కోగంటి సత్యం మనుషులు నన్ను చంపుతారేమో!
గణేశ్ సేవాసమితి సాక్షిగా విజయవాడలో రాజకీయాలు మొదలయ్యాయి. సేవాసమితి మీద ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం వర్గాల మధ్య మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. డూండీ గణేశ్ సేవాసమితి గౌరవ అధ్యక్ష పదవి నుంచి కోగంటి సత్యాన్ని తొలగించి... ఆ పదవిని బోండా ఉమాకు కట్టబెడుతూ కమిటీ రిజిస్ట్రేషన్ చేసింది.
దాంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కమిటీ కార్యకలాపాలకు అడ్డొస్తే ఎవరినైనా జైలుకు పంపుతానంటూ బోండా ఉమా హెచ్చరించారు. అయితే, గత ఏడాది సేకరించిన విరాళాల్లో రూ. 30 లక్షలు స్వాహా చేశారని కోగంటి సత్యం ఆరోపించారు. ఇంతలో.. కోగంటి సత్యం వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఉమా వర్గానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఒక్కసారిగా విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. రాకేష్ ఫిర్యాదు మేరకు కోగంటి సత్యాన్ని విచారణకు పిలిపించిన సూర్యారావుపేట పోలీసులు.. ఆయనను అరెస్టు చేశారు. వెంటనే సత్యం వర్గీయులు కూడా పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అటు బోండా ఉమా వర్గీయులు కూడా పోలీసు స్టేషన్ వద్ద మోహరించారు.
ఉమా, సత్యం వర్గీయుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడం, వ్యవహారం అరెస్టుల వరకు వెళ్లడంతో అసలు ఈసారి డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు సక్రమంగా సాగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ గణేశ్ కమిటీ కోసం 8,500 కిలోల లడ్డుతో పాటు, వినాయకుడి చేతిలో ఉంచేందుకు మరో వెయ్యి కిలోల లడ్డూను తాము కానుకగా అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్ యజమాని మల్లిబాబు ఇప్పటికే చెప్పారు. ఈలోపు ఈ వివాదాలు ఏ మలుపు తిరుగుతాయోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.