KG to PG free education
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి
హయత్‌నగర్: తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చాలని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా పెద్దంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని జె కన్వెన్షన్ హాలులో జరిగిన పార్టీ 2వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కవులు, కళాకారుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని కోరారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని కోరారు. ఈమేరకు సమావేశంలో 15 తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాణి రుద్రమరెడ్డి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరిగే ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమరెడ్డి బరిలో దిగనున్నారు. ఈమేరకు సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.కాజన్‌గౌడ్, సోమగు శంకర్, ఎన్.రవికుమార్, తుమ్మ రమేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ(భువనగిరి) జె.వెంకటనారాయణ (ఖమ్మం) తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేజీ టు పీజీ: కడియం
⇒ ప్రాథమిక పాఠశాలలతో అంగన్వాడీ కేంద్రాల అనుసంధానం ⇒ ఐదు నుంచి 12వ తరగతి వరకు గురుకులాల్లో విద్య ⇒ డిగ్రీ, పీజీలకు రీయింబర్స్మెంట్.. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య సాక్షి, హైదరాబాద్: ‘‘అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానిస్తాం. ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకులాల్లో ఉచిత విద్య ఉంటుంది. డిగ్రీ, పీజీలకు ఫీజు రీయిం బర్స్మెంట్ అమలు చేస్తున్నాం. మొత్తంగా ‘కేజీ టు పీజీ’వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుంది..’’అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 529 గురుకుల పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం శాసనసభలో విద్యా సంబం ధిత అంశాల పద్దుపై జరిగిన చర్చలో కడి యం మాట్లాడారు. ఇప్పటికే ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించామని, మరో ఐదు వేల పాఠశా లల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. మూడేళ్లుగా ఏం చేశారు? తొలుత ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడారు. ఎన్నికల ప్రణాళికలో కేజీ టు పీజీని పొందుపరిస్తే పేద ప్రజలు ఎంతో సంతోషించారని.. కానీ ఆ పథకం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే పరిమితమైందని విమర్శించారు. ఇంటర్ విద్య అందుబాటులో లేక మారుమూల ప్రాంతాల్లోని బాలికలు పదో తరగతితో చదువు ఆపేస్తున్నారని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు. మండల కేంద్రాల్లో ఇంటర్, నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి కోరారు. కాలేజీలు మంజూరు చేస్తూ కాగితాలు వస్తున్నాయని.. కానీ భవనాలు, ఫర్నీచర్, అధ్యాపకులు లేకుంటే ఎలా నడుస్తాయని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి కడియం వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో మ్యాపింగ్ చేశామన్నారు. భవనాలు, ఫర్నిచర్, ఇతర అవ సరాల కోసం 480 కోట్లు కేటాయించామన్నారు. ఎమ్మెల్యేల ఇళ్ల డిజైన్‌లో వాస్తు లోపం! నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మె ల్యేలకు కట్టిస్తున్న క్యాంపు కార్యా లయం, నివాస సముదాయ భవన నమూనాలో వాస్తుదోషం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఉందని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేల తల్లి దండ్రులు కూడా ఉండేందుకు మరో బెడ్రూం నిర్మించాలని.. నిర్మాణ వ్యయాన్ని రూ.రెండు కోట్లకు పెం చాలని కోరారు. మంత్రి తుమ్మల సమాధానమిస్తూ.. ఎమ్మెల్యేల ఇళ్ల నమూనాలో ఎలాంటి వాస్తు దోషం లేదని తెలిపారు. ఇంధనాన్ని పొదుపు చేసే ఆర్టీసీ సిబ్బందికి ప్రోత్సాహకాల మొత్తాన్ని పెంచాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. -
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి
టీజీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన కలెక్టరేట్: కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయలని టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలిగ లింగస్వామి కురుమ డిమాండ్ చేశారు. మంగళవారం విద్యాహక్కు చట్టం అమలుపై తలపెట్టిన హైదరాబాద్ జిల్లా డీఈవో కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిజాం కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి డీఈవో కార్యాలయాన్ని ముట్టడించాలనుకున్న టీజీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాలిగ లింగస్వామి మాట్లాడుతూ... విద్యార్థుల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులనే విస్మరించడం బాధాకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ పాఠశాలల్లో పటిష్టంగా విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలని, డీఎస్సీ ప్రకటన విడుదల చేయాలని, శాశ్వత డిప్యూటీ డీఈవో, ఎంఈవోలను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నక్క శ్రీశైలం యాదవ్, ఉపాధ్యక్షుడు ఎం. కృష్ణకాంత్, ఓయూ అధ్యక్షుడు గొడిగె వెంకన్న, అబిడ్స్ ఇన్చార్జ్ రాజేష్, ప్రవీణ్, కిరణ్, నవీన్ యాదవ్, వెంకన్న, రమేష్, నవీన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పాఠశాలల బంద్: ఏబీవీపీ
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్య విధివిధానాలు తక్షణమే ప్రకటించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలన్నారు. కేజీ టు పీజీ విధివిధానాలను ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలన్నారు. నేడు జరిగే ఈ పాఠశాలల బంద్‌కు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆటంకాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏబీవీపీ నేతలు శ్రీధర్, రాజేంద్ర ప్రసాద్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుచేస్తాం: జగదీశ్వర రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో కేజీ టు పీజీ విద్యను ఖచ్చితంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటామన్నారు. ప్రైవేటు కళాశాలల విషయంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందన్నారు. కళాశాలల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు.