Kidnapers Arrest
-
కిడ్నాపర్లను పట్టించిన ఏటీఎం
పెద్దపల్లి: ఖాజీపేట రైల్వే జంక్షన్లో సిగ్నల్ ఇంజినీర్లుగా పని చేస్తున్న గుండ రజని, గడ్డం ప్రవీణ్ ఇటుకబట్టీ వ్యాపారి సిద్ధయ్య కిడ్నాప్ వ్యవహారంలో సూత్రధారులుగా తేలారు. కిడ్నాప్‌కు సిగ్నల్ ఇచ్చింది ఆ ఇద్దరే ఏ1, ఏ2లుగా పేర్కొంటు పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ ఇటుకబట్టీ వ్యాపారీ నల్లూరి సిద్ధయ్యను నవంబర్ 25న కిడ్నాప్ చేసిన ముఠాలోని ఏడుగురిలో ఆరుగురిని ఆరెస్టు చేశారు. పెద్దపల్లిలోని గౌరెడ్డిపేట రోడ్డుమార్గంలో ఉంటున్న గుండ రజని, గడ్డం ప్రవీణ్ రైల్వేశాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి అప్పులపాలయ్యారు. ఈజీగా డబ్బు రాబట్టేందుకు సిద్ధయ్యను కిడ్నాప్ చేయడానికి పన్నాగం పన్నారు. రజని మేనమామ వేల్పుల తిరుపతి, సిద్ధయ్య వద్ద గుమాస్తాగా పని చేస్తుండడం, సిద్దయ్య వ్యాపార లావాదేవీల గురించి అవగాహన కలిగి ఉన్నాడు. సిద్దయ్యను కిడ్నాప్ చేస్తే పెద్దమొత్తంలో డబ్బు రాబట్టవచ్చని, రూ.కోటి వరకు గిట్టబాటవుతుందని భావించారు. ప్రవీణ్ సోదరుడైన రమేశ్ సహకారంతో కిరీటీ, మున్నా, షేక్‌భాషా, షకీల్ కలిసి గతనెల 19న కిడ్నాప్‌కోసం ప్రయత్నించగా పోలీసులను చూసి అమలు చేయలేదు. అనంతరం ఇన్నోవా, టవేరా వాహనాల్లో బయలుదేరిన ముఠాసభ్యులు రెండుగా విడిపోయి కిడ్నాప్‌కు పాల్పడ్డారు. సిద్ధయ్యను వాహనంలో ఎక్కించుకొని బెదరించి రూ.8.5 లక్షలు వసూలు చేశారు. ప్రవీణ్, రజనీ, రమేశ్ తమను సిద్దయ్య గుర్తు పడతాడని రెండోవాహనంలో ఉండి ఆపరేషన్‌ను పూర్తి చేయించారు. రూ.కోటి కోసం డిమాండ్ చేయగా తన ఇంట్లో రూ.8లక్షలు మాత్రమే ఉన్నాయని, జేబులో రూ.50 వేలు, ఏటీఎంకార్డు, బంగారు ఉంగరాన్ని అప్పగించి క్షేమంగా ఇంటికి వెళ్లాడు. అదేరాత్రి ఒంటింగట సమయంలో సమాచారం తెలసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. జాడచెప్పిన ఏటీఎం కార్డు.. ముసుగులు ధరించిన కిడ్నాపర్లు సెల్‌ఫోన్ ఉపయోగించకుండా పని పూర్తిచేసుకున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. టోల్గేట్ దాటితే వాహనాలు రికార్డు అవుతాయని, గమనించిన కిడ్నాపర్లు సిద్దయ్య వద్ద ఉన్న ఏటీఎం కార్డు మాత్రం తీసుకెళ్లారు. దీంతో సిద్ధయ్యను పోలీసులు బ్యాంకు అకౌంట్లో మరింత డబ్బు వేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. పోలీసుల సూచన మేరకు తన అకౌంట్లో సిద్దయ్య డబ్బు వేస్తుండగా నిందితులు ఏటీఎం కార్డు ద్వారా పెట్రోల్, డీజీల్‌కు స్వైప్‌ను ఉపయోగించారు. సూర్యాపేటతోపాటు హైదరాబాద్, గోవాలో ఏటీఎంను ఉపయోగించడంతో అనుమానిత ప్రాంతాల్లో అప్పటికే పోలీసులు మాటు వేశారు. డబ్బు డ్రా అవుతున్నట్లు సిద్దయ్యకు మెసేజ్ వచ్చిన వెంటనే ముఠా సభ్యులను పట్టుకున్నారు. సూర్యాపేట వద్ద రూ.40 వేలు ఈనెల 26న డ్రా చేసిన నిందితులకు తిరిగి బ్యాంకు ఖాతాలో డబ్బుతో ఎరవేసి పట్టుకున్నారు. కాగా మంగళవారం పెద్దపల్లి పట్టణ శివారులో నిందితులు వాహనాల్లో వెళ్తుండగా తనిఖీ చేసిన సమయాల్లో పట్టుబడ్డారని ప్రకటించారు. -
కిడ్నాపర్ల ముఠా అరెస్ట్
భువనగిరిఅర్బన్ : కిడ్నాపర్ల ముఠాను భువనగిరి రూరల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గురువారం భువనగిరిలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రామచంద్రారెడ్డి ముఠా వివరాలను వెల్లడించా రు. భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో నివాసం ఉంటున్న సైదాచారి ఒక రాజకీయ నాయకుడి వద్ద మేనేజర్‌గా పని చేసేవాడు. సైదాచారి గ్రామంలో ఉన్న వెంకట్‌రెడ్డి, యశోధ, మరో మహిళ అనిత వద్ద అత్యధికంగా వడ్డీ చెల్లిస్తానని రూ.70లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందులో సగభాగం రూ.35లక్షలు తీర్చాడు. మిగతా డబ్బులు సైదాచారి చెల్లించకపోవడంతో వీరు ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కొనగండ్ల సురేశ్, తాడోజు నాగరాజును ఆశ్రయించారు. సైదాచారి వద్ద డబ్బులు ఉన్నట్లుగా తెలుసుకున్న సురేశ్, నాగరాజుతోపాటు మరో ఐదుగురు వ్యక్తులను కలుపుకుని సైదాచారిని మే 10న కిడ్నాప్ చేసి తమ కారులో భువనగిరి నుంచి వలిగొండ మీదుగా తొర్రూర్ వైపుగా వెళ్లారు. రూ.50లక్షలు ఇస్తేనే నిన్ను విడిచిపెడుతామని సైదాచారిని బెదిరించి విడిచిపెట్టారు. దీంతో సైదాచారి వారిపై భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వలిగొండలో సీసీ కెమెరాల్లో కారులో వెళ్తుండగా కనిపించారు. వాటి ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈరోజు అనాజిపురం గ్రామంలో అనుమానాస్పద వాహనంలో తిరుగుతుండగా వారిని పట్టుకుని తమదైన శైలిలో విచారించగా కిడ్నాపర్లు చేసిన తప్పును ఒప్పుకున్నారు. వారి నుంచి కారు, ల్యాప్‌ట్యాప్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సురేశ్‌తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి భువనగిరి కోర్టుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ జితేందర్‌రెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ రాఘవేందర్ పాల్గొన్నారు. -
యువకుడిపై దాడి ఘటనలో నిందితుల రిమాండ్
పంజగుట్ట: ఓ దళిత యువకుడిని కొట్టి గాయపర్చిన కేసులో ఐదుగురు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బీఎస్ మక్తాకు చెందిన రవికాంత్, బీకేగూడలో నివాసం ఉండే కొత్తపల్లి రమేష్‌గౌడ్ కూతురు ప్రేమించుకుని పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఇది ఇష్టంలేని రమేష్‌గౌడ్.. రవికాంత్‌ను కిడ్నాప్ చేసి మూడురోజుల పాటు బంధించి తీవ్రంగా కొట్టడంతో అతడి రెండు కిడ్నీలు పాడై వెన్ను పూసకు తీవ్ర గాయమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమేష్‌గౌడ్ (45)తో పాటు సహకరించిన కొత్తపల్లి అర్జున్‌గౌడ్ (27), కొత్తపల్లి అరుణ్ కుమార్‌గౌడ్ (19), రోహిత్‌గౌడ్ (20), ఎస్.బి. రమేష్ (44) లను అరెస్టు చేశారు. ఇదే కేసులో రమేష్‌గౌడ్ తల్లి యాదమ్మతో పాటు మరో 9 మంది పరారీలో ఉన్నారు. మంద కృష్ణ పరామర్శ.. కాగా, బర్కత్‌పురాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవికాంత్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం పరామర్శించారు. అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువనే అహంకారంతో దాడికి పాల్పడ్డారన్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని, మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
నలుగురు కిడ్నాపర్ల అరెస్టు
రామాయంపేట, న్యూస్‌లైన్: డబ్బు కోసం సివిల్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ పట్టణం దుబ్బ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజనీర్ అల్లాడి నాగరాజును ఈ నెల 1వ తేదీన కిడ్నాప్ చేసి రూ. 15 లక్షలు తీసుకురావాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి నాగరాజు తప్పించుకుని తమకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిడ్నాపర్ల కోసం వెతికి గురువారం తెల్లవారుజామున నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిలో చేగుంట మండలం నార్సింగి గ్రామానికి చెందిన జెట్టి శ్రీనివాస్, కుక్కల రవీందర్లను నార్సింగిలో, రామాయంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన పాతూరి ఎల్లాగౌడ్, దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన కాకి స్వామిలను సిద్దిపేట బస్టాండ్‌లో పట్టుకున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులు నార్సింగి శ్రీనివాస్, కుక్కల మల్లేశంలు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రవీణ్‌బాబు, ఏస్ఐ బాలకృష్ణారెడ్డి, ఐడీ పార్టీ కానిస్టేబుల్ పెంటయ్య, రాజ్‌కుమార్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.