యువకుడిపై దాడి ఘటనలో నిందితుల రిమాండ్
పంజగుట్ట: ఓ దళిత యువకుడిని కొట్టి గాయపర్చిన కేసులో ఐదుగురు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బీఎస్ మక్తాకు చెందిన రవికాంత్, బీకేగూడలో నివాసం ఉండే కొత్తపల్లి రమేష్‌గౌడ్ కూతురు ప్రేమించుకుని పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఇది ఇష్టంలేని రమేష్‌గౌడ్.. రవికాంత్‌ను కిడ్నాప్ చేసి మూడురోజుల పాటు బంధించి తీవ్రంగా కొట్టడంతో అతడి రెండు కిడ్నీలు పాడై వెన్ను పూసకు తీవ్ర గాయమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమేష్‌గౌడ్ (45)తో పాటు సహకరించిన కొత్తపల్లి అర్జున్‌గౌడ్ (27), కొత్తపల్లి అరుణ్ కుమార్‌గౌడ్ (19), రోహిత్‌గౌడ్ (20), ఎస్.బి. రమేష్ (44) లను అరెస్టు చేశారు. ఇదే కేసులో రమేష్‌గౌడ్ తల్లి యాదమ్మతో పాటు మరో 9 మంది పరారీలో ఉన్నారు.
మంద కృష్ణ పరామర్శ..
కాగా, బర్కత్‌పురాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవికాంత్‌ను ఎమ్మార్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం పరామర్శించారు. అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువనే అహంకారంతో దాడికి పాల్పడ్డారన్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని, మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.