ప్రముఖ దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్టీ శాస్త్రి(73) గురువారం మృతి చెందారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతంలో 1945, సెప్టెంబర్ 5న ఆయన జన్మించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శాస్త్రి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రాహ్మణ కుల సమస్యలపై ఆయన దర్శకత్వం వహించిన ‘తిలదానం’ చిత్రం జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును సొంతం చేసుకుంది. తెలంగాణలో లంబాడీ స్త్రీల జీవన స్థితిగతులు, బాలికల అక్రమ రవాణాపై ఆయన తెరకెక్కించిన ‘కమ్లి’ పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. తిలదానం, సురభి (డాక్యుమెంటరీ) సినిమాలకు ఆయన నంది అవార్డు అందుకున్నారు.
శాస్త్రి తెరకెక్కించిన ‘హార్వెస్టింగ్ బేబీస్’ అనే డాక్యుమెంటరీ ఆమ్‌స్టర్‌డమ్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై స్పెషల్ జ్యూరీ పురస్కారం అందుకుంది. కేఎన్టీ శాస్త్రి పలు అంతర్జాతీయ, జాతీయ, నంది అవార్డులను అందుకున్నారు. నంది అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబరుగానూ చేశారు. 2003లో అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవానికి చెందిన జ్యూరీ కమిటీలో సభ్యుడిగా, ఆసియన్ పనోరమకు అయిదు సార్లు జ్యూరీ మెంబరుగా చేశారు. ఫిల్మ్ క్రిటిక్‌గా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సాధించిన శాస్త్రి దర్శక– నిర్మాతగానూ, పుస్తక రచయితగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతికి తెలుగు చలన చిత్రదర్శకుల సంఘంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment