అన్నకు ముప్పని.. వదినెను అంతం చేశా..
రొద్దం : వదిన ప్రవర్తన కారణంగా తన అన్న ప్రాణాలకు ముప్పు పొంచి ఉండడంతో, ఆమెను హత్య చేసినట్లు మృతురాలి మరిది అంగీకరించాడని సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఎస్ఐ హారూన్ బాషా, ఏఎస్సై నరసింహులుతో కలసి గురువారం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈ నెల 20న కె.మరువపల్లికి చెందిన కురుబ గంగమ్మ (31) అనే వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. వివాహేతర సంబంధాలకు అలవాటుపడిన గంగమ్మ కుటుంబ పరువును మంటగలపడంతోపాటు, ఎప్పటికైనా తన అన్న ప్రాణాలను తీయిస్తుందన్న ఉద్దేశంతో మరిది రవి ఆమెను అంతమొందించేందుకు నిర్ణయించుకుని, కొంతకాలంగా అదను కోసం ఎదురుచూశాడు.
ఈ నెల 20న రాత్రి ఏడు గంటల సమయంలో అన్న కర్రెన్నతో కలసి పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో అన్న గాఢ నిద్రలో ఉండగా, ఇంటి వద్దకు వచ్చిన రవి ఆవు తప్పిపోయిందని, దానిని వెతికేందుకు రావాలని వదినెను పిలిచాడు. అది నిజమేనని నమ్మిన ఆమె సెల్ఫోన్ టార్చ్ సాయంతో వెతుకుతూ ఇంటికి సమీపంలోని చెరువు కాలువ వద్దకు వెళ్లింది. ఎక్కడా ఆవు తప్పించుకున్న జాడ కనిపించకపోవడంతో అనుమానంతో వెనుతిరిగి చూడబోయేంతలో మరిది ఆమె మెడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో స్పృహ కోల్పోయిన ఆమెను కాలువ నీటిలో పడేసి ఊపిరాడకుండా నొక్కిపట్టి, కాళ్లతో బురదలోకి తొక్కి హత్య చేశాడు.
అనంతరం ఏమీ తెలియనట్లు పొలానికి వెళ్లి నిద్రించాడు. రాత్రి రెండు గంటల సమయంలో నిద్ర లేచిన కర్రెప్ప ఇంటికి వెళ్లి చూడగా భార్య కనిపించలేదు. దీంతో ఆమె జాడ కోసం వెతుకుతుండగా ఉదయం 6 గంటల సమయంలో మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పారిపోయే ప్రయత్నంలో ఉన్న రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, వివరాలు వెల్లడించాడు. అతని నుంచి కొంత నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్య జరిగిన రెండు రోజులకే కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు చంద్ర, ప్రతాప్, మారుతి, రవిలను సీఐ అభినందించడంతోపాటు నగదు రివార్డు అందజేశారు.