breaking news
Khazana Jewellery showroom
-
‘ఖజానా’ దోచింది బిహార్ గ్యాంగే!
చందానగర్: సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో బిహార్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా షోరూంలో ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి దొరికినకాడికి వెండి వస్తువులను అపహరించారు. దీన్ని చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి 48 గంటల్లోనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరి టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే...బిహార్‌కు చెందిన ఆశిష్ (22)తోపాటు మరో ఐదుమంది జీడిమెట్లలోని ఆస్టెస్టస్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు. వీరిని బిహార్‌లోని శరణ్, శివాణ్ జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆశిష్ స్నేహితుడు దీపక్ కుమార్ (22) వీరికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటున్నాడు. వీరు ఏ1 మోటార్స్ వద్ద రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆరుగురు మూడు జ్యువెలరీ దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. అయితే ఖజానా జ్యువెలరీ వద్ద భద్రత తక్కువ ఉండటంతో దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.బిహార్‌లోని శరణ్ జిల్లాకు చెందిన ఆశిష్ గ్యాంగ్ టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే. ఒకసారి ఒక నగరంలో దొంగతనం చేస్తే మళ్లీ ఆ నగరానికి రాకపోవడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు బిహార్, రాజస్తాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో దొంగతనాలు చేశారు. ఈ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ చేయడం ఇదే మొదటిసారి. వీరు దోచుకున్న ఆభరణాలను బిహార్, ఢిల్లీలో విక్రయిస్తుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో గ్యాంగ్ ముఖ్యనాయకుడిపై రెండు హత్య కేసులు సహా మొత్తం 10 కేసులుండగా, ఆశిష్‌పై 4 కేసులున్నాయి.దొంగ చిక్కాడు ఇలా....ఖజానాలో చోరీ అనంతరం ఆరుగురు నిందితులు రెండు బైకులపై బీదర్ వైపు వెళ్లారు. ప్రధాన రోడ్లపై కాకుండా గ్రామాల వైపు నుంచి రాష్ట్రాన్ని దాటారు. బైకులను రాష్ట్ర సరిహద్దు వద్ద వదిలేసి ప్రజా రవాణాలో వెళ్లారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు వాడిన సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి బీదర్ నుంచి వారిని వెంబడించారు. వారు బీదర్ వద్ద త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.దీంతో రెండు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లాయి. ఈ క్రమంలో పుణేలో ఆశిష్‌ను పట్టుకున్నారు. తర్వాత వీరికి సహకరించిన దీపక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా వారందరినీ పట్టుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు. ‘జ్యువెలరీ షోరూంల నిర్వాహకులు దుకాణంలో చొరబాటు హెచ్చరిక అలారమ్‌ను బిగించుకోవాలి. ఆ అలారమ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానమై ఉండాలి’ అని చెప్పారు. -
ఖజానా జ్యువెలరీ కేసును చేధించిన పోలీసులు.. డీసీపీ మీడియా సమావేశం
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో దొంగతనం కేసులో నిందితులను పట్టుకుని, వారు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.మాదాపూర్ డీసీపీ వినిత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో డీసీపీ వినిత్ మాట్లాడుతూ.. ఆగస్టు 12వ తేదీన చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులోకి నిందితులు వచ్చారు. మేనేజర్‌పై ఫైరింగ్ చేశారు.. ఆభరణాలు దోచుకున్నారు. ఖజానా జ్యువెలరీ దొంగతనంలో ఇద్దరిని అరెస్టు చేశాం. మరో ఐదుగురు దొంగలు పరారీలో ఉన్నారు. 900 గ్రాముల వెండి, గోల్డ్ కోటెడ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. మొత్తం ఏడుగురు కలిసి ఖజానా జ్యువెలరీలో దొంగతనానికి పాల్పడ్డారు. వాళ్ళ మీద గతంలో మర్డర్ కేసులు, దొంగతనం కేసులున్నాయి. ఆశిష్ అనే దొంగ ఇంట్లో ఉంటూ 20 రోజులపాటు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలు వెళ్లిన దారి, లోకేషన్ ట్రేస్ చేసి పసిగట్టి పూణే దగ్గర అరెస్టు చేశాం. 24 గంటల్లో కేసు ఛేదించాం. అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించాం.ప్రతీ జ్యువెలరీ షాప్ సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకొని షాప్ నిర్మాణాలు చేసుకోవాలి. రెండు బైకులలో ఆరుగురు వచ్చారు దొంగతనంలో పాల్పడ్డారు ఒకతను వీళ్లకు సహకరించాడు మొత్తం ఏడుగురు. మొత్తం నాలుగు వెపన్స్ తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. A1 మోటార్స్ అనే బైక్ మెకానిక్ షాప్ లో రెండు సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ లను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి పారిపోయే ప్రయత్నం చేశారు. బైకులకు నెంబర్ ప్లేట్లు తీసేసి దొంగతనానికి పాల్పడ్డారు. కొంత దూరం వరకు బైకులపై వెళ్లి తర్వాత వివిధ మార్గాలలో పూణే వరకు చేరుకున్నారు. ఇంకా ఐదుగురు పరారీలో ఉన్నారు వాళ్లలో మోస్ట్ క్రిమినల్ ఒకతను ఉన్నాడు. ఫైరింగ్ చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.ఒకే దగ్గర ఎక్కువ బంగారం దొరుకుతుందనే ఆలోచనతో ఖజానా జ్యువెలరీపై పడ్డారు. 10 కేజీల వరకు వెండి ఆభరణాలు పోయాయి. ఇలాంటి దొంగతనాలు బీహార్‌లో, రాజస్థాన్, మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కూడా జరిగాయి. ఇంకా పూర్తి విచారణ చేస్తున్నాం. ఈ గ్యాంగు బంగారం షాపులపైనే షాపులలో ఎక్కువ దొంగతనాలకు పాల్పడుతుంటారు. బీహార్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి ఈ దొంగల ముఠాకు అన్ని రకాలుగా సహకరించాడు. వీరి మీద అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయి అని తెలిపారు.కాగా, ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యవెలర్స్‌లో పట్టపగలే దుండగులు డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. అనంతరం షాపులోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగులగొట్టారు. అవన్నీ మూడు బ్యాగుల్లో నింపుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి బైకులపై పరారయ్యారు. పోలీసులు వచ్చే సమయానికే పారిపోయిన దొంగల ముఠా సీసీ కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు. అయితే, పోలీసులు విచారణలో భాగంగా దోపిడీ గ్యాంగ్ నెల రోజుల క్రితమే బీహార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేశారు. బీహార్ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకుని.. దాదాపు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి దోపిడీ చేసి ఉడాయించారు. -
‘ఖజానా’ దోచిన దొంగ చిక్కాడు!
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో మంగళవారం దొంగతనానికి పాల్పడిన ముఠాలో ఓ దుండగుడు చిక్కాడు. మహారాష్ట్రలోని పుణేలో ఒకరిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ ముఠా బిహార్‌కు చెందినదిగా గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం మహారాష్ట్రతో పాటు బిహార్‌లో ముమ్మరంగా గాలిస్తున్నారు. గంగారంలో నేరం చేసిన తర్వాత ఆరుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై కర్ణాటకకు వెళ్లారు. ఆ రాష్ట్రంలో వాహనాలను వదిలేసి ఎవరికి వారుగా విడిపోయారు. చోరీ సొత్తుతో ఇద్దరు వెళ్లిపోగా... మిగిలిన నలుగురిలో ఒకరు పుణే చేరుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తుచేసిన సైబరాబాద్ పోలీసులు పుణేలో ఉన్న నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకుని ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. దుండగులు వినియోగించినవి బిహార్‌లో తయారైన పాయింట్ 9 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్స్‌గా తేల్చారు. గరిష్టంగా అరగంటలో చందానగర్ చేరుకునే విధంగా ఈ ముఠా ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ‘బిహార్‌కు చెందిన ఈ దోపిడీ, బందిపోటు ముఠాలు దుకాణాలనే టార్గెట్ చేస్తుంటాయి. ఆ షాపు తెరిచేప్పుడు లేదా మూసేటప్పుడు మాత్రమే విరుచుకు పడతాయి. ఖజానా జ్యువెలరీ నుంచి ఎత్తుకుపోయిన వెండి మొత్తం బిహార్ వెళ్లిన వారి వద్దే ఉన్నాయి. అక్కడి ఈ సొత్తును విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకుంటారు’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
'ఖజానా' కొల్లగొడదామని..
సాక్షి, హైదరాబాద్/చందానగర్: హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూంపై బందిపోటు దొంగలు పంజా విసిరారు. మంగళవారం ఉదయం షాపు తెరిచే సమయంలోనే తుపాకులతో చొరబడిన ముఠా బంగారం కోసం ప్రయత్నించి గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో పరారయ్యింది. ఈ సందర్భంగా దుండగుల కాల్పుల్లో షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ కాలుకి గాయం కాగా.. సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. జిన్నారం మీదుగా పారిపోయిన ఈ ముఠాను పట్టుకోవడానికి 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ప్రకటించారు. మాదాపూర్ డీసీపీ వినీత్, మియాపూర్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఉదయం షోరూమ్ తెరిచీ తెరవగానే.. జాతీయ రహదారిపై గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంను యథావిధిగా మంగళవారం ఉదయం 10.15 గంటలకు తెరిచారు. ఆ సమయంలో విధులకు హాజరైన 25 మంది సిబ్బందితో రోజూ మాదిరిగానే డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ మాట్లాడుతున్నారు. 10.30 గంటల ప్రాంతంలో ఆ షోరూం వద్దకు మాస్క్‌తో వచ్చిన ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా తన ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఐదు నిమిషాలకు రెండు ద్విచక్ర వాహనాలపై మరో ఐదుగురు అక్కడకు చేరుకున్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. ఒకరు షోరూం బయటనే ఆగిపోగా.. మరొకరు ప్రధాన ద్వారం దగ్గర కాపు కాశారు. మిగిలిన నలుగురూ నేరుగా సిబ్బంది ఉన్న ప్రాంతానికి వచ్చారు. మాస్క్‌లు ధరించి ఉన్న దుండగులను వినియోగదారులని ఉద్యోగులు భావించారు. ఏం కావాలని అడగడానికి ఓ ఉద్యోగి వస్తుండగా తుపాకులు ఉన్న ముగ్గురు దుండగలు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ డిప్యూటీ మేనేజర్‌ను లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆయన తన వద్ద తాళాలు లేవని చెప్పడంతో ‘చుప్ బే’అంటూ బెదిరించిన ఓ దుండగుడు అతని ఎడమ కాలుపై కాల్చాడు. షోరూమ్‌లో ఉన్న రెండు సీసీ కెమెరాలను కూడా కాల్చారు. గోల్డ్ కోటెడ్‌వే నిజమైనవి అనుకుని.. ప్రతిరోజూ షోరూమ్ మూసేముందు అదే అంతస్తులోని మెజ్జనైన్ ఫ్లోర్లో ఉన్న లాకర్లో బంగారు ఆభరణాలను భద్రపరుస్తారు. ఉదయం షోరూమ్ తెరిచిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ తాళాలు తీస్తే బంగారు ఆభరణాలను బయటకు తీసువచ్చి కింది ఫ్లోర్లో ఉన్న షో కేసుల్లో సర్దుతారు. అయితే మంగళవారం ఉదయం దుండగులు వచ్చిన సమయానికి అసిస్టెంట్ మేనేజర్ రాకపోవడంతో ఈ బంగారం దోపిడీ దొంగలకు దొరకలేదు. ఈ షోరూమ్‌లో వినియోగదారులకు చూపించడానికి బయటకు తీసి, మళ్లీ లోపల పెట్టడానికి ఉన్న కొన్ని షోకేస్‌లతో పాటు ఆభరణాలను డిస్ప్లే చేయడానికి ఉన్న షో కేసుల్లో గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలను ఉంచుతారు. వీటినే బంగారు ఆభరణాలుగా భావించిన దుండగులు ఆ షోకేసుల్ని ధ్వంసం చేసి అందులో ఉన్న ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకుని వాహనాలపై ఉడాయించారు. ఈ వెండి ఐదు నుంచి పది కిలోల వరకు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ దోపిడీ ముగిసింది. పక్కాగా రెక్కీ చేసిన తర్వాతే నేరం! దుండగులు రెండుమూడు రోజుల పాటు రెక్కీ చేసిన తర్వాతే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి వచ్చిన కమిషనర్ అవినాష్ మహంతి బందిపోటు దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందాలు.. నేరం చేసిన తర్వాత దుండగులు చందానగర్–పటాన్చెరు–కృష్ణారెడ్డిపల్లి–జిన్నారం మీదుగా పరారైనట్లు గుర్తించారు. దుండగుల్లో ఒకడు ‘చుప్ బే’అనే పదం వాడటాన్ని బట్టి.. అది మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షోరూం డిప్యూటీ మేనేజర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. -
ఖజానా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ రష్మిక
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ సంస్థ ఖజానా జ్యువెలరీ తమ సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి శ్రీమతి రష్మిక మందన్నను ప్రకటించింది. దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమానుల సంఖ్య గల ప్రముఖ తారలలో రష్మిక ఒకరు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. అక్షయ తృతీయతో ప్రారంభించి భారతదేశం అంతటా ప్రింటింగ్, బహిరంగ, టీవీలలో ప్రకటన ద్వారా ఖజానా జ్యువెలరీకి చెందిన అందమైన డిజైన్లను ఆమె ప్రమోట్ చేయనుంది. ఈ ఒప్పందంపై ఖజానా జ్యువెలరీ చైర్పర్సన్ మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. "మా బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీమతి రష్మికను ఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే నెలల్లో ఆమెతో మేము అనేక రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తాము. మా బ్రాండ్, మా కస్టమర్ల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించాలని" చూస్తున్నాము అని అన్నారు. ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ.. “ఖజానా గొప్పతనం గురుంచి అందరికీ తెలిసిందే, నన్ను దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడం నాకు సంతోషం కలిగిస్తుంది. వారి ప్రత్యేకమైన నమూనాలు, ఉన్నతమైన విలువల గురుంచి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను వారితో భాగస్వామ్యం కావడం గురించి సంతోషిస్తున్నాను. అలగే, ఖాజానా స్టోర్లలో ఉన్న కొత్త కలెక్షన్స్ చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను” అని తెలిపింది. ఖజానా జ్యువెలరీ బిఐఎస్ హాల్మార్క్డ్ 916 బంగారు ఆభరణాలను అమ్మడం, అధిక-నాణ్యత ప్రమాణాలను పాటించడం ద్వారా భాగా ప్రాచుర్యం పొందింది. తక్కువ ధరలో మెరుగైన నాణ్యమైన ఆభరణాలను వినియోగదారులకు అందిస్తుంది. ఒక వ్యాపార సంస్థగా మాత్రమే కాకుండా, ఖజానా జ్యువెలరీ క్రమం తప్పకుండా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి కార్యక్రమాల కోసం సంస్థ తన లాభాలలో కొంత భాగాన్ని కేటాయిస్తుంది. ఖజానా జ్యువెలరీని 1993లో చెన్నైలోని కేథడ్రల్ రోడ్లో మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మొదటి షోరూమ్ ను ప్రారంభించారు. ఇన్ని సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదిగి 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ గల సంస్థగా ఎదిగింది. భారతదేశం అంతటా 50కి పైగా షోరూమ్‌లు కలిగి ఖాజానా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బంగారం, వెండి ఆభరణాల వ్యాపార సంస్థగా ఇప్పుడు నిలిచింది. చదవండి: ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక -
‘ఖజానా’ సేల్స్ బాయ్ అనుమానాస్పద మృతి
ఆత్మహత్య చేసుకున్నాడంటున్న నిర్వాహకులు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్న బాధితులు అనంతపురం క్రైం :అనంతపురంలోని ఖజానా జ్యువెలరీ షోరూం సేల్స్‌బాయ్ గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మద్యం మత్తులో మూడంతస్తుల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సంస్థ నిర్వాహకులు చెబుతుండగా.. బంగారు పోయిందని విచారణ పేరుతో అతన్ని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ వృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితులు రాత్రి పొద్దుపోయేదాక రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీఎస్పీ నాగరాజు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం పడమటి నారాయణపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ (26) ఎంబీఏ వరకు చదివాడు. ఉపాధి కోసం నగరంలోని ఖజానా జ్యువెలరీ షోరూంలో సేల్స్ బాయ్‌గా పని చేస్తున్నాడు. మిత్రులతో కలసి నగరంలోనే అద్దె గదిలో నివసిస్తున్నాడు. పది రోజుల క్రితం షోరూంలో మూడు బంగారు ఉంగరాలు మాయమయ్యాయని, వాటిని ఎవరు తీసుకున్నారో ఇవ్వాలని ఆ విభాగంలో పనిచేసే బాలకృష్ణ, మహేష్, రవిచంద్ర, రమేష్‌నాయక్, జ్యోతిలను యాజమాన్యం హెచ్చరించింది. తాము తీయలేదని, కావాలంటే సీసీ కెమెరాల్లోని పుటేజీలను పరిశీలించండని వారు ఎంత చెప్పినా పట్టించుకోని యాజమాన్యం గురువారం విచారణ నిమిత్తం చెన్నయి నుంచి డీజీఎం రాకేష్, ఏఎస్ఎం అరవింద్‌లను ‘అనంత’కు పంపింది. దీంతో ఉదయాన్నే ఐదుగురు సిబ్బంది(నలుగురు సేల్స్‌బాయ్స్-ఒక సేల్స్గర్ల)నీ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లిన సంస్థ మేనేజ్మెంటు సభ్యులు నాలుగు గంటలపాటు తీవ్రస్థాయిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉంగరాలు తీసింది తామేనని ఒప్పుకోకపోతే తలా రూ.50 వేలు కట్టాల్సి ఉంటుందని, లేని పక్షంలో మరింత బంగారం అపహరించారని మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. అయినా తాము తప్పు చేయలేదని తెగేసి చెప్పడంతో... తలా రూ.లక్ష కట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తాగిన మత్తులో ఉన్న బాలక ృష్ణ నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం పైనుంచి లిఫ్ట్ ఏర్పాటు చేయబోయే ప్రదేశంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ‘ఖజానా’ నిర్వాహకుల తరఫున బాలకృష్ణ మిత్రులకు ఫోన్‌ద్వారా సమాచారం అందింది. అనంతరం విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ‘ఖజానా’ తలుపులు మూసేశారు. బాలకృష్ణకు ఎటువంటి చెడు వ్యసనాలూ లేవని, ‘ఖ జానా’ వారే చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. విచారణ పేరుతో యాజమాన్యం పెడుతున్న ఇబ్బందులు, వేధింపుల గురించి తన అన్న ఫోన్లో చెప్పాడంటూ బాలకృష్ణ తమ్ముడు హరి విలపించాడు. తమ ప్రాణాలు కూడా తీసుకోండంటూ కుటుంబ సభ్యులు విలపించారు. పరిస్థితి చేజారుతుండటంతో పోలీసులు డీఎస్పీ నాగరాజు.. సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన విరమించజేశారు.