భర్తను చంపిన భార్య
వె ల్దుర్తి, న్యూస్‌లైన్:భర్తను భార్యే చంపిన ఘటన మండలంలో సంచలనమైంది. కలుగొట్ల గ్రామంలో బోయ కేశన్న(45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎల్.బండ గ్రామానికి చెందిన కేశన్నతో కలుగొట్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వ్యవసాయంపై జీవిస్తూ ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. అన్యోనంగా ఉన్న వీరి దాంపత్యంలో కొంత కాలంగా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. తరచూ ఇద్దరూ ఘర్షణ పడేవారు. వారం రోజుల క్రితం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో లక్ష్మమ్మ పుట్టింటికి వెళ్లింది. భార్యను పిలుచుకొచ్చేందుకు కేశన్న మంగళవారం కలుగొట్ల గ్రామానికి చేరుకున్నాడు.
కాపురానికి రానని ఆమె తేల్చి చెప్పడంతో తిరిగి వెళ్తున్న ఆయనను భార్యతో పాటు మరదలు రాములక్క ఇంటికి తీసుకెళ్లారు. బుధవారం తెల్లారేసరికి కేశన్న హత్యకు గురయ్యాడు. అయితే భోజనం చేసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో అక్కాచెల్లెలు ఇద్దరూ కలిసి రోకలిబండతో అతని తలపై బలంగా దాడి చేసి గుండెపై పలుమార్లు కొట్టడంతో అక్కడి అక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. డోన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐ ధనుంజయ గ్రామానికి చేరుకుని హత్య ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే గ్రామస్తులను, కుటుంబసభ్యులను విచారించారు. హత్య చేసిన లక్ష్మమ్మ, రాములక్కను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపడుతామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.