పెద్ద తలకాయలే లక్ష్యం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు పార్టీ పెద్ద నేతలు లక్ష్యంగానే వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలోని ఉత్తర తెలంగాణలో అడపాదడపా మావోయిస్టుల కార్యకలాపాలు జరుగుతున్నాయి. మావోయిస్టు పార్టీ ఖమ్మం-కరీంనగర్-వరంగల్(కేకేడబ్ల్యూ) జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో అప్పుడప్పుడు వాల్‌పోస్టర్లు, బ్యానర్లు వెలుస్తున్నాయి. కేకేడబ్ల్యూ కమిటీ పరిధిలోనే మావోయిస్టుల ఉనికి ఉన్నట్లుగా కనిపిస్తోంది.
కేకేడబ్ల్యూ కమిటీ కార్యదర్శిగా బడె చొక్కారావు అలియాస్ దామోదర్ వ్యవహరిస్తున్నారు. సీనియర్ సభ్యులుగా కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, భద్రులు ఉన్నారు. గోదావరి తీరంలోని 3 జిల్లాల ప్రాంతంలో కార్యక్రమాలను పెంచాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 21న తాడ్వాయి అడవుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని కేకేడబ్ల్యూ కమిటీ భావించినట్లు తెలిసింది. ఈ సమావేశం సన్నాహాల కోసం 5 మంది సభ్యులు ఉన్న మావోయిస్టుల బృందం 5 రోజుల క్రితం తాడ్వాయి అడవులకు వచ్చిందని పోలీసుల వర్గాలు చెబుతున్నాయి.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) దళాలు చేపట్టిన కూంబింగ్‌లో శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డి చిక్కారని, ముగ్గురు తప్పించుకున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తప్పించుకున్న వారిలో దామోదర్, రాజిరెడ్డి, భద్రు ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ ముగ్గురు తప్పించుకున్నారా లేక పోలీసు అదుపులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరీ దామోదర్?: బడే చొక్కొరావు అలియాస్ దామోదర్ 1997లో పీపుల్స్‌వార్‌లో చేరారు. తాడ్వాయి మండలం కాల్వపల్లి దామోదర్ సొంతూరు.
మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్, బడే అశోక్‌లు వరుసకు దామోదర్‌కు చిన్నాన్నలు. గ్రౌహౌండ్స్ కూంబింగ్ సమాచారంతో.. దామోదర్ బృందం రెండు గ్రూపులుగా విడిపోయిందని తెలుస్తోంది. ముగ్గురు సీనియర్ నాయకులకు దూరంగా కాపలా విధులు నిర్వహిస్తున్న శృతి, విద్యాసాగర్‌లు కూంబింగ్‌లో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.