‘చెన్నైలో వరదలు వచ్చే అవకాశం లేదు’
న్యూఢిల్లీ: వర్దా తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ తెలిపారు. అర్ధరాత్రి తర్వాత గాలుల తీవ్రత, వర్షాలు తగ్గుతాయని వెల్లడించారు. గతంలోలా చెన్నైని వరదలు ముంచెత్తే అవకాశం లేదని స్పష్టం చేశారు. చెన్నైకు ఉత్తర దిక్కుగా కేంద్రీకృతమై ఉందని, కొద్ది నిమిషాల్లో తీరం దాటుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పై వర్దా తుపాను ప్రభావం తక్కువేనని తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. నెల్లూరు జిల్లాలో రేపటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు చేరవేస్తున్నామని తెలిపారు. గతేడాది దాదాపు 15 రోజులు భారీ వర్షాలు కురవడంతో చెన్నై నగరం చాలా వరకు మునిగిపోయిన సంగతి తెలిసిందే.
వర్దా తుపాను తీరం దాటుతుండగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయని వాతావరణ శాఖ అదరనపు డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు. చెన్నైలో గరిష్టంగా గంటకు 192 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయని వెల్లడించారు.