KNT sastri
-
కేఎన్టీ శాస్త్రి మృతి
ప్రముఖ దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్టీ శాస్త్రి(73) గురువారం మృతి చెందారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతంలో 1945, సెప్టెంబర్ 5న ఆయన జన్మించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శాస్త్రి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రాహ్మణ కుల సమస్యలపై ఆయన దర్శకత్వం వహించిన ‘తిలదానం’ చిత్రం జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును సొంతం చేసుకుంది. తెలంగాణలో లంబాడీ స్త్రీల జీవన స్థితిగతులు, బాలికల అక్రమ రవాణాపై ఆయన తెరకెక్కించిన ‘కమ్లి’ పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. తిలదానం, సురభి (డాక్యుమెంటరీ) సినిమాలకు ఆయన నంది అవార్డు అందుకున్నారు. శాస్త్రి తెరకెక్కించిన ‘హార్వెస్టింగ్ బేబీస్’ అనే డాక్యుమెంటరీ ఆమ్స్టర్డమ్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై స్పెషల్ జ్యూరీ పురస్కారం అందుకుంది. కేఎన్టీ శాస్త్రి పలు అంతర్జాతీయ, జాతీయ, నంది అవార్డులను అందుకున్నారు. నంది అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబరుగానూ చేశారు. 2003లో అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవానికి చెందిన జ్యూరీ కమిటీలో సభ్యుడిగా, ఆసియన్ పనోరమకు అయిదు సార్లు జ్యూరీ మెంబరుగా చేశారు. ఫిల్మ్ క్రిటిక్‌గా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సాధించిన శాస్త్రి దర్శక– నిర్మాతగానూ, పుస్తక రచయితగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతికి తెలుగు చలన చిత్రదర్శకుల సంఘంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ప్రముఖ తెలుగు దర్శకుడి కన్నుమూత
ప్రముఖ తెలుగు దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్టీ శాస్త్రి కన్నుమూశారు. దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయన పలుమార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన తిలదానం, సురభి(డాక్యుమెంటరీ) చిత్రాలకు నంది అవార్డు కూడా అందుకున్నారు. తెలుగులోనే కాకుండా కొన్ని కన్నడ చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. అంతేకాకుండా పలు చలన చిత్రోత్సవాలకు ఆయన జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు. 2006లో నందితా దాస్ హీరోయిన్గా శాస్త్రి తెరకెక్కించిన కమిలి చిత్రాన్ని దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఆయన దర్శకత్వం వహించిన తిలదానం, కమిలి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమా తీయడం కంటే సందేశాత్మక చిత్రం తీయడానికే మొగ్గు చూపుతానని తెలిపారు. సినీ విమర్శకుడిగా ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు. -
బ్లాక్‌బస్టర్ నాకొద్దు.. సందేశమే ముద్దు..
- ప్రముఖ దర్శకుడు కేఎన్టీ శాస్త్రి అమలాపురం రూరల్ : పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమా తీయడం కంటే సందేశాత్మక చిత్రం తీయడానికే మొగ్గు చూపుతానని ఐదు జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత కేఎన్టీ శాస్త్రి అన్నారు. బాలల కథాంశంతో ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాణు’ చిత్రం షూటింగ్ కోనసీమలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కొంతసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. సాక్షి : సినీ రంగంలో మీ ప్రస్థానం? శాస్త్రి : సినీ విమర్శకుడిగా సినీరంగంపై పుస్తకాలు రాశాను. మొదటిసారి ఉత్తమ సినీ విమర్శకుడిగానే జాతీయస్థాయిలో అవార్డు అందుకున్నాను. ఆ తరువాత ఉత్తమ సినీ పుస్తకాన్ని రచించినందుకు రెండు జాతీయ అవార్డులు, ఉత్తమ సందేశాత్మక చిత్రానికి ఒకసారి అవార్డులందుకున్నాను. సురభి నాటకం డాక్యుమెంటరీకి నేషనల్ అవార్డు వచ్చింది. తిలాదానం చిత్రంతో దర్శకునిగా మారాను. మొత్తం ఐదుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నాను. సాక్షి : అంతర్జాతీయస్థాయిలో కూడా మీ చిత్రం పేరుపొందింది కదా ? శాస్త్రి : బాలివుడ్ నటి నందితాదాస్ హీరోయిన్గా తీసిన ‘కమిలి’ దక్షిణ కొరియాలో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌తోపాటు పది దేశాల్లో ప్రదర్శితమైంది. కర్నాటక ప్రభుత్వం నుంచి బెస్ట్ అవార్డు అందుకుంది. నందితా దాస్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకుంది. ‘తిలాదానం’ చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నాను. సాక్షి : జాతీయ, అంతర్జాతీయస్థాయిలలో పేరొందిన మీరు పెద్ద హీరోలతో సినిమాలు ఎందుకు చేయలేదు? శాస్త్రి : పెద్ద నటులతో, భారీ బడ్జెట్ చిత్రాల జోలికి వెళ్లడం ఇష్టంలేదు. చిన్న బడ్జెట్లో సందేశాత్మక చిత్రం తీయడానికే ప్రాధాన్యతనిస్తాను. ఇప్పటి వరకు పది సినిమాలు తీయగా అన్నీ సందేశాత్మక చిత్రాలే . సాక్షి : ప్రస్తుతం తీస్తున్న సినిమా గురించి ? శాస్త్రి : చిల్ట్రన్ ఫిలిం సొసైటీ బాలల కథాంశంతో ఓ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను నాకు అప్పగించింది. పిల్లల్లో నమ్మకం అనే కథాంశంతో ‘శాణు’ చిత్రాన్ని తీస్తున్నాం. హీరో శివాజీ రాజా, హీరోయిన్ మాధవి తల్లిదండ్రులుగా, జాహ్నవి, మాస్టర్ సాత్విక్ పిల్లలుగా నటిస్తున్నారు. సాక్షి : చిత్రీకరణకు కోనసీమనే ఎంచుకున్నారు.? శాస్త్రి : గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఆడే ఆటలు, పిల్లల్లో నమ్మకం అనే అంశంపై తీస్తున్న చిత్రమిది. ముఖ్యంగా ఖోఖో వంటి ఆటలు పిల్లలు ఆడడమే మానేశారు. కోనసీమ అందాలతో సందేశాన్ని కూడా అందంగా చూపించాలని ఈ ప్రాంతంలో తీస్తున్నాం.