జర్నలిజంలోకి వస్తా: సీఎం కిరణ్
హైదరాబాద్: సీఎం సీటు ఖాళీ చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిజంలోకి రానున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే పెన్ను పట్టుకుని పాత్రికేయుడి అవతారం ఎత్తుతానంటున్నారు నల్లారివారు. ఆయనే స్వయంగా ఈ మాట సెలవిచ్చారు.
రాష్ట్రం విడిపోతే మీ రాజకీయ భవిష్యత్ ఏంటని విలేకరులు ప్రశ్నించగా.. 'రాజకీయాల్లో ఉండాలని ఏముంది. మీ వృత్తి(జర్నలిజం)లోకి కూడా ప్రవేశించొచ్చు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
అలాంటి పరిస్థితి పగవాడికి కూడా వద్దు
సమైక్యాంధ్ర లేదా కాంగ్రెస్ పార్టీ ఏదోటి తేల్చువాలనే పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేకపోతున్నానని కిరణ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగానే కొనసాగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు తాను 16వ సీఎం అని... 17, 18 ముఖ్యమంత్రులు వస్తారంటూ వందో సీఎం కూడా ఎందుకు రాకుడదంటూ ప్రశ్నించారు.