దొంగతనాలు చేయించే జబ్బు...
మెడి క్షనరీ
ఇదో విచిత్రమైన జబ్బు. ఈ మానసిక రుగ్మత ఉన్నవారికి ఒక వింతైన కోరిక పుడుతుంది. అదే దొంగతనం చేయడం. దీన్ని వైద్యపరిభాషలో క్లెప్టోమానియా అంటారు. ఆధునిక వైద్యశాస్త్ర నిపుణులు1816లో ఈ జబ్బును మొదటిసారి నమోదు చేశారు. ఈ జబ్బు ఉన్నవాళ్లు ఎంత అణచుకుందామనుకున్నా తమ నియంత్రణలో లేకుండా చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటారు. తాము కొనగలిగే వస్తువులను సైతం ఇలా తస్కరిస్తుంటారు.
అందునా చిత్రవిచిత్రమైన కారణాలతో ఆ పనికి పాల్పడుతుంటారు. కొందరు ఆనందం కోసం, మరికొందరు సరదాకోసం, ఇంకొందరు తమ యాంగ్జైటీ, భయం, ఆందోళన వంటి ఫీలింగ్స్ ఆపుకోలేక ఈ దొంగతనాలకు ఒడిగడుతుంటారు. ఇలాంటి చర్యలు ఒక్కోసారి మనకు ప్రియమైన వారితో పాటు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మన సన్నిహితుల్లో ఎవరికైనా ఇలాంటి రుగ్మత ఉందని తెలిస్తే ఆలస్యం చేయకుండా వారిని ఒకసారి మానసిక నిపుణులకు చూపించడం మేలు.