భారత్కు కిల్లర్ డ్రోన్లు
వాషింగ్టన్: భారత్ సహా మిత్ర దేశాలకు ఆయుధాలు అమ్మడానికి ఉన్న అడ్డంకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలగించారు. అధునాతన డ్రోన్లు సహా ఇతర సంప్రదాయ ఆయుధ సంపత్తి ఎగుమతులను వేగవంతం చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అమెరికా నుంచి అధిక సంఖ్యలో నిఘా డ్రోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్న భారత్కు ఈ నిర్ణయం మేలుచేయనుంది. అమెరికా కిల్లర్ డ్రోన్లు సమకూర్చుకోవడం సులభం కానుంది.
ఈ మేరకు అణుయేతర ఆయుధాల బదిలీ(సీఏటీ) నూతన విధానంపై ట్రంప్ సంతకం చేశారు. అధ్యక్షుడి జాతీయ భద్రతా విధాన ప్రాధమ్యాలకు అనుగుణంగా సీఏటీని రూపొందించినట్లు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ శాండర్స్ చెప్పారు. తాజా నిర్ణయం అమెరికా మిత్ర దేశాల సైన్యాలను బలోపేతం చేస్తుందన్నారు. మిత్ర దేశాలకు అధునాతన ఆయుధాలను సమకూర్చడం ద్వారా అవి ఇకపై చైనా, రష్యాలపై ఆధారపడవని ట్రంప్ అసిస్టెంట్ పీటర్ చెప్పారు.