వైఎస్సార్ సీపీతోనే ‘సంక్షేమం’
కొత్తగూడెం, న్యూస్‌లైన్ : సంక్షేమ రాజ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ఆ పార్టీ అభ్యర్థులు, మద్దతు తెలిపిన వారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని వైఎస్సార్ సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని పాత బస్టాండ్ నుంచి త్రీటౌన్ సెంటర్ వరకు గురువారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా పొంగులేటి మా ట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ ముందుకు వెళుతోందని చెప్పారు.
మహానేత వైఎస్సార్ ఆశయ సాధనకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టికెట్లు అమ్ముకునే సంస్కృతి వైఎస్సార్సీపీకి లేదని, కష్టపడి పని చేసేవారికే గుర్తింపు ఉంటుందని అన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గ అభివృద్ధికి 40 ఏళ్లపాటు కృషి చేశానని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ ఎన్ని కుట్రలు పన్నినా వై ఎస్సార్ సీపీ విజయాన్ని ఆపడం ఎవరితరమూ కాదన్నారు.
దివంగత నేత వైఎస్‌తో కలిసి కొత్తగూడెం నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టానని, 1000 ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో కిన్నెరసాని సాగునీటి పథకాన్ని అందించారని గుర్తు చే శారు. తన హయాంలోనే కొత్తగూడెం సమగ్రాభివృద్ధి జరిగిందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీ తీసుకురావాలని కోరారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు జె.వి.ఎస్.చౌదరి మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ ఉద్యమ కారులను పొట్టనపెట్టుకున్న వారి వా రసులే ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు రావడం దారుణమని విమర్శించారు.
కార్యకర్తలతో పోటెత్తిన ‘గూడెం’...
కొత్తగూడెం పట్టణం వైఎస్సార్ సీపీ జెండాలు, కార్యకర్తలతో పోటెత్తింది. బస్టాండ్ నుంచి త్రీ టౌన్ సెంటర్ వరకు ప్రధాన రహదారి మొత్తం వైఎస్సార్ అభిమానులతో నిండిపోయింది. బస్టాండ్ సెంటర్ వద్ద జే.వి.ఎస్.చౌదరి ఆధ్వర్యంలో యువకులు భారీ సంఖ్యలో హాజరై పొంగులేటి, వనమాలకు స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు.
సుమారు 4 వేల మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి, వనమా మెయిన్ బజార్లో ప్రచారం నిర్వహించారు. ప్రధాన రహదారిలో ఉన్న దుకాణాలలోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్నికల పరిశీలకులు ఆకుల మూర్తి, నాయకులు వనమా రాఘవేంద్రరావు, పట్టణ కన్వీనర్ భీమా శ్రీదర్, చిలక రవి, వాసు, కామేష్, మాజీ కౌన్సిలర్లు గోబ్రియా నాయక్, తోట దేవిప్రసన్న, నాగాసీతారాములు, ఎం.డి.సాదిక్‌పాషా, యూసుఫ్, సీపీఎం డివిజన్ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, నాయకులు జునుమాల నగేష్, మాజీ కౌన్సిలర్ చల్లా శకుంతల పాల్గొన్నారు.