Kilari Manohar
-
బ్రహ్మోత్సవాలకు నగరం నుంచి పూలరథం
త్వరలో జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు వెంగళరావునగర్ డివిజన్ నుంచి పూలరథాన్ని తీసుకెళ్ళనున్నట్టు స్థానిక కార్పొరేటర్ కిలారి మనోహర్ చెప్పారు. స్థానిక వెస్ట్ శ్రీనివాస్‌నగర్‌కాలనీ కమ్యూనిటీహాల్లో శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ కిలారి మాట్లాడుతూ ప్రముఖ వాగ్గేయకారిణి కొండవీటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఈ పూలరథాన్ని తిరుమలకు తీసుకెళ్ళనున్నామని అన్నారు. రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయడానికి మోతీనగర్, కళ్యాణ్‌నగర్ వెంచర్-1, వెంచర్-3, సిద్ధార్థనగర్కాలనీ, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మహిళలు పూలను తీసుకురానున్నారని తెలిపారు. అక్టోబరు 2వ తేదీన మధురానగర్‌కాలనీలోని శ్రీఅభయాంజనేయస్వామి దేవస్థానం నుంచి రథాన్ని తరలించనున్నట్టు చెప్పారు. భజనలు, కోలాటాలు, మేళతాళాలతో అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ రథం బయలు దేరుతుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
టీడీపీకి నగర అధికార ప్రతినిధి గుడ్‌బై
శ్రీనగర్‌కాలనీ: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు రోజుల వ్యవధిలోనే నగరస్థాయిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇరువురు నాయకులు ఆ పార్టీని వీడారు. తాజాగా టీడీపీ నగర అధికార ప్రతినిధి కిలారి మనోహర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం ఆయన తన అనుచరగణంతో టీఆర్ఎస్ భవనానికి తరలివెళ్లి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ ఆయనకు తమ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా టీడీపీని నమ్ముకుని పార్టీకోసం ఎంతో శ్రమించామని చెప్పారు. అన్ని రకాలుగా తమ సేవలన్నీ పార్టీకి ధారపోసినట్టు తెలియజేశారు. అయితే ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాధ్ కొందరిని మాత్రమే దగ్గరకు తీస్తూ పార్టీని నమ్ముకున్న సీనియర్లను అవహేళన చేస్తున్నారని అన్నారు. ఆయన ప్రవర్తనకు విసుగుచెంది ఇప్పటికే అనేకమంది సీనియర్లు పార్టీని విడనాడారని, కొంతమంది ఆత్మహత్యకు సైతం ప్రయత్నించారని పేర్కొన్నారు. మహిళలు అని కూడా చూడకుండా కించపరచడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. దీంతో ఇక పార్టీలో ఉండలేక, మరోవైపు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షించి తాను టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేతలు గంపా గోవర్థన్, నియోజకవర్గ ఇన్చార్జి జి.మురళీగౌడ్, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.