Kespalli gangareddy
-
ప్రభుత్వ లాంఛనాలతో ‘కేశ్‌పల్లి’ అంత్యక్రియలు
►అశ్రునయనాల మధ్య గంగారెడ్డి అంతిమయాత్ర ►అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ►పాల్గొన్న మంత్రులు పోచారం, ఐకే రెడ్డి ►మెంట్రాజ్‌పల్లి ఫాంహౌస్‌లో దహన సంస్కారాలు సోమవారం గుండెపోటుతో మృతిచెందిన కేశ్‌పల్లి గంగారెడ్డి(84) అంత్యక్రియలు మంగళవారం డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి శివారుల్లోని కేశ్‌పల్లి ఫాంహౌస్‌లో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఆయన స్వగృహం నుంచి ఉదయం 10.30 గంటలకు గంగారెడ్డి అంతిమయాత్ర బయలుదేరింది. అంతిమయాత్రలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. – డిచ్పల్లి/నిజామాబాద్ అర్బన్ డిచ్పల్లి (నిజామాబాద్‌రూరల్), నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మాజీ ఎంపీ, డిచ్పల్లి మాజీ ఎమ్మెల్యే, అపజయం ఎరుగని నేతగా పేరొందిన కేశ్‌పల్లి (గడ్డం) గంగారెడ్డి (84) అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం అధికార లాంఛనాలతో నిర్వహించారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి శివారులోని కేశ్‌పల్లి ఫాంహౌస్‌లో పార్థీవదేహానికి దహన సంస్కారాలు జరిగాయి. అంతకు ముందు జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఆయన స్వగృహం నుంచి ఉదయం 10.30 గంటలకు గంగారెడ్డి అంతిమయాత్ర బయలుదేరింది. అంతిమయాత్రలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్త, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీతో పాటు పలువురు ప్రజా ప్రతినిదులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సుభాష్‌నగర్ నుంచి పూలాంగ్, మాధవనగర్, ధర్మారం(బి), నడిపల్లి, డిచ్పల్లి స్టేషన్ మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారిపై మెంట్రాజ్‌పల్లి ఫాంహౌస్‌కు భారీ ర్యాలీగా అంతిమయాత్ర చేరుకుంది. దారి పొడవునా ప్రజలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఫాంహౌస్‌లో గంగారెడ్డి భౌతిక కాయాన్ని చితిపై ఉంచగా, మంత్రులు ఐకే రెడ్డి, పోచారం శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్‌గా గాలిలోకి మూడుసార్లు కాల్పులు జరిపారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య గంగారెడ్డి కుమారులు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు. గంగారెడ్డి పెద్దకుమారుడు ఆనంద్‌రెడ్డి చితికి నిప్పంటించారు. అభిమానులు పెద్ద ఎత్తున కేశ్‌పల్లి గంగారెడ్డి అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ 1991లో తామిద్దరం ఒకేసారి పార్లమెంట్ సభ్యులుగా గెలిచామన్నారు. గంగారెడ్డి మూడు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో నాకు రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుబంధం ఉందని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ కేశ్‌పల్లి గంగారెడ్డి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆయన మృతి జిల్లా ప్రజలకు తీరని లోటని అన్నారు. అంతియయాత్రలో ఎమ్యెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, రాంచందర్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లెగంగారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, డీసీసీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, రాష్ట్ర నాయకులు పొతంగల్ రాంకిషన్‌రావు, అల్జాపూర్ శ్రీనివాస్, ఆలూర్ గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, లోక భూపతిరెడ్డి, నరాల రత్నాకర్, గడుగు గంగాధర్, అమృతాపూర్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ యోగితారాణా, కమీషనర్ కార్తికేయ, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్, జేసీ రవీందర్‌రెడ్డి, తెయూ వీసీ ప్రొఫెసర్ సాంబయ్య, సీవోఈ కనకయ్య, ఆర్డీవో వినోద్‌కుమార్, ఏసీపీ ఆనంద్‌కుమార్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో మర్రి సురేందర్, సీఐలు తిరుపతి, రాజేశ్, ఎస్సైలు కట్టా నరేందర్‌రెడ్డి, మురళి, శ్రీధర్‌గౌడ్, వివిధ పార్టీల నాయకులు, జిల్లా నలుమూలల నుంచి గంగారెడ్డి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఓటమి ఎరుగని ‘కేశ్‌పల్లి’
-
ఓటమి ఎరుగని ‘కేశ్‌పల్లి’
►హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి ►నిజామాబాద్ ఎంపీగా మూడుసార్లు పనిచేశారు.. ►నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ►హాజరుకానున్న మంత్రులు పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి ►ఎంపీ కవిత, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాయుడు ప్రకాశ్, పలు పార్టీల నాయకుల సంతాపం ఓటమి ఎరుగని నాయకుడు కేశ్‌పల్లి గంగారెడ్డి(84) సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న గడ్డం గంగారెడ్డి.. మూడుసార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. తన పార్థీవదేహాన్ని నిజామాబాద్‌లోని స్వగృహానికి తీసుకొచ్చారు. మంగళవారం డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, కేశ్‌పల్లి గంగారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్/డిచ్పల్లి/జక్రాన్‌పల్లి: జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు, ఓటమి ఎరుగని వీరుడు, మాజీ ఎంపీ కేశ్‌పల్లి అలియాస్ గడ్డం గంగారెడ్డి (84) ఇక లేరు. గుండెపోటు రావడంతో ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో గల ఇంటికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీసుకొచ్చారు. మంగళవారం డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి ఫాం హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకు ముందు ఉదయం సుభాష్‌నగర్ నుంచి ఫాం హౌస్ వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. అంత్యక్రియలకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. గంగారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, రెండ్రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. ఆదివారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ, కుమారులు ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కూతుళ్లు అహల్యారెడ్డి, శశికళారెడ్డి, అవనిజారెడ్డి ఉన్నారు. ఆనంద్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఊరు పేరే ఇంటి పేరుగా.. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజరెడ్డి, నర్సవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు గంగారెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి. పెద్ద కుమారుడైన గడ్డం గంగారెడ్డి 1933 జూలై 12న జన్మించారు. 1956లో పడకల్ గ్రామ సర్పంచ్‌గా మొదలైన ఆయన రాజకీయ జీవితంలో ఓటమి అనేదే ఎరుగరు. పడకల్‌కు కేశ్‌పల్లి గ్రామం ఆమ్లెట్ విలేజ్‌గా ఉండేది. పడకల్ గ్రామానికి మొట్టమొదటి సర్పంచ్ కూడా ఆయనే. గ్రామ స్థాయి నుంచి ఎదిగిన గంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తనదన ముద్ర వేశారు. ఆయన ఇంటి పేరు గడ్డం అయినప్పటికీ ఎక్కడికి వెళ్లినా ‘కేశ్‌పల్లి’ గంగారెడ్డి పిలిచే వారు. దీంతో ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మూడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజా సేవలో ముందుడి పని చేశారు. వెంటబడి మరీ పనులు చేయించుకోవాలని ఆయన ప్రజలకు సూచించే వారు. వస్తే, పోతే చుట్టం.. ఎప్పుడో ఒక్కసారి కలిస్తే పనులు ఎలా అవుతాయని తరచూ అంటుండే వారు. జక్రాన్‌పల్లి మండలంలో ఏ గ్రామంలో పర్యటించినా తన బాల్యాన్ని గుర్తు చేసుకొనే వారు. గంగారెడ్డి మృతి జిల్లా ప్రజలకు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చింది. రాజకీయ ధీరుడు.. 1956లో సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. 1991లో టీడీపీ తరఫున తొలిసారి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. మళ్లీ, 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మచరణ్రెడ్డిని ఓడించి రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాతి సంవత్సరమే 1999లో లోక్‌సభలకు మళ్లీ ఎన్నికలు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్‌రెడ్డిపై గెలిచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం, తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమవుతున్న తరుణంలో గంగారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటివరకు నియోజకవర్గంలో వరుసగా గెలుస్తున్న టీడీపీ అభ్యర్థి మండవ వెంకటేశ్వరరావును ఓడిం చి సంచలనం సృష్టించారు. తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గంగారెడ్డి 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఉప ఎన్నికల్లో తన కుమారుడు గడ్డం ఆనంద్‌రెడ్డిని బరిలో నిలిపారు. అయితే, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత గెలుపొందారు. ఆ తర్వాత 2012లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన బీజేపీలో చేరినా ఎన్నికల బరిలో దిగలేదు. 1998, 1999లో అర్బన్, రూరల్ డెవలప్మెంట్ సబ్ కమిటీ సభ్యుడిగా, కేంద్ర నీటివనరుల సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు. విశేష సేవలు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేష సేవలు చేసిన గంగారెడ్డికి వివాద రహితుడిగా, సౌమ్యుడిగా పేరుంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు రైల్వే బ్రాడ్‌గేజ్ నిర్మాణం కోసం తీవ్రంగా కృషి చేసి, దాన్ని పూర్తి చేయించారు. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమైన నిజామాబాద్–పెద్దపల్లి రైల్వే లైన్ కూడా కేశ్‌పల్లి ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపాదించినదే. బీడీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకున్న ఏకైక నాయకుడు ఆయనేనని కార్మికులు చెబుతారు. జిల్లా కేంద్రంలో బీడీ కార్మికుల కోసం ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని, ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయించారు. డిచ్‌పల్లిలో ఎఫ్‌సీఐ గోదాం నిర్మాణానికి, నిజామాబాద్‌లో రేడియో స్టేషన్ మంజూరు చేయించిన ఘనత ఆయనదే. డిచ్పల్లి, బర్ధిపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణంతో పాటు రామడుగు ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఎంపీగా ఉన్న సమయంలో గ్రామీణ రోడ్లకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. కేశ్‌పల్లి, పడకల్ గ్రామాల్లో రెండెకరాల భూమిని కొనుగోలు చేసి, పాఠశాలలను ఏర్పాటు చేయించారు. పడకల్–చింతలూర్ వరకు, అలాగే, కేశ్‌పల్లి జాతీయ రహదారి నుంచి కొరట్పల్లి రోడ్లు నిర్మించారు. అంతేకాక తన సొంత గ్రామంలో కేశవనాథ ఆలయానికి రూ.60లక్షల ఎండోమెంట్ నిధులు కేటాయించి, పూర్తి చేయించారు. తను బతికి ఉండగానే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివేందుకు గంగా చారిటేబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి, స్కాలర్షిప్లు ఇచ్చారు. ట్రస్టు ద్వారా నిజామాబాద్ ప్రజలకు ఉచితంగా నీటి సరఫరా చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గంగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గంగారెడ్డి మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగి పోయారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఎంపీ కవిత సహా పలువురి సంతాపం.. సాక్షి, నిజామాబాద్: గంగారెడ్డి మృతిపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. రాజకీయ కురువృద్ధుడు గంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ కవిత ట్విట్టర్లో పేర్కొన్నారు. గంగారెడ్డి హఠాన్మరంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాయుడు ప్రకాశ్, ఈగ గంగారెడ్డి, పల్లె గంగారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గంగారెడ్డి పార్థివ దేహానికి మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహెర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి నేతలు గడుగు గంగాధర్, మహేశకుమార్‌గౌడ్, రాంకిషన్‌రావు, విఠల్, సురేందర్, ప్రముఖ బిల్డర్ తుమ్మల అశోక్‌రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.