటివి భవిష్యత్తులో ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు వ్యూహాలు రూపొందించనున్నారు.