ఏఐఎఫ్‌లలో విదేశీ పెట్టుబడులకు ఓకే
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల ఫండ్స్‌ను (ఏఐఎఫ్) మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమంలో వీటికి పన్నులపరమైన ప్రయోజనాలు కల్పిస్తూ ‘పాస్ థ్రూ’ హోదా ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సాధనాల్లో విదేశీ పెట్టుబడులను కూడా అనుమతించాలని నిర్ణయించింది. పాస్ థ్రూ హోదా ఉన్న సంస్థలకు వచ్చే ఆదాయంపై పన్నులు.. కార్పొరేట్ స్థాయిలో కాకుండా వ్యక్తిగత స్థాయిలో సదరు సంస్థ యజమానులు చెల్లిస్తారు. దీని వల్ల ద్వంద్వ పన్నుల సమస్య ఉండదు.
రియల్ ఎస్టేట్ మొదలైన రంగాల్లో ఇన్వెస్ట్ చేసే కొత్త తరహా ఫండ్స్‌ను ఏఐఎఫ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసే రంగాలను బట్టి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. వీటికి ట్యాక్స్ పాస్ థ్రూ హోదానివ్వడంపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇన్వెస్టర్లకు ఇది గొప్ప ఊరటనిస్తుందని ఖేతాన్ అండ్ కో పార్ట్నర్ బీజల్ అజింక్య తెలిపారు.