kidnapping and baiting
-
బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి
కుత్బుల్లాపూర్/బచ్చన్నపేట/అల్వాల్: బెదిరింపు కాల్స్ వచ్చింనందునే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి తెలిపారు. భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనను కిడ్నాప్ చేసి చంపాలని యత్నించారని, ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఆరురోజుల క్రితం అదృశ్యమైన ఆయన.. నాటకీయ పరిణామాల మధ్య పేట్‌బ షీరాబాద్ సమీపంలోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యక్షమయ్యారు. తనకు ఎదురైన సమస్యలను మేడ్చల్ డీసీపీ సందీప్ గోనె, పేట్బషీ రాబాద్ ఏసీపీ రామలింగరాజులకు వివరించారు. అనంతరం డీసీపీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే ఒత్తిడితో తనకు సాయంచేయడానికి ముందుకురాలేదని చెప్పారు. కేసు రిజిస్టర్ చేయకుండా అల్వాల్ ఎస్హెచ్ఓ గంగాధర్ సమయం వృథా చేశారని ఆరోపించారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లానని, అయినా మైనంపల్లి అనుచరులు తనను చంపాలని నార్కట్‌పల్లి వరకు వెంబడించారని, వారి కంటపడకుండా ఆటోలో తప్పించుకున్నానని చెప్పారు. ఆపై విజయవాడ వెళ్లి స్నేహితుల సహాయంతో కొద్దిరోజులు అక్కడున్నానని, ఆపై వైజాగ్ వెళ్లి తలదాచుకున్నానని వివరించారు. హైకోర్టు అడ్వొకేట్ సలహామేరకు డీసీపీ కార్యాలయానికి వచ్చానన్నారు. మైనంపల్లి హను మంతరావుతో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందన్నారు. తన భూమిని లాక్కునేందుకు మైనంపల్లి ప్రయత్నిస్తున్నారని, సదరు భూమి తనది కాదని నిరూపిస్తే ఆయనకే గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పారు. అంతా ఫేక్.. తిరుపతిరెడ్డి చెప్పిందంతా ఫేక్ అని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ‘ఎమ్మెల్యే మైనంపల్లి కాల్ చేశారు, కిడ్నాప్‌నకు యత్నించారు’ అంటూ తిరుపతిరెడ్డి చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిరెడ్డి సీడీఆర్లో ఎటువంటి కాల్స్ లేవని గుర్తించారు. ల్యాండ్ కేసులో తిరుపతిరెడ్డిపైనే ఓ మహిళ ఫిర్యాదు చేసిందని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అయితే... కిడ్నాప్ పేరుతో స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించిన తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు, మద్దతుదారులపై కేసుల నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అల్వాల్ సీఐ ఉపేందర్ వెల్లడించారు. -
డ్రైవర్‌ను బండరాయితో మోది..
♦ఇన్నోవా కారును అపహరించుకుపోయిన ♦గుర్తుతెలియని దుండగుడు ♦ పరిస్థితి విషమం..హైదరాబాద్‌కు తరలింపు ♦ సూర్యాపేటలో ఘటన సూర్యాపేట క్రైం గుర్తుతెలియని దుండగుడు ఇన్నోవా కారు డ్రైవర్‌ను బండరాయితో మోది వాహనాన్ని అపహరించుకుపోయాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో గల అడ్డాపై తనకు చెందిన ఇన్నోవా వాహనాన్ని హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ ఆరీఫుద్దీన్ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిలిపి ఉన్నాడు. అంతలోపే ఓ గుర్తుతెలియని వ్యక్తి కారు వద్దకు వచ్చాడు. కారు వద్ద ఉన్న అతడిని రాజమండ్రికి వెళ్లాలి.. కిరాయికి వస్తారా అని అడిగాడు. వెంటనే వస్తా సార్ అని తెలపడంతో.. కిరాయి మాట్లాడుకొని.. గుర్తుతెలియని వ్యక్తిని కారులో ఎక్కించుకొని ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అయితే.. డ్రైవర్‌కు సదరు వ్యక్తి మార్గమధ్యలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల జమ్మిగడ్డలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై రెండు గంటల పాటు వేచి ఉండాలని తెలిపాడు. దానికి డ్రైవర్ సరే అని చెప్పాడు. సరిగ్గా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్దకు గురువారం తెల్లవారుజామున 12:40 నిమిషాలకు చేరుకున్నారు. కారు డ్రైవర్‌కు సదరు వ్యక్తికి సంబంధించిన ఇరువురు స్నేహితులు రాజమండ్రికి తీసుకెళ్లాల్సి ఉందనడంతో అక్కడే వేచి చూస్తున్నారు. అయితే కారు డ్రైవర్‌కు నిద్ర వస్తుండడంతో కారును పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై నిలిపి నిద్రలోకి జారుకున్నాడు. డ్రైవర్ పరిస్థితి విషమం.. డ్రైవర్ ఆరిపుద్దీన్ తల, ముఖంపై బండరాయితో గుర్తుతెలియని వ్యక్తి బలంగా మోదడంతో.. తీవ్ర రక్తస్రావమై కన్ను పగిలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియాస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గుంటూరుకు తరలివెళ్లిన పోలీసులు కారును ఎత్తికెళ్లిన దుండగుడి కోసం సూర్యాపేట పోలీసులు గుంటూరుకు వెళ్లారు. కారు గూంటూరు జిల్లాలోని చీరాలలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. మూడు గంటల ప్రాంతంలో.. కారు డ్రైవర్ కిరాయికి కారు తీసుకొచ్చిన సదరు వ్యక్తికి సంబంధించిన వ్యక్తుల కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ఏమైందో ఏమో.. కానీ కారు డ్రైవర్ నిద్రలోంచి తేరుకునే లోపే తీవ్ర రక్తస్రావంలో మునిగిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తి కారు డ్రైవర్‌పై బండరాయితో తల, ముఖంపై బలంగా మోదాడు. దీంతో డ్రైవర్ తల పగిలిపోవడంతో పాటు ఎడమ కన్ను బయటపడింది. డ్రైవర్‌ను జుట్టుపట్టుకొని రహదారిపైకి తీసుకొచ్చి.. డివైడర్కేసి బాదాడు. అంతేకాకుండా కారులోకి ఎక్కించుకొని ఘటనస్థలానికి కొంచెం దూరంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. కానీ డ్రైవర్ కారులోకి ఎక్కకుండా పరిగెత్తుతూ సూర్యాపేట పట్టణంలోకి ప్రవేశించాడు. డ్రైవర్ పట్టణంలోకి ప్రవేశించడమే ఆలస్యం.. గుర్తుతెలియని వ్యక్తి ఇన్నోవా కారును తీసుకొని విజయవాడ వైపునకు వెళ్లాడు. అయితే డ్రైవర్ సెల్‌ఫోన్ కారులోనే ఉండిపోయింది. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను.. సమీపంలోని టింబర్ డిపో యజమాని గమనించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు క్రాంతి, డానేల్ కుమార్‌లు ఉన్నారు.