తాగునీటి కోసం ధర్నా
అంతర్రాష్ట్ర రహదారిపై కార్గిల్ కాలనీవాసుల ఆందోళన
ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట బైఠాయింపు
కొడంగల్ : తాగునీటి ఎద్దడిని నివారించాలని పట్టణంలోని కార్గిల్ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల నుంచి నీటి సరఫరా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం కొడంగల్-తాండూరు అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. 39 గ్రామాలకు సమగ్ర రక్షిత మంచినీటిని అందించే కాగ్నా పథకం నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతోంది. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలకు తాగునీటిని అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళలు వాపోయారు.
అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వారకు ధర్నా విరమించేది లేదని డిమాండ్ చేశారు. దీంతో తాండూరు-కొడంగల్ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని సమాచారం అందడంతో ఎస్ఐ సత్యనారాయణరెడ్డి అక్కడికి వచ్చి కాలనీవాసులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా కృషి చేస్తానని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. గురువారం కాలనీకి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.