చంపి, క్షమాపణ చెప్పిన మావోయిస్టులు
ముందు ప్రాణాలు తీసి, ఆ తరువాత తీరిగ్గా క్షమాపణలు చెబుతున్నారు మావోయిస్టులు. ఛత్తీస్ గఢ్ లో బీజాపుర్ జిల్లాలోని కేతుల్ నార్ లో ఎన్నికల విధుల్లో ఉన్న ఏడుగురిని శనివారం హడావిడిగా చంపేసిన మావోయిస్టులు మంగళవారానికి తీరిగ్గా క్షమాపణలు చెప్పారు.
ఈ మేరకు రెండు పేజీల బహిరంగ క్షమాపణను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ జారీ చేసింది. ఎన్నికల సిబ్బందిని భద్రతాదళాలుగా పొరబడ్డామని, అందుకే ఈ ఘోరం జరిగిందని ఆ లేఖలో మావోయిస్టులు చెప్పారు. ఎన్నికల సిబ్బంది కుట్రు అనే చోట నుంచి గుడ్మా అనే ప్రదేశానికి పోలింగ్ తరువాత తిరిగి వస్తూండగా మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ సంఘటనలో ఏడుగురు చనిపోయారు.
నిజానికి మావోయిస్టుల చేతిలో ఏడుగురు అమాయకులు బలికావడం పట్ల స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చనిపోయిన వారందరూ బస్తర్ వాసులే కావడంతో ప్రజలనుంచి నిరసన ఎదురుకావడం మావోయిస్టులకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ఈ బహిరంగ క్షమాపణను జారీ చేశారు. 'వారు మాకు శత్రువులు కారు. వారికి మాకు ఎలాంటి విరోధమూ లేదు. ఈ లోటు పూడ్చలేనిది. ఏం చేసినా పోయిన ప్రాణాలను తీసుకురాలేము' అని మావోయిస్టులు ఇప్పుడు అంటున్నారు.