గుజరాత్లో 4.5 కోట్ల దొంగనోట్లు.. పట్టివేత
పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోనే అత్యంత పెద్దమొత్తంలో దొంగనోట్లు బయటపడ్డాయి. దాదాపు రూ. 4.5 కోట్ల విలువైన రెండువేల నకిలీనోట్లను గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న నోట్లు చాలా పెద్దమొత్తంలో ఉండటంతో వాటిని లెక్కపెట్టడానికి రాత్రంతా పట్టింది. మొత్తం 22,479 నోట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. వీటి విలువ సుమారు రూ. 4.49 కోట్లకు పైగా ఉంది.
రాజ్‌కోట్‌కు చెందిన కేతన్ దవే అనే ఫైనాన్షియర్‌ను అరెస్టు చేసి విచారిస్తే.. తీగలాగితే డొంకంతా కదిలినట్లు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నితిన్ అజానీ అనే తుక్కు డీలర్ దవే మీద ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనను విచారించగా, మొత్తం వ్యవహారం బయటపడింది. ముందుగా దవే కార్యాలయంలో 2,858 నకిలీనోట్లు బయటపడ్డాయి. ఇప్పటికే తన సహచరులు పార్థ్ తెరియా, ఉమర్ గజ్జర్ అనే ఇద్దరు కలిసి దాదాపు కోటి రూపాయల విలువైన దొంనోట్లను తగలబెట్టేశారని దవే చెప్పాడు. కార్లలో దొంగనోట్లు దాచే అలవాటు దవేకు ఉందని గజ్జర్ చెప్పడంతో అతడివద్ద కనపడకుండా పోయిన చాలా కార్లను వెతకగా.. వాటిలో ఒకదాంట్లో మరిన్ని నోట్లు బయటపడ్డాయి. వాటిని లెక్కపెడితే రూ. 3.94 కోట్ల విలువైనవి కనిపించాయి. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.