‘చైనీస్’ బస్సులకు ఇక వీడ్కోలు!
సాక్షి, ముంబై: బెస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే కింగ్ లాంగ్ బస్సుల నిర్వహణ ఖర్చు అధికంగా ఉండడంతో వీటిని త్వరలోనే తొలగించనున్నారు. అయితే వీటిని విడతల వారీగా తొలగించాలని అధికారులు యోచిస్తున్నప్పటికీ ఒక్క ప్రైవేట్ సంస్థ కూడా వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బస్సులు చైనీస్ బస్సులుగా నగరంలో పేరొందాయి. ఇదిలా ఉండగా, మొదటి విడతగా 20 బస్సులను తొలగించేందుకు నిర్ణయించామని అధికారి ఒకరు తెలిపారు. ఈ బస్సులు తరచూ బ్రేక్‌డౌన్ అవుతూ ఉంటున్నాయన్నారు. కాగా, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నుంచి సేకరించిన వివరాల మేరకు.. 2010 జనవరి నుంచి 2012 జూన్ వరకు దాదాపు 4,037 బస్సులు బ్రేక్ డౌన్ అయ్యాయి. మరో పక్క ఆర్డినరీ బస్సులు బ్రేక్ డౌన్ల సంఖ్య తగ్గింది.
జనవరి 2010లో 258 చైనీస్ బస్సులకు గాను 30 బస్సులు పూర్తిస్థాయి మరమ్మతులకు గురై డిపోలోనే పడి ఉన్నాయి. ఈ బస్సుల్లో అప్పుడప్పుడు మంటలు చెలరేగుతున్నాయని ఎమ్మెస్సార్టీసీ 2010 మే లో వీటిని తొలగించింది. కాగా 11 బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతున్నారు. ముంబై-పుణే మార్గాల మధ్య మూడు బస్సులు తమ సేవలను అందజేస్తున్నాయి. మిగతా వాటిలో చాలావరకు మరమ్మతుల కోసం గ్యారేజీలోనే ఉంటున్నాయని ఎమ్మెస్సార్టీసీ అధికారి పేర్కొన్నారు. ఎమ్మెస్పార్టీసీకే కాకుండా బెస్ట్‌కు కూడా ఈ బస్సులు గుదిబండగా మారిపోయాయి. ఈ బస్సుల విడిభాగాల ఉత్పత్తి దారులు అందుబాటులో లేకపోవడం మరింత కష్టతరంగా మారిందని అధికారి పేర్కొన్నారు.