థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం ఇది : సంతోష్ కల్వచెర్ల
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్ ఆర్టిస్ట్’. రతన్ రిషి దర్శకత్వంలో ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ– ‘‘కిల్లర్ ఆర్టిస్ట్’ థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా... ఓటీటీలో చూడాల్సినది కాదు. సురేష్ బొబ్బిలి అన్న తన మ్యూజిక్‌తో ఈ సినిమాకు ప్రాణం పోశాడు. ఈ సినిమా సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథ ఇది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలై, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకుంటుంది. మన సమాజంలో జరుగుతున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాం. ఈ మర్డర్స్ చేస్తున్నది ఒకరా? లేక ఇద్దరా? అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. సెన్సార్ వారి సూచన మేరకు ‘ఆర్టిస్ట్’ టైటిల్‌ని ‘కిల్లర్ ఆర్టిస్ట్’గా మార్చాం’’ అని చెప్పారు రతన్ రిషి. ‘‘ఆడియన్స్ సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా చూస్తారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమానూ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు జేమ్స్ వాట్.