కుత్బుల్లాపూర్/బచ్చన్నపేట/అల్వాల్: బెదిరింపు కాల్స్ వచ్చింనందునే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి తెలిపారు. భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనను కిడ్నాప్ చేసి చంపాలని యత్నించారని, ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఆరురోజుల క్రితం అదృశ్యమైన ఆయన.. నాటకీయ పరిణామాల మధ్య పేట్‌బ షీరాబాద్ సమీపంలోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యక్షమయ్యారు.
తనకు ఎదురైన సమస్యలను మేడ్చల్ డీసీపీ సందీప్ గోనె, పేట్‌బషీ రాబాద్ ఏసీపీ రామలింగరాజులకు వివరించారు. అనంతరం డీసీపీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే ఒత్తిడితో తనకు సాయంచేయడానికి ముందుకురాలేదని చెప్పారు. కేసు రిజిస్టర్ చేయకుండా అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ గంగాధర్ సమయం వృథా చేశారని ఆరోపించారు.
అందుకే అజ్ఞాతంలోకి వెళ్లానని, అయినా మైనంపల్లి అనుచరులు తనను చంపాలని నార్కట్‌పల్లి వరకు వెంబడించారని, వారి కంటపడకుండా ఆటోలో తప్పించుకున్నానని చెప్పారు. ఆపై విజయవాడ వెళ్లి స్నేహితుల సహాయంతో కొద్దిరోజులు అక్కడున్నానని, ఆపై వైజాగ్ వెళ్లి తలదాచుకున్నానని వివరించారు.
హైకోర్టు అడ్వొకేట్ సలహామేరకు డీసీపీ కార్యాలయానికి వచ్చానన్నారు. మైనంపల్లి హను మంతరావుతో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందన్నారు. తన భూమిని లాక్కునేందుకు మైనంపల్లి ప్రయత్నిస్తున్నారని, సదరు భూమి తనది కాదని నిరూపిస్తే ఆయనకే గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పారు.
అంతా ఫేక్..
తిరుపతిరెడ్డి చెప్పిందంతా ఫేక్ అని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ‘ఎమ్మెల్యే మైనంపల్లి కాల్ చేశారు, కిడ్నాప్‌నకు యత్నించారు’ అంటూ తిరుపతిరెడ్డి చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిరెడ్డి సీడీఆర్‌లో ఎటువంటి కాల్స్ లేవని గుర్తించారు.
ల్యాండ్ కేసులో తిరుపతిరెడ్డిపైనే ఓ మహిళ ఫిర్యాదు చేసిందని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అయితే... కిడ్నాప్ పేరుతో స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించిన తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు, మద్దతుదారులపై కేసుల నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అల్వాల్ సీఐ ఉపేందర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment