breaking news
kiosk
-
ప్రతీ రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) సాంకేతికతను మరింత బలోపేతం చేయనుంది. గృహ కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు పారదర్శక, వేగవంతమైన సేవలను అందించేందుకు సాంకేతికతను వినియోగించనుంది. ఇందులో భాగంగా టీజీ రెరా కార్యాలయంలో కియోస్క్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎలాగైతే బ్యాంకింగ్ రంగంలో కియోస్క్‌లు చిన్నపాటి బ్యాంక్ అవుట్లెట్ లాగా పనిచేస్తాయో.. అదే తరహాలో కస్టమర్లు టీజీ రెరా సేవలన్నీ ఈ కియోస్క్ ద్వారా పొందే వీలుంటుంది. గృహ కొనుగోలుదారులు టీజీ రెరా కార్యాలయాన్ని నేరుగా సందర్శించే అవసరం లేకుండా టీజీ రెరా (TG RERA) ప్రాథమిక సేవలన్నీ ఈ కియోస్క్ ద్వారా అందుకోవచ్చని ఓ టీజీ రెరా అధికారి తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో రెరా కియోస్క్ ఏర్పాటు చేసిన తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.టీజీ రెరా యాప్ కూడా.. టీజీ రెరా మొబైల్ అప్లికేషన్ (యాప్)ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని, ఏప్రిల్‌లో యాప్ అందుబాటులోకి వస్తుందని ఓ అధికారి తెలిపారు. దీంతో పాటు క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీజీ రెరా అధికారులు నిర్ణయించారు. నిర్దిష్ట ప్రాజెక్ట్ సమాచారమంతా ఈ క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉంటుంది.ప్రాజెక్ట్‌కు బయట వీక్షకులకు కనిపించేలా క్యూఆర్ కోడ్‌ను (QR Code) డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ప్రాజెక్ట్ డెవలపర్, ప్రమోటర్, అపార్ట్మెంట్ల సంఖ్య, అనుమతులు.. ఇలా ప్రాజెక్ట్ గురించి సమస్త సమాచారం ఇట్టే తెలిసిపోతుంది. డెవలపర్లు ప్రాజెక్ట్ ప్రమోషన్, అడ్వర్టయిజింగ్ సందర్భాలలో క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మహారాష్ట్రలో 2023 ఆగస్టులో మహా రెరా ఈ క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టింది.చదవండి: మా నాన్న మందుకొట్టి స్థలం అమ్మేశాడు.. న్యాయం చేయండి10,043 ప్రాజెక్ట్‌ల నమోదు.. 2017 జులైలో మొదలైన టీజీ రెరాలో ఇప్పటివరకు 10,043 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. 4463 మంది స్థిరాస్తి మధ్యవర్తులు, ఏజెంట్లు రిజిస్టరయ్యారు. అలాగే ఇప్పటివరకు టీజీ రెరాకు 2,340 ఫిర్యాదులు అందగా.. ఇందులో 1,566 ఫిర్యాదులను పరిష్కృతమయ్యాయి. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైవీఆర్ కన్స్ట్రక్షన్స్, సత్యనారాయణ మూల, శ్రీఅమేయా కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస్ కాకర్ల ఏడుగురు ప్రమోటర్లు/ ఏజెంట్లను డిఫాల్టర్లుగా గుర్తించారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిరి్మంచే నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లతో పాటు 8, అంతకంటే ఎక్కువ అపార్ట్మెంట్లు, నిర్మాణాలను టీజీ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. -
రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!
భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే, ఇప్పుడు మరిన్ని సేవలను అందించేందుకు సిద్దం అయ్యింది. రైల్వే ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పాన్, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక కొత్త సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రైల్ వైర్ సాథి కియోస్క్ పేరుతో ఈ కొత్త సేవలను అందించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వేశాఖ ప్రారంభించింది. ఇప్పుడు దేశం మెుత్తం ఈ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రైల్ వైర్ సాథి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్, ఓటరు కార్డు, మొబైల్ రీచార్జ్, రైలు, విమాన, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాలలో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ సదుపాయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇంటర్నెట్ సదుపాయ లేని మారుమూల ప్రాంత ప్రజలు ఆధార్, పాన్ కార్డు సేవలను పొందడం మరింత సులభం కానుంది. దేశవ్యాప్తంగా 200 స్టేషన్లలో ఈ ప్రత్యేక సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. (చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!) -
శాంపిల్స్ సేకరణకు మొబైల్ కియోస్క్‌లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కరోనా వైరస్ నిర్ధారణకు శాంపిల్స్ సేకరణ పెంచి మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకాకుళం జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంతవరకు జిల్లాలో పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ.. మున్ముందు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అనుమానితుల నుంచి శాంపిల్స్ తీసుకునేందుకు మొబైల్ కోవిడ్ విస్క్ (వాక్ ఇన్ శాంపిల్ కియోస్క్)లను వినియోగించనున్నారు. తొలి విడతగా తయారు చేసిన మొబైల్ కరోనా పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం పరిశీలించారు. జిల్లాలో మొదటగా రెండు మొబైల్ కరోనా పరీక్ష కేంద్రాలను బుధవారం నుంచి అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు. షెడ్యూల్ ప్రకారం జిల్లా అంతా ఈ మొబైల్ కోవిడ్ విస్క్‌లు తిరుగుతాయి. పరీక్షలు నిర్వహించే వారికి వైరస్ సోకకుండా ఇవి సురక్షితంగా ఉంటాయి. ఇదిలా ఉండగా జిల్లా సర్వజన ఆసుపత్రి, మరో ఆరు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వాక్ ఇన్ శాంపిల్ కియోస్క్ (విస్క్)లను ఏర్పాటు చేస్తున్నారు. వాటితో పాటు పాలకొండ, పాతపట్నం, సీతంపేట, కొత్తూరు, బారువ, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, హరిపురం, కోటబొమ్మాళి, నరసన్నపేట, పలాస, టెక్కలి, బుడితి, ఆమదాలవలస, రాజాం, పొందూరు, రణస్థలంలో కోవిడ్ విస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని 20 ఆసుపత్రుల్లో టీబీ పరీక్షల నిర్వహణ కేంద్రాలను కరోనా పరీక్ష కేంద్రాలుగా వినియోగించనున్నారు. ప్రతి రోజూ 200 నమూనాల సేకరణ, పరీక్షలు చేసే లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
మోతాదుకు మించి తాగినా...ఇంటికి క్షేమంగా..
డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించి, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండగా... తాజాగా ముంబై పోలీసుల భాగస్వామ్యంతో యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ ఉబర్... మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తో ప్రయాణీకులకే కాక పాదచారులకు సైతం కలుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని... 'ఉబర్ బ్రెత్టైజర్' సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉబర్ బ్రెత్లైజర్స్ ఒకరకంగా వాహనదారులకే కాక, ముంబై ట్రాఫిక్ పోలీసులకు సహకరించే అవకాశం ఉండటంతో తన సేవను ట్రాఫిక్ పోలీసుల భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 'ఉబర్ బ్రెత్లైజర్' ను స్థాపిస్తోంది. వ్యక్తి రక్తంలోని ఆల్కహాల్ శాతాన్ని బ్రెత్లైజర్ తో గుర్తించే అవకాశం ఉండటంతో ఉబర్ బ్రెత్లైజర్ ను ముంబైలోని ప్రతి పబ్, బార్లలో ప్రవేశ పెడుతోంది. దీంతో బారుకు వచ్చినవారు చట్టప్రకారం మోతాదుకు మించి మద్యం సేవిస్తే బ్రెత్లైజర్ రెడ్ లైట్ ను సూచిస్తుంది. గ్రీన్ లైట్ వెలిగిందంటే వారు వాహనం నడపడం వల్ల ప్రమాదం లేదని అర్థం. ఒకవేళ మద్యం సేవించిన వ్యక్తి మోతాదును మించి తాగినట్లుగా సూచించినపుడు...ఆ వ్యక్తి చట్టప్రకారం కారు లేదా ఇతర వాహనాలు నడపకూడదు. రెడ్ లైట్ వెలిగిన సందర్భంలో ఉబర్ బ్రెత్లైజర్ ద్వారా ఓ సందేశం ఉబర్ సంస్థకు అందుతుంది. మెసేజ్ సహాయంతో ఉబర్ డ్రైవర్ సదరు వ్యక్తిని సురక్షితంగా ఇంటికి చేర్చవచ్చు. ఇటువంటి సేవ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంపై జనంలో అవగాహన కలగడంతోపాటు... మోతాదుకు మించి తాగిన వ్యక్తులు ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళేందుకు సహకరిస్తుందని అంటున్నారు ఉబర్ ముంబై కార్యాలయ జనరల్ మేనేజర్ సైలేష్ సావ్లాని. ఉబర్ ముందుగా ఈ సౌకర్యాన్ని కొద్దిరోజుల ముందు ముంబై కుర్లా ఫోనెక్స్ మార్కెట్ సిటిలోని ఓ నైట్ క్లబ్ (నూక్) లో ప్రారంభించింది. ఈ ప్రత్యేక సేవను వాహనదారుల భద్రత కోసం ఏర్పాటు చేశామని సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. మొదటిసారి 2009 లో తన సేవలు ప్రారంభించిన ఉబర్ ప్రయాణీకులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ.. సుమారు ప్రపంచంలోని 68 దేశాల్లోని 400 నగరాల్లో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకూ ఇండియాలోని 26 నగరాల్లో ఉబర్ తన క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.