శై'శవ' గీతం!
జీడిమెట్ల: బతికున్నంత కాలం మనిషిని డబ్బే నడిపిస్తుంది. చనిపోయినా అది లేకుంటే మృతదేహం కూడా ‘కదలదు’. ఆ డబ్బు లేక తమ కొడుకు మృతదేహాన్ని ఖననం చేయడానికి ఓ బెంగాలీ కుటుంబం నరకయాతన అనుభవించింది. ఓ వైపు శిశువు చనిపోయిన దుఃఖం... మరోవైపు మృతదేహాన్ని ఖననం కూడా చేయలేని అయోమయ పరిస్థితి. ఇదిగో పై చిత్రంలో చనిపోయిన బిడ్డను మోసుకుంటూ వస్తున్న ఇతని పేరు విప్లవ్. పశ్చిమ బెంగాల్ నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాడు. సోమాజీగూడలో ఉంటూ సెంట్రింగ్ పని చేసుకుంటున్నాడు. ఇతని నాలుగు నెలల బాబు తకోష్ న్యూమోనియాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు.
అంత్యక్రియలు చేసే ఆర్థిక స్థోమత లేక కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో ఖననం చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కొందరు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. విప్లవ్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు బీరప్ప నగర్ శ్మశాన వాటికలో పూడ్చేందుకు తీసుకెళ్లారు. అది ఓ వర్గానికి చెందినది కావడంతో అక్కడ ఖననం చేసేందుకు వారు నిరాకరించారు. దీంతో పోలీసులు చెన్నప్ప, సుధాకర్ వారి ని భగత్‌సింగ్‌నగర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఖననం చేసేందుకు పోలీసులు రూ.1,500కు ఒప్పించారు. ఏ రోజు కూలీతో ఆ రోజు పొట్టపోసుకునే విప్లవ్ కుటుంబం ఆ మొత్తం చెల్లించి కొడుకు మృతదేహాన్ని ఖననం చేశారు.