రైల్వే బుకింగ్ కౌంటర్లోనే నోట్లు మార్చాడు!
ముంబై: నోట్ల రద్దు నేపధ్యంలో అవకాశం ఉన్న ప్రతిచోటా అక్రమాలు జరిగిన ఘటనలు ప్రజలను విస్మయపరుస్తున్నాయి. కొంత మంది బ్యాంకు అధికారులే స్వయంగా బడాబాబులు డబ్బు మార్చుకోవడానికి మధ్యవర్తులుగా వ్యవహరించిన తీరును గమనిస్తూనే ఉన్నాం. తాజాగా ఓ రైల్వే అధికారి టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్దే నోట్ల మార్పిడి చేసి బుక్ అయ్యాడు.
ముంబైలోని సీఎస్టీ రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎల్కే బోయర్‌పై సీబీఐ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. రైల్వే బుకింగ్ కౌంటర్ వద్దే ఈయన పాత నోట్ల మార్పిడి కార్యక్రమం చేపట్టాడు. సుమారు 8.22 లక్షల విలువగల 1000, 500 రూపాయల పాత నోట్లను.. 100, 2000 రూపాయల నోట్లతో బోయర్ మార్చినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోంది.