డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్‌కు యత్నం
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కిన డిగ్రీ విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు డ్రైవర్ యత్నించిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం కలకలం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం గ్రామానికి చెందిన విద్యార్థిని పట్టణంలోని ఏఎంజీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం కళాశాలకు చేరుకోవటానికి గణపవరం సెంటర్లో ఆటో ఎక్కింది. ఆటోలో ఆమె ఒంటరిగా ఉండటంతో డ్రైవర్ కళాశాల వద్ద ఆపకుండా వేగంగా పోనిచ్చాడు.
ఆమె రక్షించండి అంటూ కేకలు వేస్తూ, బస్టాండ్ సమీపంలో కిందకు దూకేసింది. గాయాలైన ఆమెను స్థానికులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. నిందితుడు ప్రకాశం జిల్లా బయట మంజులూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రత్నాకర్పార్ధసారధిరాజు అని అర్బన్ సీఐ గొట్టిపాటి చెంచుబాబు సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ఉన్న అతన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారావు, ఏఎస్సై వెంకటేశ్వరరావులను అభినందించారు.