మోతాదుకు మించి తాగినా...ఇంటికి క్షేమంగా..
డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించి, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండగా... తాజాగా ముంబై పోలీసుల భాగస్వామ్యంతో యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ ఉబర్... మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తో ప్రయాణీకులకే కాక పాదచారులకు సైతం కలుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని... 'ఉబర్ బ్రెత్టైజర్' సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఉబర్ బ్రెత్లైజర్స్ ఒకరకంగా వాహనదారులకే కాక, ముంబై ట్రాఫిక్ పోలీసులకు సహకరించే అవకాశం ఉండటంతో తన సేవను ట్రాఫిక్ పోలీసుల భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 'ఉబర్ బ్రెత్లైజర్' ను స్థాపిస్తోంది. వ్యక్తి రక్తంలోని ఆల్కహాల్ శాతాన్ని బ్రెత్లైజర్ తో గుర్తించే అవకాశం ఉండటంతో ఉబర్ బ్రెత్లైజర్ ను ముంబైలోని ప్రతి పబ్, బార్లలో ప్రవేశ పెడుతోంది. దీంతో బారుకు వచ్చినవారు చట్టప్రకారం మోతాదుకు మించి మద్యం సేవిస్తే బ్రెత్లైజర్ రెడ్ లైట్ ను సూచిస్తుంది.
గ్రీన్ లైట్ వెలిగిందంటే వారు వాహనం నడపడం వల్ల ప్రమాదం లేదని అర్థం. ఒకవేళ మద్యం సేవించిన వ్యక్తి మోతాదును మించి తాగినట్లుగా సూచించినపుడు...ఆ వ్యక్తి చట్టప్రకారం కారు లేదా ఇతర వాహనాలు నడపకూడదు. రెడ్ లైట్ వెలిగిన సందర్భంలో ఉబర్ బ్రెత్లైజర్ ద్వారా ఓ సందేశం ఉబర్ సంస్థకు అందుతుంది. మెసేజ్ సహాయంతో ఉబర్ డ్రైవర్ సదరు వ్యక్తిని సురక్షితంగా ఇంటికి చేర్చవచ్చు. ఇటువంటి సేవ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంపై జనంలో అవగాహన కలగడంతోపాటు... మోతాదుకు మించి తాగిన వ్యక్తులు ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళేందుకు సహకరిస్తుందని అంటున్నారు ఉబర్ ముంబై కార్యాలయ జనరల్ మేనేజర్ సైలేష్ సావ్లాని.
ఉబర్ ముందుగా ఈ సౌకర్యాన్ని కొద్దిరోజుల ముందు ముంబై కుర్లా ఫోనెక్స్ మార్కెట్ సిటిలోని ఓ నైట్ క్లబ్ (నూక్) లో ప్రారంభించింది. ఈ ప్రత్యేక సేవను వాహనదారుల భద్రత కోసం ఏర్పాటు చేశామని సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. మొదటిసారి 2009 లో తన సేవలు ప్రారంభించిన ఉబర్ ప్రయాణీకులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ.. సుమారు ప్రపంచంలోని 68 దేశాల్లోని 400 నగరాల్లో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకూ ఇండియాలోని 26 నగరాల్లో ఉబర్ తన క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.