అన్ని హైస్కూళ్లలో డిజిటల్ తరగతులు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హసన్‌పర్తి పాఠశాలలో ప్రారంభం
హసన్‌పర్తి : రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో సేవ్ చిల్ర్డన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంలను మంగళవారం ఆయన ప్రారంభించారు. సంస్థ 20 ప్రొజెక్టర్లను మండలంలోని 20 ప్రాథమిక పాఠశాలలకు బహూకరించింది. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే డిజిటల్ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచి స్తోందని చెప్పారు. ఇందుకోసం రూ. 50 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా దశల వారీగా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం టీసీఎస్, విప్రో కంపెనీల సహకారం తీసుకుంటామని వివరించారు.
ప్రభుత్వ స్కూళ్లను బతికించుకోవాలి
పభుత్వ స్కూళ్లను బతికించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని కడియం శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం చేయడంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నారని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని ఆ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్చంధ సంస్థలపై ఉందన్నారు. పాఠశాలలకు విడుదల చేస్తున్న కాంటీంజెన్సీ నిధులను రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెంచినట్లు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధి కింద విడుదలవుతున్న నిధుల్లో నుంచి రూ.కోటి ఇస్తే మరో రూ. 4 కోట్లు కలిపి మొత్తం రూ. 5 కోట్లతో పాఠశాల అభివృద్ది కోసం మంజూరు చేస్తామని చెప్పారు. హసన్‌పర్తిని ఇతర మండలాలు ఆదర్శంగా తీసుకోనేలా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని శ్రీహరి సూచించారు. మన బడి–మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ ముందుకు వెళ్తున్నారని, ఆయనకు పూర్తి సహకారం అందిస్తానన్నారు.
‘వర్ధన్నపేట’లో ప్రణాళిక...
వర్ధన్నపేట నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లు నిర్వహించడాకి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. విద్యాభివృద్ధిలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రధమ స్థానానికి తీసుకెళ్లడానికి శ్రమిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించినట్లయితే మిగతా కావాల్సిన వాటిని సమకూర్చుకుంటామని కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్‌ను డిజిటల్ నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తొలుత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీపీ కె.సుకన్య, జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్, కార్పొరేటర్లు సర్వోత్తంరెడ్డి, కల్పన, ఆర్జేడీ బాలయ్య, డీఈఓ రాజీవ్, విద్యాకమిటీల చైర్మన్లు యాదగిరి, కుమార్, మల్లేశం, ఉదయ్‌కుమార్‌రెడ్డి, రవీందర్, శివరాం, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్రవు పాల్గొన్నారు.