‘ఖజానా’ సేల్స్ బాయ్ అనుమానాస్పద మృతి
ఆత్మహత్య చేసుకున్నాడంటున్న నిర్వాహకులు
హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్న బాధితులు
అనంతపురం క్రైం :అనంతపురంలోని ఖజానా జ్యువెలరీ షోరూం సేల్స్‌బాయ్ గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మద్యం మత్తులో మూడంతస్తుల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సంస్థ నిర్వాహకులు చెబుతుండగా.. బంగారు పోయిందని విచారణ పేరుతో అతన్ని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ వృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితులు రాత్రి పొద్దుపోయేదాక రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీఎస్పీ నాగరాజు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం పడమటి నారాయణపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ (26) ఎంబీఏ వరకు చదివాడు. ఉపాధి కోసం నగరంలోని ఖజానా జ్యువెలరీ షోరూంలో సేల్స్ బాయ్‌గా పని చేస్తున్నాడు. మిత్రులతో కలసి నగరంలోనే అద్దె గదిలో నివసిస్తున్నాడు. పది రోజుల క్రితం షోరూంలో మూడు బంగారు ఉంగరాలు మాయమయ్యాయని, వాటిని ఎవరు తీసుకున్నారో ఇవ్వాలని ఆ విభాగంలో పనిచేసే బాలకృష్ణ, మహేష్, రవిచంద్ర, రమేష్‌నాయక్, జ్యోతిలను యాజమాన్యం హెచ్చరించింది. తాము తీయలేదని, కావాలంటే సీసీ కెమెరాల్లోని పుటేజీలను పరిశీలించండని వారు ఎంత చెప్పినా పట్టించుకోని యాజమాన్యం గురువారం విచారణ నిమిత్తం చెన్నయి నుంచి డీజీఎం రాకేష్, ఏఎస్‌ఎం అరవింద్‌లను ‘అనంత’కు పంపింది. దీంతో ఉదయాన్నే ఐదుగురు సిబ్బంది(నలుగురు సేల్స్‌బాయ్స్-ఒక సేల్స్‌గర్‌ల)నీ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లిన సంస్థ మేనేజ్‌మెంటు సభ్యులు నాలుగు గంటలపాటు తీవ్రస్థాయిలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఉంగరాలు తీసింది తామేనని ఒప్పుకోకపోతే తలా రూ.50 వేలు కట్టాల్సి ఉంటుందని, లేని పక్షంలో మరింత బంగారం అపహరించారని మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. అయినా తాము తప్పు చేయలేదని తెగేసి చెప్పడంతో... తలా రూ.లక్ష కట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తాగిన మత్తులో ఉన్న బాలక ృష్ణ నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం పైనుంచి లిఫ్ట్ ఏర్పాటు చేయబోయే ప్రదేశంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ‘ఖజానా’ నిర్వాహకుల తరఫున బాలకృష్ణ మిత్రులకు ఫోన్‌ద్వారా సమాచారం అందింది. అనంతరం విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ‘ఖజానా’ తలుపులు మూసేశారు. బాలకృష్ణకు ఎటువంటి చెడు వ్యసనాలూ లేవని, ‘ఖ జానా’ వారే చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. విచారణ పేరుతో యాజమాన్యం పెడుతున్న ఇబ్బందులు, వేధింపుల గురించి తన అన్న ఫోన్‌లో చెప్పాడంటూ బాలకృష్ణ తమ్ముడు హరి విలపించాడు. తమ ప్రాణాలు కూడా తీసుకోండంటూ కుటుంబ సభ్యులు విలపించారు. పరిస్థితి చేజారుతుండటంతో పోలీసులు డీఎస్పీ నాగరాజు.. సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన విరమించజేశారు.